Updated : 22/06/2021 15:39 IST

అలాంటి వివక్షను నేనూ ఎదుర్కొన్నా..!

‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అంటూ మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుకున్నా నిత్యం ఏదో ఒక చోట ఆడవారు వివక్ష బారిన పడుతూనే ఉన్నారు. పురుషుల చేతిలో అణచివేతకు గురవుతూనే ఉన్నారు. ఇక రంగుల ప్రపంచంగా చెప్పుకునే సినిమా ఇండస్ట్రీలోనైతే ఈ అసమానతలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాను కూడా ఇలాంటి అసమానతలు ఎదుర్కొన్నానంటోంది విద్యాబాలన్.

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకున్న హీరోయిన్లలో విద్యాబాలన్‌ ఒకరు. ‘పరిణీత’, ‘ఇష్కియా’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘డర్టీ పిక్చర్‌’, ‘పా’, ‘కహానీ’, ‘బాబీ జాసూస్‌’, ‘బేగం జాన్‌’, ‘తుమ్హారీ సులు’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘శకుంతలా దేవి’ వంటి ఎన్నో మహిళా ప్రాధాన్య చిత్రాల్లో ఆమె నటించి మెప్పించింది. తాజాగా ‘షేర్నీ (ఆడ పులి)’ సినిమాతో మన ముందుకు వచ్చింది. ఇందులో విద్య ఫారెస్ట్‌ అధికారిగా నటించింది. మనుషులను చంపుతున్న పులిని పట్టుకునే బృందానికి నాయకురాలి పాత్రలో ఆమె నటించింది.  అయితే మహిళ కావడంతో ఆమె పనితీరుపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తారు. ‘ఓ మహిళ చెబితే మేం చేయాలా’ అన్న వివక్షాపూరిత ధోరణితో వ్యవహరిస్తారు.

ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నా!
ఈ క్రమంలో ‘షేర్నీ’ సినిమాలో లాగానే తన వ్యక్తిగత జీవితంలోనూ వివక్ష ఎదుర్కొన్నానంటోంది విద్య. బాడీ షేమింగ్‌, బాడీ పాజిటివిటీ లాంటి అంశాలపై తనదైన శైలిలో స్పందించే విద్య తాజాగా సినిమా పరిశ్రమలోని లింగ వివక్షపై నోరు విప్పింది. 
‘వివక్ష అనేది మనకు అన్నిచోట్లా ఎదురవుతుంది. కేవలం మగవారి నుంచి మాత్రమే కాదు.. ఒక్కోసారి మహిళల నుంచి కూడా ఈ సమస్య ఎదురవ్వచ్చు. పితృస్వామ్య వ్యవస్థ మాదిరిగానే ఈ అసమానతల నుంచి బయటపడడం అంత సులభమేమీ కాదు. గతంతో పోల్చుకుంటే కొంచెం తగ్గింది కానీ... ఇప్పటికీ చాలా విషయాల్లో నాకు వివక్ష ఎదురవుతోంది. అంతేకాదు... నా చుట్టూ ఉన్న చాలామంది కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ఇది నాకెంతో ఆగ్రహం తెప్పిస్తుంది’. 

హీరోల డేట్స్‌ను బట్టే మా కాల్షీట్లు!
‘నేను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఇలాంటి అసమానతలు ఎక్కువగా ఎదుర్కొన్నాను. హీరోల కాల్షీట్లను బట్టే నా డేట్స్‌ను కూడా సర్దుబాటు చేసుకోవాలని డైరెక్టర్లు, నిర్మాతలు సూచించేవారు. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలైనా, కథానాయకుడి కంటే నా పాత్రకు ప్రాధాన్యమున్నా సరే.. ఏ మాత్రం పట్టించుకునేవారు కాదు. ముందు హీరోల డేట్స్ తీసుకున్నాకే మా కాల్షీట్లను ఎడ్జస్ట్‌ చేసేవారు’ అని చెప్పుకొచ్చిందీ స్టార్‌ హీరోయిన్.

అలాంటి ఆడ పులుల కథే ఈ ‘షేర్నీ’!
‘షేర్నీ’ అంటే తెలుగులో ‘ఆడ పులి’ అని అర్థం. పేరు చూడగానే ఇదేదో అడవి, క్రూర జంతువుల వేట నేపథ్యంలో సాగే కథ అని చాలామంది అనుకోవచ్చు. కథా నేపథ్యం అలాంటిదే అయినా నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, ఇతర సమస్యలు కూడా ఈ చిత్రంలో అంతర్లీనంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ‘షేర్నీ’ లాగానే సమాజంలో వేటగాళ్లలాంటి మగాళ్ల అకృత్యాలకు బలవుతున్న ఎందరో ఆడ పులుల జీవితాలు ఈ సినిమాలో ప్రతిబింబిస్తాయి. 

కథేంటంటే..!
మధ్యప్రదేశ్‌లోని ఓ అటవీ గ్రామంలో సంచరిస్తున్న పులిని పట్టుకోవడానికి డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా విద్యావిన్సెంట్‌ (విద్యాబాలన్‌) అక్కడకు వస్తుంది. అయితే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కారణంతో స్థానిక రాజకీయ నాయకులు ఆమె విధి నిర్వహణకు అడ్డుపడతారు. ఉన్నతాధికారులు కూడా సహకరించరు. పైగా ‘ఒక మహిళా ఉద్యోగి చెబితే మేం వినాలా? అన్నట్లు వివక్షాపూరిత ధోరణితో వ్యవహరిస్తారు. ‘ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మహిళా అధికారిని నియమించారా’? అంటూ గ్రామస్తులు కూడా విద్యను ఎద్దేవా చేస్తూ మాట్లాడతారు.  పురుషాధిక్య సమాజంలో మహిళా ఉద్యోగి ఏ స్థాయిలో ఉన్నా అవహేళనలు, వెక్కిరింపులు మాత్రం తప్పవన్న విషయాన్ని ఈ సన్నివేశాలు ప్రతిబింబిస్తాయి. అదేవిధంగా కొంతమంది వర్కింగ్ విమెన్ అత్తవారింటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వారిపై ఎంత ఒత్తిడి ఉంటుందో విద్య పాత్ర చెప్పకనే చెబుతుంది. మరి ఇన్ని సమస్యలను అధిగమించి ఈ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పులిని ఎలా పట్టుకుందన్నదే ‘షేర్నీ’ సినిమా సారాంశం.

ఇటు గృహిణిగా.. అటు ఉద్యోగినిగా..
మహిళా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన విద్య ఈ సినిమాలోనూ అద్భుతంగా నటించింది. విద్యా విన్సెంట్‌గా డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ క్యారక్టర్‌లో ఆమె ఒదిగిపోయింది. ఇటు గృహిణిగా అత్తింటి వారి నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు.. అటు ఉద్యోగినిగా ఎదురయ్యే సవాళ్ల మధ్య నలిగిపోయే ఓ సాధారణ మహిళగా విద్య అభినయం ఆకట్టుకుంది.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని