Published : 12/11/2022 13:25 IST

Vegan Diet: అవి కేవలం అపోహలు మాత్రమే..!

ప్రస్తుతం పలువురు ఎదుర్కొనే వివిధ ఆరోగ్య సమస్యలకు మారిన ఆహారపు అలవాట్లే కారణమని నిపుణులు చెప్పడం మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ సమస్యలను దూరం చేసుకోవడానికి ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు పాటించే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వీగన్‌ డైట్‌కు ప్రాముఖ్యం పెరిగింది. శాకాహారానికి కాస్త భిన్నంగా ఉండే ఈ విధానంలో పాలు, తేనె, డెయిరీ ఉత్పత్తులతో పాటు జంతువుల నుంచి లభించే ఆహారపదార్థాలకు కూడా దూరంగా ఉంటారు. అయితే ఈ డైట్‌కి సంబంధించి కొన్ని అపోహలు కూడా లేకపోలేదు. మరి వాటి గురించి సంబంధిత నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

అపోహ: ఈ డైట్ ద్వారా శరీరానికి సరిపడ పోషకాలు అందవు..

వాస్తవం: గేదె, ఆవు నుంచి లభించే పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుందని చాలామందికి తెలిసిందే. అలాగే మాంసాహారంలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీగన్లు వీటికి దూరంగా ఉండడం వల్ల వారికి సరిపడ పోషకాలు లభించవని అనుకుంటారు. అయితే ఇది పూర్తిగా అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. మొక్కల ఆధారిత ఆహార పదార్థాల్లో కూడా ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. బ్రకలీ, ఓట్స్‌, బీన్స్‌, నట్స్‌, క్వినోవా, బచ్చలికూర, తృణధాన్యాలు వంటి వాటిల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే పాలకు బదులుగా సోయా, కొబ్బరి, బాదం.. వంటి పదార్థాల నుంచి తీసిన పాలలో కూడా క్యాల్షియం అధికంగానే ఉంటుంది. అంతేకాదు.. మాంసాహారం నుంచి లభించే పోషకాలతో పోల్చుకుంటే వీగన్‌ పదార్థాల్లో లభించే ప్రొటీన్లు, క్యాల్షియంను శరీరం తొందరగా గ్రహిస్తుంది.

అపోహ: ఈ డైట్‌ ఖర్చుతో కూడుకున్నది..

వాస్తవం: వీగన్‌ డైట్‌ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. అని కొంతమంది భావిస్తారు.  దీనికి సంబంధించిన కొన్ని ఆహార పదార్థాలు ప్యాకేజ్‌డ్ ఫుడ్స్‌గా లభిస్తుంటాయి. సాధారణంగా ప్యాకేజ్‌డ్‌ ఫుడ్‌ ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఖర్చుతో కూడకున్నదనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఇది వాస్తవం కాదు. మాంసాహారంతో పోలిస్తే వీగన్లు ఎక్కువగా తీసుకునే తృణధాన్యాలు, కాయగూరలు, ఆకుకూరలు చాలావరకు అందుబాటు ధరల్లోనే లభిస్తుంటాయి.

అపోహ: ఈ డైట్‌ పాటించడం కష్టం...

వాస్తవం: సాధారణ డైట్‌ నుంచి వీగన్‌ లైఫ్‌స్టైల్‌కి మారడం చాలా కష్టమని అనుకుంటారు. ప్రత్యేకించి మాంసాహారం నుంచి వీగన్‌ డైట్‌కి మారడం కొంచెం కష్టమైన విషయమే అనుకునే వారు ఎందరో. అయితే మన దృష్టి ఏయే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటున్నామన్న దానిపై కాకుండా ఏయే పదార్థాలను తినొచ్చన్న వాటిపైన కేంద్రీకరిస్తే.. ఇలాంటి అపోహలు ఉండవంటున్నారు నిపుణులు. నిజంగా వీగన్‌ వంటకాలను పరిశీలిస్తే ఎన్నో రకాల వెరైటీలు కనిపిస్తాయి. అలాగే నాన్‌వెజ్‌కి బదులుగా మొక్కల ఆధారిత మాంసాహార ఉత్పత్తులు కూడా లభిస్తున్నాయి. కాబట్టి, వీగన్‌ డైట్‌కి తొందరగానే అలవాటు పడచ్చంటున్నారు నిపుణులు.

అపోహ: గర్భంతో ఉన్నవారు ఈ డైట్‌ పాటించకూడదు..

వాస్తవం: మహిళలు గర్భం ధరించిన తర్వాత ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. చాలామంది పోషకాల కోసం మాంసం, పాలు, గుడ్లు.. మొదలైన వాటిని ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే వీగన్లు వీటిని తీసుకోరు కాబట్టి గర్భిణులకు ఈ డైట్‌ మంచిది కాదనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ, ఇది వాస్తవం కాదు. మొక్కల ఆధారిత ఆహారపదార్థాల్లో కూడా గర్భిణులకు కావాల్సిన ప్రొటీన్లు, ఐరన్‌, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాదు.. గర్భధారణ సమయంలో వచ్చే పలు రిస్క్‌లను కూడా ఇవి తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అపోహ: వీగన్లు ఆరోగ్యంగా ఉండరు..

వాస్తవం: మాంసం, పాలు, గుడ్లు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారనే అపోహ చాలామందిలో ఉంటుంది. వీగన్లు ఇవేవీ తీసుకోరు కాబట్టి, వారు ఆరోగ్యంగా ఉండరని చాలామంది అనుకుంటారు. ఇది కూడా అపోహే అంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా చేసిన పలు పరిశోధనల్లో మాంసాహారం తినడం వల్ల మధుమేహం, క్యాన్సర్‌, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని తేలింది. అయితే వీగన్‌ డైట్‌ పాటించే వారికి ఈ రిస్క్‌ తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే కొత్తగా ఈ డైట్‌ని పాటించాలనుకునేవారు ఒకసారి సంబంధిత నిపుణులను సంప్రదించి తమ శరీర తత్వాన్ని బట్టి ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని