ఈ గార్లిక్ క్రషర్స్ మీ వంటింట్లో ఉన్నాయా?
వంటలకు రుచిని తీసుకొచ్చే అమోఘమైన పదార్థాలు మన వంటింట్లో బోలెడుంటాయి. అలాంటి వాటిలో వెల్లుల్లిది కీలకపాత్ర. అయితే చాలామంది వెల్లుల్లి తినడానికి ఇష్టపడరు. అందుకు దాని ఘాటైన వాసన కూడా ఓ కారణమే. అందుకే వాటిని కూరల్లో వేసినా సరే.. పక్కన పెట్టేస్తుంటారు. మరి, అలాకాకుండా వెల్లుల్లిని తురిమి వంటల్లో ఉపయోగిస్తే అది కూరలో కలిసిపోతుంది..
వంటలకు రుచిని తీసుకొచ్చే అమోఘమైన పదార్థాలు మన వంటింట్లో బోలెడుంటాయి. అలాంటి వాటిలో వెల్లుల్లిది కీలకపాత్ర. అయితే చాలామంది వెల్లుల్లి తినడానికి ఇష్టపడరు. అందుకు దాని ఘాటైన వాసన కూడా ఓ కారణమే. అందుకే వాటిని కూరల్లో వేసినా సరే.. పక్కన పెట్టేస్తుంటారు. మరి, అలాకాకుండా వెల్లుల్లిని తురిమి వంటల్లో ఉపయోగిస్తే అది కూరలో కలిసిపోతుంది.. తద్వారా అది మన శరీరానికి అందుతుంది. ఐడియా బానే ఉంది.. కానీ వెల్లుల్లి రెబ్బల్ని తురమడమే కాస్త కష్టంతో కూడుకున్న పని అంటారా? ఇకపై అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెల్లుల్లిని సులభంగా తురమడానికి ఉపయోగపడే బోలెడన్ని గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. మరి, ఆ గార్లిక్ క్రషింగ్ గ్యాడ్జెట్లేంటో తెలుసుకొని మన వంటింట్లో వాటికి చోటిచ్చేద్దాం రండి..
గార్లిక్ ప్రెస్
ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి రెబ్బల్ని పేస్ట్‌లా చేసుకోవాలంటే మిక్సీలో వేసేస్తే సరి. కానీ కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీలో వేసి పేస్ట్‌లా లేదంటే చిన్న చిన్న ముక్కల్లా చేస్తానంటే అది కుదరకపోవచ్చు. అందుకే మన కూరల్లో వేసుకొనే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తురిమే పనిని మరింత సులభం చేయడానికి మార్కెట్లో అందుబాటులో ఉంది 'గార్లిక్ ప్రెస్'. ఫొటోలో చూపించినట్లుగా అచ్చం లైమ్ స్క్వీజర్‌లా ఉండే ఈ ప్రెస్‌కి రెండు హ్యాండిల్స్ ఉంటాయి. మధ్యలో ఉండే ప్రెసర్‌కి పైన ఉండే ప్లేట్‌పై పదునుగా ఉండే రంధ్రాల్లాంటి బ్లేడ్స్ ఉంటాయి. కింది భాగంలో చిన్న బౌల్ ఉండి దానికి కింద చిన్న చిన్న రంధ్రాలుంటాయి. ఇప్పుడు ఇందులో పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బల్ని ఉంచి.. ప్రెస్ చేయడం వల్ల ఆ తురుము రంధ్రాల్లోంచి కిందికి వస్తుంది. దాన్ని కూరల్లో వేసేసుకుంటే పని సులువవుతుంది. ఈ ప్రెస్‌ని శుభ్రం చేయడం కూడా సులువు. కేవలం ఇదే కాదు.. ఇలాంటి గార్లిక్ ప్రెస్‌లలో కొన్నింటికి వెల్లుల్లి పొట్టు తీసే పీలర్స్ కూడా అటాచ్ అయి ఉంటాయి.
గార్లిక్ డైసర్ చాపర్
మరీ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కాకుండా కొన్ని ఎక్కువ రెబ్బల్ని తురమాలంటే 'గార్లిక్ డైసర్ చాపర్' అందుకు చక్కటి ఎంపిక. ఫొటోలో చూపించినట్లుగా చూడడానికి ఇది పూస చేసుకునే గొట్టం లేదా మెషీన్‌లా ఉంటుంది. కింది భాగంలో ఒక పొడవాటి గొట్టం దానికి కింద రంధ్రాలుండే ప్లేట్ ఉంటుంది. ఈ గొట్టంలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి.. దానిపై ఫొటోలో చూపించినట్లుగా రొటేషన్ హ్యాండిల్‌లా ఉండే మూత బిగించి హ్యాండిల్‌తో తిప్పుతుండాలి. ఇలా చేయడం వల్ల హ్యాండిల్‌కు అడుగున ఉండే ప్లేట్ కిందికి జరుగుతూ వెల్లుల్లిని క్రష్ చేస్తుంది. ఇది కింద ఉండే రంధ్రాల ద్వారా బయటికి వచ్చేస్తుంది. ఇలా ఎంతో ఈజీగా వెల్లుల్లిని చిన్న ముక్కలుగా లేదంటే పేస్ట్‌లా చేసుకోవచ్చు.
మినీ గార్లిక్ క్రషర్
చేతికి అనువుగా ఉండి, వెల్లుల్లి తురిమే పనిని మరింత ఈజీ చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న గార్లిక్ క్రషర్స్‌లో 'మినీ గార్లిక్ క్రషర్' ఒకటి. ఫొటోలో చూపించినట్లుగా అచ్చం ప్రెసర్‌లా ఉండే దీనికి కింది భాగంలో ఒక చిన్న బౌల్ అమరి ఉంటుంది. దానిపై పదునైన బ్లేడ్స్, పైభాగంలో ఉండే మూతకు కింది వైపు పదునైన ప్రెసర్స్ ఉంటాయి. ఫొటోలో మాదిరిగా పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని బ్లేడ్స్‌పై ఉంచి మూతతో ప్రెస్ చేయడం వల్ల అవి ముక్కలై కింది బౌల్‌లో పడిపోతాయి. సో.. అన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ముక్కలుగా చేశాక మూత తీసి వాటిని నేరుగా కూరల్లో లేదంటే ఇతర వంటకాల్లో వేస్తే సరి.
ప్రెస్ రొటేట్ గార్లిక్ క్రషర్
కూరల్లో లేదంటే ఇతర వంటకాల్లో వాడే వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసుకోవడానికి ఇంట్లో చిన్న పాటి గిర్నీ ఉంటే బాగుండేది అనుకుంటున్నారా? అయితే 'ప్రెస్ రొటేట్ గార్లిక్ క్రషర్'ను కొనేస్తే సరి. ఫొటోలో చూపించినట్లుగా మినీ గిర్నీలా ఉండే ఈ క్రషర్‌కి ఓవైపు వెల్లుల్లి రెబ్బలు వేసుకునే వీలుంటుంది. మరోవైపు పైన రొటేటర్ ఉండి.. దానికి కింద లోపలి వైపు పదునైన బ్లేడ్స్ ఉంటాయి. ఈ రొటేటర్‌ని తిప్పుతున్న క్రమంలో వెల్లుల్లి రెబ్బలు ఒక్కొక్కటిగా ఆ బ్లేడ్స్‌తో క్రష్ అవుతూ కింద ఉండే రంధ్రాల నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని వేస్తూ, హ్యాండిల్‌ని తిప్పుతూ చాలా సులభంగా వెల్లుల్లి పేస్ట్‌ని తయారుచేసుకోవచ్చు. చేతికి అనువుగా, భలే బాగుంది కదూ ఈ గార్లిక్ గిర్నీ.
గార్లిక్ క్రషర్ మాషర్
వెల్లుల్లి రెబ్బల్ని మృదువైన పేస్ట్‌లా మార్చడానికి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రషర్స్‌లో 'గార్లిక్ క్రషర్ మాషర్' ఒకటి. ఫొటోలో చూపించినట్లుగా కింద బౌల్, దానిపై అడుగున బ్లేడ్స్ ఉండే మరో బౌల్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో పొట్టు తీసేసిన వెల్లుల్ని రెబ్బల్ని వేసి.. పైనున్న ప్రెసర్ లాంటి మూతను బలంగా నొక్కుతూ తిప్పడం వల్ల ఆ వెల్లుల్లి రెబ్బలు బ్లేడ్స్ మధ్యలో పడి నలిగిపోతాయి. అలా తయారైన పేస్ట్ కింది భాగంలో ఉన్న బౌల్‌లోకి చేరుతుంది. దీన్ని నేరుగా మనం తయారుచేసే ఆహార పదార్థాల్లో వేసేసుకుంటే సరిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.