మరో విరాట్ కోహ్లీ అయిపోతా..!
ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడే క్రీడ అనే అభిప్రాయం ఉండేది. కానీ, ఎప్పుడైతే మహిళలు క్రికెట్లోకి అడుగుపెట్టి రాణించడం మొదలుపెట్టారో ఈ అభిప్రాయం మారిపోయింది. వారిని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది అమ్మాయిలు క్రికెట్లోకి అడుగుపెట్టడానికి....
(Photos: Screengrab)
ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడే క్రీడ అనే అభిప్రాయం ఉండేది. కానీ, ఎప్పుడైతే మహిళలు క్రికెట్లోకి అడుగుపెట్టి రాణించడం మొదలుపెట్టారో ఈ అభిప్రాయం మారిపోయింది. వారిని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది అమ్మాయిలు క్రికెట్లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో- లద్దాఖ్‌కు చెందిన టీనేజర్ మక్సూమా అద్భుతమైన క్రికెట్ షాట్లు ఆడుతూ ఔరా అనిపిస్తోంది. ఆరో తరగతి చదువుతోన్న ఈ అమ్మాయి పాఠశాలలో క్రికెట్ ఆడుతోన్న వీడియోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్‌పురి, ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్.. వంటి వారు కూడా ఆమె ఆటను మెచ్చుకుంటూ ఆ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీనే తనకు స్ఫూర్తి అంటున్న మక్సూమా గురించి తెలుసుకుందాం రండి..
నాన్న ఆటను చూసి..
మక్సూమా లద్దాఖ్‌లోని కక్సర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తండ్రి క్రికెట్ ఆడుతుండడం చూసి మక్సూమా కూడా క్రికెట్ ఆడడం మొదలుపెట్టింది. అలా క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. అప్పటినుంచి అటు తండ్రి, ఇటు పాఠశాలలోని టీచర్లు ప్రోత్సహించడంతో క్రికెట్‌లో రాణిస్తోంది. ఆమె ఆటను చూసిన డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారి వారి ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి మక్సూమా ఇంటర్‌నెట్ సెన్సేషన్‌గా మారింది. ఆ వీడియోని ఇప్పటివరకు దాదాపు 6 లక్షల మందికి పైగా వీక్షించారు. అంతేకాదు.. కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్‌పురి, ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్ ఆమె ఆటను కొనియాడారు.
ఈ సందర్భంగా మక్సూమా మాట్లాడుతూ ‘నా చిన్నతనంలో నాన్న క్రికెట్ ఆడడాన్ని చూశాను. అప్పటి నుంచి నాకు కూడా క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. నాన్న కూడా నన్ను క్రికెట్ ఆడమని ప్రోత్సహించాడు. విభిన్న క్రికెట్ షాట్లు కూడా నేర్పిస్తుంటాడు. ధోనీ ఆడే ‘హెలికాప్టర్ షాట్’ కూడా నేర్పించాడు. ఇప్పుడు దానిని ప్రాక్టీస్ చేస్తున్నా.. పాఠశాలలోని టీచర్లు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. నాతో పాటు చాలామంది అమ్మాయిలు క్రికెట్ ఆడుతున్నారు. వారికి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చింది. తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరని అడిగితే విరాట్ కోహ్లీ అని చెప్పే మక్సూమా భవిష్యత్తులో విరాట్ లాగే క్రికెట్‌లో రాణించాలని ఉందని చెప్పుకొచ్చింది.
ఆన్‌సైడ్ షాట్లు అద్భుతం!
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్‌పురి ఆమె వీడియోని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘అద్భుతమైన ప్రతిభ ఉన్న మక్సూమా విరాట్ కోహ్లీలాగా అవ్వాలనుకుంటోంది. కానీ, మైదానంలో ఆమె కొట్టే షాట్లు చూస్తే చాలామంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఆమె లాంటి క్రికెటర్ కావాలనుకుంటారు’ అని రాసుకొచ్చారు.
ఇక ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్ ఆ వీడియోని పోస్ట్ చేస్తూ ‘ఆమె కలలు సాకారం కావాలని కోరుకుంటున్నా. తను ఆడే కొన్ని ఆన్‌సైడ్ షాట్లు అద్భుతంగా ఉన్నాయి. దేశం నలుమూలల నుంచి అమ్మాయిలు క్రికెట్ ఆడడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.
ఏమో ఎవరికి తెలుసు?మక్సూమా క్రీడా ప్రస్థానం ఇలాగే కొనసాగితే మరో మిథాలీ, మరో విరాట్ తప్పకుండా అవుతుందేమో? అమ్మాయిలైతే ఏంటి.. కోరుకున్న రంగంలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించడానికి ఏమాత్రం వెనకాడరనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? గుడ్ లక్ మక్సూమా!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.