Published : 01/11/2021 21:30 IST

ఆహా! ఏమి ఈ వీగన్ వంటల రుచి!

వీగన్ డైట్.. ప్రస్తుతం సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు ఫాలో అవుతోన్న ఆహార పద్ధతి ఇది. ఇలా వీగన్స్‌గా మారిపోతూ మూగజీవాల పట్ల తమకున్న ప్రేమను చాటుకోవడమే కాదు.. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతినీ అవలంబిస్తున్నారు చాలామంది. మాంసం, గుడ్లతో పాటు పాలు, జంతువుల నుంచి ఉత్పత్తయ్యే పదార్థాలకు పూర్తి దూరంగా ఉంటూ కేవలం మొక్కల నుంచి లభించే పదార్థాలను మాత్రమే తమ మెనూలో చేర్చుకోవడమే వీగనిజం ముఖ్యోద్దేశం. అయితే ఈ వీగన్ డైట్‌ని నేరుగా ఆహారంలో భాగం చేసుకోవడమే కాదు.. దీంతో వివిధ రకాల వంటకాలను కూడా చేసుకొని రుచికరంగా లాగించేయచ్చు. ‘ప్రపంచ వీగన్‌ దినోత్సవం’ సందర్భంగా అలాంటి కొన్ని యమ్మీ యమ్మీ వీగన్ రెసిపీస్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

పీనట్ బటర్

కావాల్సినవి

* పల్లీలు - అర కిలో

* ఉప్పు - 2 టీస్పూన్స్

* పల్లీల నూనె - 3 టీస్పూన్స్

తయారీ

పల్లీలను బాండీలో వేసి నూనె లేకుండా 10 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. తర్వాత చల్లారనిచ్చి వాటిపై ఉండే పొట్టును తొలగించుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో లేదా ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి, అందులో ఉప్పు కూడా వేసి 5 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఆపై పల్లీల నూనెను కూడా బ్లెండర్‌లో వేసి బాగా మెత్తటి ముద్దగా అయ్యేంత వరకూ బ్లెండ్ చేయాలి. ఇలా తయారైన పీనట్ బటర్‌ని బ్రెడ్, చపాతీలపై రాసుకొని లాగించేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది.

 

టోఫు పాప్స్

కావాల్సినవి

* సోయా పాలు - 1 కప్పు

* నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

* శెనగపిండి - 1 కప్పు

* ఉప్పు - సరిపడా

* మిరియాల పొడి - రుచికి సరిపడా

* నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ

ఒక బౌల్‌లో శెనగపిండి, ఉప్పు, మిరియాల పొడి వేసి నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌపై సోయా పాలను మరిగించి అందులో నిమ్మరసం కలపాలి. దాంతో ఆ పాలు విరిగి ఉండలుగా తయారవుతాయి. ఈ మిశ్రమాన్ని పల్చటి వస్త్రంతో వడకట్టి నీటిని వేరుచేయాలి. దీన్ని ఆ వస్త్రంలోనే గట్టిగా ముడివేసి దానిపై బరువు పెట్టాలి. ఇలా చేయడం వల్ల సోయా పాల ముద్దపై బరువు పడి అది చతురస్రాకారంగా, చదునుగా మారుతుంది. ఓ గంట తర్వాత ఈ పాల ముద్దను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న శెనగపిండి మిశ్రమంలో ముంచి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే! సోయా పాలతో తయారుచేసిన 'టోఫు పాప్స్' సిద్ధం.

 

వీగన్ కప్ కేక్స్

కావాల్సినవి

* సోయా లేదా బాదం పాలు - 1 కప్పు

* వీగన్ బటర్ లేదా వెజిటబుల్ ఆయిల్ - ముప్పావు కప్పు

* చక్కెర పొడి - ముప్పావు కప్పు

* వెనీలా ఎసెన్స్ - టీ స్పూన్

* మైదా పిండి - ముప్పావు కప్పు

* బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్

తయారీ

ముందుగా ఒక గిన్నెలో బటర్, చక్కెర, వెనీలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆపై మైదాపిండి, బేకింగ్ పౌడర్‌ని మరో బౌల్‌లో కలుపుకోవాలి. ఇప్పుడు పాలు, మైదాపిండి మిశ్రమాన్ని.. బటర్-చక్కెర మిశ్రమానికి కొద్దికొద్దిగా కలుపుతూ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృదువుగా ఉండే క్రీమీ బ్యాటర్ సిద్ధమవుతుంది. ఈ బ్యాటర్‌ని కప్ కేక్ మౌల్డ్స్‌లో ముప్పావు వంతు చొప్పున నింపి అవెన్‌లో 180 డిగ్రీల వద్ద అరగంట పాటు బేక్ చేసుకోవాలి. అంతే.. యమ్మీ యమ్మీ వీగన్ కప్ కేక్స్ రడీ!

 

బీట్‌రూట్ హమ్మస్

కావాల్సినవి

* ఉడికించిన శెనగలు - అర కప్పు

* బీట్‌రూట్ ముక్కలు - అర కప్పు

* వెల్లుల్లి రెబ్బలు - 2

* మిరియాలు - పావు టీస్పూన్

* తాహిని సాస్ (నువ్వుల పేస్ట్) - టేబుల్ స్పూన్

* తెల్ల నువ్వులు (గార్నిష్‌కి) - టీస్పూన్

* ఆలివ్ నూనె - 2 టీస్పూన్స్

* ఉప్పు - రుచికి సరిపడా

తయారీ

ఓ ప్యాన్‌లో టీస్పూన్ నూనె వేడి చేసి బీట్‌రూట్ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత వాటిని ఓ ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు బీట్‌రూట్‌తో పాటు మిగిలిన అన్ని పదార్థాలను మిక్సీలో వేసి దానికి సరిపడా నీళ్లని జత చేస్తూ మెత్తని ముద్దలా లేదంటే కాస్త జారుడుగా (మరీ జారుడుగా కాకుండా) బ్లెండ్ చేసుకోవాలి. దానిని ఓ గిన్నెలోకి తీసుకుని ఉడికించిన శెనగలు, తెల్ల నువ్వులతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా తయారైన బీట్‌రూట్ హమ్మస్‌ని క్రిస్పీగా ఉండే స్నాక్స్‌కి డిప్‌లా ఉపయోగించుకోవచ్చు.

 

డెయిరీ ఫ్రీ హాట్ చాక్లెట్

కావాల్సినవి

* కొబ్బరి పాలు - 1 కప్పు

* కోకో పౌడర్ - 2 టేబుల్ స్పూన్స్

* కాఫీ పౌడర్ - పావు కప్పు

* దాల్చిన చెక్క పొడి - కొద్దిగా

* వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్

* తేనె - 2 టేబుల్ స్పూన్స్

తయారీ

ముందుగా కొబ్బరి పాలను గిన్నెలోకి తీసుకొని ఒక్క పొంగు వచ్చే వరకు మరిగించాలి. ఆపై అందులోనే మిగిలిన పదార్థాలన్నీ వేసి గరిటతో బాగా తిప్పుతూ మరిగించుకోవాలి. ఆ మిశ్రమం కాస్త చిక్కబడేంత వరకూ మరిగించి.. దాన్ని బౌల్స్ లేదా కప్స్‌లో పోయాలి. ఆఖరుగా దాల్చిన చెక్కలతో గార్నిష్ చేసుకోవచ్చు. వేడి వేడిగా చాక్లెట్‌ని ఇష్టపడే వారు ఈ డెయిరీ ఫ్రీ హాట్ చాక్లెట్‌ని అలాగే తాగేయచ్చు.. లేదంటే దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా కూడా తీసుకోవచ్చు. ఇలా ఎలా తీసుకున్నా సరే.. 'ఆహా! అద్భుతంగా ఉంది కదూ.. ఈ కొబ్బరి పాల చాక్లెట్ డ్రింక్' అనడం ఖాయం.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని