నేను ఎంత ఎదిగినా ఈవిడే మా అమ్మ..!

ఆమెకు ముందు ఆ కుటుంబంలో ఏ ఆడపిల్లా డిగ్రీ చదవలేదు... ఉద్యోగమూ చేయలేదు. అందుకే కూరగాయలమ్మి తనను చదివించిన తల్లి రెక్కల కష్టాన్ని వృథా చేయకూడదనుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఉన్నత చదువులు అభ్యసించింది. మాస్టర్స్‌ డిగ్రీ అందుకుని ప్రముఖ ఎంఎన్‌సీలో మంచి ఉద్యోగం సంపాదించింది. తాజాగా ప్రమోషన్‌ కూడా పొందింది. 

Published : 18 Jun 2021 17:33 IST

Photo: LinkedIn

ఆమెకు ముందు ఆ కుటుంబంలో ఏ ఆడపిల్లా డిగ్రీ చదవలేదు... ఉద్యోగమూ చేయలేదు. అందుకే కూరగాయలమ్మి తనను చదివించిన తల్లి రెక్కల కష్టాన్ని వృథా చేయకూడదనుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఉన్నత చదువులు అభ్యసించింది. మాస్టర్స్‌ డిగ్రీ అందుకుని ప్రముఖ ఎంఎన్‌సీలో మంచి ఉద్యోగం సంపాదించింది. తాజాగా ప్రమోషన్‌ కూడా పొందింది. 
ఈ క్రమంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ‘కూరగాయలమ్మే ఓ తల్లికి కూతురిగానే చెప్పుకోవడానికి గర్వపడతాను’ అంటూ తన లింక్డ్‌ ఇన్‌ ప్రొఫైల్లో ఓ పోస్ట్‌ పెట్టింది. తల్లీకూతుళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోన్న ఈ పోస్ట్‌ అందరినీ కదిలిస్తోంది. ప్రముఖ కాంగ్రెస్‌ నాయకురాలు శర్మిష్ఠా ముఖర్జీ ట్విట్టర్‌ వేదికగా వీరిద్దరిపై ప్రశంసలు కురిపించడం విశేషం. ఇంతకీ ఆ పోస్టులో ఏముందో తెలుసుకుందాం రండి.
డిగ్రీ చదివిన మొదటి ఆడపిల్లను నేనే!
‘నా పేరు మధు ప్రియ. చెన్నై నా స్వస్థలం. మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. అమ్మ కూరగాయలమ్మి నన్ను చదివించింది. మా కుటుంబంలో డిగ్రీ దాకా చదువుకున్న మొదటి అమ్మాయిని నేనే. ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశాను. క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఓ టాప్ ఎంఎన్‌సీలో సీనియర్‌ హెచ్‌ ఆర్‌ అసోసియేట్‌గా ఉద్యోగం సంపాదించాను. 2019లో విధుల్లో చేరిన నాకు తాజాగా అసోసియేట్‌ మేనేజర్‌గా ప్రమోషన్ వచ్చింది.’

అమ్మపై బాగా కోపమొచ్చేది!
‘మా కుటుంబంలో ఇలా బయటకొచ్చి ఉద్యోగం చేస్తున్న మొదటి మహిళను కూడా నేనే. ఈ సందర్భంగా మా అమ్మ గురించి కొన్ని విషయాలు పంచుకుందామని ఇలా మీ ముందుకొచ్చాను. నేను చదువుకుంటున్న రోజుల్లో క్రమం తప్పకుండా పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగులు జరిగేవి. అయితే ఎప్పుడు సమావేశం జరిగినా అమ్మ ఆలస్యంగా, కొన్నిసార్లైతే ఆఖరులో వచ్చేది. కారణం అడిగితే మౌనమే తన సమాధానమయ్యేది. దీంతో తనపై నాకు బాగా కోపమొచ్చేది. కొన్నేళ్ల పాటు ఇలాగే సాగింది. కానీ స్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ డే రోజున ఈ విషయంపై నోరు విప్పింది. నా క్లాస్‌మేట్స్‌ తల్లిదండ్రుల్లో చాలామంది ప్రముఖ సెలబ్రిటీలు, పేరున్న వ్యాపారవేత్తలేనని...అలాంటి వారి ముందు నేను ఓ కూరగాయల వ్యాపారి కూతురని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే పేరెంట్స్‌ మీటింగ్‌లకు ఆలస్యంగా వచ్చేదాన్నని అసలు విషయం చెప్పింది. ఆ సమయంలో నా నోటి వెంట మాట రాలేదు. అమ్మను సరిగా అర్థం చేసుకోనందుకు... అదేవిధంగా మా క్లాస్‌మేట్స్, స్నేహితులందరికీ తనను చూపించి ‘ఈవిడే మా అమ్మ’ అని గర్వంగా చెప్పే అవకాశం రానందుకు ఎంతో బాధపడ్డాను’.


నా మొదటి ప్రమోషన్‌ అమ్మకు అంకితం!
‘రెండేళ్ల క్రితం జాబ్‌లో చేరిన నాకు ఇటీవల మొదటి ప్రమోషన్‌ వచ్చింది. అమ్మ అందించిన నిరంతర ప్రోత్సాహంతోనే ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను. అయితే నేను ఎంత ఎత్తుకు ఎదిగినా కూరగాయలమ్మే ఓ తల్లికి కూతురని చెప్పుకోవడానికి గర్వపడతాను. మా అమ్మ గురించి, నన్ను చదివించేందుకు తను పడిన తాపత్రయం గురించి ప్రపంచంతో పంచుకోవడానికి ఇదే మంచి సందర్భం. నాకు వచ్చిన మొదటి ప్రమోషన్‌ను అమ్మకు అంకితమిస్తున్నాను’ అంటూ తల్లిపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది మధుప్రియ.
ఆమె కలలన్నీ సాకారమవ్వాలి!
ఈ క్రమంలో మధుప్రియ షేర్ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ప్రముఖ కాంగ్రెస్‌ నాయకురాలు శర్మిష్ఠా ముఖర్జీ దీనిపై స్పందిస్తూ ‘మధుప్రియ, ఆమె కుటుంబానికి అభినందనలు. ఆమె కలలన్నీ సాకారం కావాలి’ అని రాసుకొచ్చారు. ఆమెతో పాటు పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఈ తల్లీకూతుళ్ల పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్