చీరలో ఉత్సాహంగా పరిగెడుతూ..!

కరోనా తర్వాత చాలామందిలో ఫిట్‌నెస్‌పై అవగాహన ఏర్పడింది. ఈ క్రమంలోనే చాలామంది తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మొదలుపెట్టారు. వాకింగ్‌, జాగింగ్‌, రన్నింగ్‌లతో పాటు పలు రకాల వ్యాయామాలను దినచర్యలో భాగం చేసుకోవడం ఇందులో భాగమే. అయితే చాలామందిలో వ్యాయామాలు చేయాలంటే...

Updated : 23 Sep 2022 21:51 IST

కరోనా తర్వాత చాలామందిలో ఫిట్‌నెస్‌పై అవగాహన ఏర్పడింది. ఈ క్రమంలోనే చాలామంది తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మొదలుపెట్టారు. వాకింగ్‌, జాగింగ్‌, రన్నింగ్‌లతో పాటు పలు రకాల వ్యాయామాలను దినచర్యలో భాగం చేసుకోవడం ఇందులో భాగమే. అయితే చాలామందిలో వ్యాయామాలు చేయాలంటే టీ షర్ట్, ప్యాంట్స్, షార్ట్స్ లాంటివి మాత్రమే ధరించాలనే అభిప్రాయం ఉంటుంది. ముఖ్యంగా నిత్యం చీరలు ధరించే మహిళల్లో ఈ అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనంటూ  దాదాపు 2000 మంది మహిళలు చీరలు ధరించి మారథాన్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది.

ఆ అపోహను పోగొట్టడానికి...

బెంగళూరుకు చెందిన ‘జయానగర్‌ జాగ్వార్స్‌’ అనే సంస్థ ఫిట్‌నెస్‌కు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. వీటిలో రన్నింగ్‌ మారథాన్‌లూ ఉంటాయి. ఈ క్రమంలో సంప్రదాయ వస్త్రధారణను పాటించే చాలామంది మహిళలకు జాగింగ్‌ చేయాలంటే చీరలు ధరించకూడదనే అపోహ ఉందని తెలుసుకుంది. ఈ అపోహలకు తోడు పలు సామాజిక కారణాల వల్ల చాలామంది మహిళలు ఫిట్‌నెస్‌ సంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని భావించింది. దాంతో అలాంటి మహిళల్లో స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రత్యేకంగా మహిళల కోసం ‘The Saree Run’ పేరుతో 3K/5K మారథాన్‌ని నిర్వహించింది. ఇందులో చీరలు మాత్రమే ధరించాలనే నియమం పెట్టింది. ఈ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష ఆదరణ లభించింది. దాదాపు 2000 మంది మహిళలు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. తద్వారా రన్నింగ్‌ చేయడానికి చీరలు ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించారు.

ట్విట్టర్‌లో వైరల్‌ !

ఈ మారథాన్‌కు సంబంధించిన వీడియోని ఓ వ్యక్తి తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్స్‌ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కొంతమంది మారథాన్‌కు సంబంధించిన వివరాలు అడగ్గా, మరికొంతమంది కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను అభినందిస్తూ కామెంట్‌ చేశారు. మారథాన్‌లో పాల్గొన్న కొంతమంది మహిళలు కూడా తమ ఫొటోలతో రీట్వీట్‌ చేయడం విశేషం.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని