ఆయన ఆశయం కోసం...రూ.4.50కోట్ల విరాళం!

పుట్టిపెరిగిన ఊరికి ఏదైనా చేయాలన్నది భర్త కల. దానికి శ్రీకారం చుట్టేలోపే ఈ ప్రపంచాన్ని వీడారాయన. అప్పటిదాకా తనకు తోడూనీడగా ఉన్న భర్త అకాల మరణాన్ని తట్టుకోలేకపోయారామె.

Published : 09 Jul 2024 01:34 IST

పుట్టిపెరిగిన ఊరికి ఏదైనా చేయాలన్నది భర్త కల. దానికి శ్రీకారం చుట్టేలోపే ఈ ప్రపంచాన్ని వీడారాయన. అప్పటిదాకా తనకు తోడూనీడగా ఉన్న భర్త అకాల మరణాన్ని తట్టుకోలేకపోయారామె. కానీ బాధపడుతూ కూర్చోవడం కంటే ఆయన సంకల్పానికి జీవం పోయడమే ముఖ్యమనుకున్నారు. సేవాకార్యక్రమాలు చేపట్టడమే కాదు... రూ.4.50 కోట్ల విరాళంతో పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు... వెలగపూడి విజయలక్ష్మి.

విజయలక్ష్మి స్వస్థలం యనమలకుదురు. ఏళ్ల క్రితమే విజయవాడలో స్థిరపడ్డారు. భర్త ఉమామహేశ్వరరావు చేయి తిరిగిన ఎలక్ట్రీషియన్‌. విజయవాడతోపాటు చుట్టుపక్కల 100 గ్రామాల్లో ఆయనకు మంచి పేరుంది. వ్యవసాయ బోర్ల మోటార్ల మరమ్మతులకు ఆయన్నే పిలిపించుకునేవారు. సొంత గ్రామానికి సరిగా వైద్యసేవలు అందట్లేదు. ఆసుపత్రి కట్టించి అక్కడి ప్రజలకు సాయపడాలి అనుకునేవారు ఉమామహేశ్వరరావు. ఇద్దరు పిల్లలూ అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనా పని నుంచి విరామం తీసుకున్నాక... ఆలోచనని ఆచరణలో పెట్టడానికి ఇదే మంచి సమయం అనుకున్నారాయన. తీరా ప్రయత్నం మొదలు పెడదాం అనుకుంటుండగా గుండెపోటుతో చనిపోయారు.

ఆయన మరణాన్ని భార్య విజయలక్ష్మి తట్టుకోలేకపోయారు. భర్త ఆలోచనల్లోనే రోజంతా గడిపేవారు. మానసికంగా కుంగిపోయారు కూడా. భౌతికంగా ఎలాగూ దూరమయ్యారు. ఆయన ఆశయాన్నైనా బతికించాలి అనుకున్నారామె. ఇదే విషయాన్ని కొడుకులతో పంచుకున్నారు విజయలక్ష్మి. వాళ్లూ తమ మద్దతు తెలపడంతో సమాజసేవ చేయాలన్న నిర్ణయానికి వచ్చారామె. భర్త చనిపోయిన రెండు నెలల్లో ‘వెలగపూడి ట్రస్టు’ను ప్రారంభించారు. ఆపై యనమలకుదురులో ఆసుపత్రి నిర్మాణానికి ఏమేం కావాలో, ఎవరిని సంప్రదించాలో తెలుసుకుంటూ వచ్చారు. తొలి అడుగు స్థలం దగ్గరే సమస్య ఎదురైంది. సెంటు భూమి కనీసం రూ.20లక్షలు పలికింది. ఎంత ప్రయత్నించినా అదీ ఊరికి దగ్గరగా దొరకలేదు. దీంతో ఊళ్లో ఉండే భర్త స్నేహితుడు సంగ నరసింహారావును సంప్రదించారు. ఆయన విషయాన్ని అప్పటి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన గ్రామ సచివాలయం ఆవరణలోని ఖాళీ స్థలంలో 36 సెంట్ల భూమిని కేటాయించడంతోపాటు కట్టబోయే ఆసుపత్రిని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి పట్టణ ఆరోగ్య కేంద్రంగానూ మంజూరు చేయించారు. అలా ఏడాది క్రితం ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది. ఇటీవలే నిర్మాణమూ పూర్తయ్యింది. తాజాగా వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులోకీ వచ్చింది. దీని నిర్మాణానికి విజయలక్ష్మి రూ.4.50కోట్లు విరాళంగా ఇచ్చారు. విజయలక్ష్మి ప్రయత్నంతో పది పడకల ఆసుపత్రి... వైద్యాధికారి, స్టాఫ్‌నర్సులు, అయిదుగురు ఏఎన్‌ఎమ్‌లు, 28 మంది ఆశావర్కర్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యపరికరాలను ఆసుపత్రి కోసం తెప్పించారు. ఆవరణ చుట్టూ పచ్చదనానికీ ప్రాధాన్యమిచ్చారు. యనమలకుదురులో దాదాపు 50 వేల మంది జనాభా ఉంటే... వీరిలో 80 శాతం పేదలే. గతంలో వీరంతా వైద్యసేవలకోసం పది కి.మీ. దూరంలోని పెనమలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. ఆసుపత్రి రాకతో ఊరికి ఆ బాధలు తప్పాయి.
‘మాదీ మధ్యతరగతి కుటుంబమే. మావారు కష్టజీవి. స్వగ్రామానికి ఏదైనా చేయాలన్న ఆయన తపనని మా పెళ్లైన తొలినాళ్లలోనే గమనించా. మా పిల్లలిద్దరూ మెరిట్‌పైనే చదువుకొని స్థిరపడ్డారు. వారి అండతో మావారి ఆశయం పూర్తిచేయడం ఆనందంగా ఉంది’ అంటున్నారు విజయలక్ష్మి. అంతేకాదు, భర్తపోయిన రెండేళ్లలో ఊళ్లోని దేవాలయానికీ రూ.1.70కోట్లు విరాళమిచ్చారు. హైదరాబాద్‌లోని ఓ అనాథాశ్రమంలోని పదిమంది ఇంటర్‌ విద్యార్థులను దత్తత తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లు ఇంజినీరింగ్‌లో చేరారు. చదువే మనిషి స్థితిగతులను మారుస్తుందని నమ్ముతారామె. అందుకే ప్రతిభగల పేద విద్యార్థులను మరింత మందిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్నీ పెట్టుకున్నారు విజయలక్ష్మి.

 వి. ప్రసాద్, పెనమలూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్