Vidya Balan : అందుకే ఆ యాంగిల్‌లో ఫొటోలకు ‘నో’ చెప్పేదాన్ని!

ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే క్రమంలో మనకు బాగా నచ్చిన, నప్పిన యాంగిల్‌లోనే పోజులిస్తుంటాం. ఒకవేళ నచ్చని యాంగిల్స్‌లో ఫొటో క్లిక్‌మనిపించినా.. దాన్ని ఎవరూ చూడకముందే మొబైల్‌/కెమెరా నుంచి తొలగిస్తుంటాం. అంతేనా.. ‘ఎందుకో నాకు ఈ యాంగిల్‌ అస్సలు నప్పదు.. ఈ పోజ్‌లో అందవిహీనంగా.....

Published : 24 Aug 2022 17:05 IST

(Photos: Instagram)

ఫొటోలు, సెల్ఫీలు తీసుకునే క్రమంలో మనకు బాగా నచ్చిన, నప్పిన యాంగిల్‌లోనే పోజులిస్తుంటాం. ఒకవేళ నచ్చని యాంగిల్స్‌లో ఫొటో క్లిక్‌మనిపించినా.. దాన్ని ఎవరూ చూడకముందే మొబైల్‌/కెమెరా నుంచి తొలగిస్తుంటాం. అంతేనా.. ‘ఎందుకో నాకు ఈ యాంగిల్‌ అస్సలు నప్పదు.. ఈ పోజ్‌లో అందవిహీనంగా కనిపిస్తుంటా..’ అని తమను తాము నిందించుకునే వారూ లేకపోలేదు. గతంలో తానూ ఇలాగే చేసేదాన్నని చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార విద్యా బాలన్‌. కుడి కంటే ఎడమవైపు యాంగిల్‌ నుంచే ఫొటోలకు పోజివ్వడానికి ఇష్టపడేదాన్నని చెప్పే ఈ ముద్దుగుమ్మ.. ఓ సందర్భంలో తనకెదురైన ఓ అనుభవం నుంచి స్ఫూర్తి పొందానంటోంది. ఈ క్రమంలోనే ఇలాంటి ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడి.. ఎలా ఉన్నా తనను తాను అంగీకరించడం మొదలుపెట్టానంటూ తనలోని బాడీ పాజిటివిటీని చాటేలా ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది విద్య. స్వీయ ప్రేమ గొప్పతనాన్ని చాటేలా ఉన్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

బాలీవుడ్‌లో విలక్షణ నటనకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది అందాల నటి విద్యా బాలన్‌. ఎన్నో మహిళా ప్రాధాన్య పాత్రల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. మహిళా అంశాలపైనా ఆయా వేదికలపై స్పందించడానికి వెనకాడదు. ముఖ్యంగా బాడీ షేమింగ్‌ సమస్యలపై ఎక్కువగా స్పందించే విద్య.. గతంలో తాను ఎదుర్కొన్న ఈ తరహా సమస్యల్నీ ఎన్నోసార్లు తెరపైకి తీసుకొచ్చింది. వాటిని జయించి స్వీయ ప్రేమను పెంచుకున్న తీరును వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటుంది. బాడీ పాజిటివిటీ గురించి ఇలా ఎంతోమందిలో స్ఫూర్తి నింపే ఈ చక్కనమ్మ.. ఇదే అంశంపై తాజాగా మరో పోస్ట్‌ని షేర్‌ చేసింది.

ఆ అమ్మాయితో సెల్ఫీ.. ఆలోచనలో పడేసింది!

ఓ సందర్భంలో అద్దం పక్కన నిలబడి కుడి, ఎడమవైపు యాంగిల్స్‌లో తీసుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్న విద్య.. తనకెదురైన ఓ అనుభవాన్ని ఇలా చెప్పుకొచ్చింది. ‘ఇటీవలే నేను ఓ కార్యక్రమంలో పాల్గొన్నా. చాలా ఎక్కువ మంది జనం అక్కడికి వచ్చారు. అంతలోనే ఓ అమ్మాయి నాతో సెల్ఫీ దిగాలని నా వద్దకొచ్చింది. ఇద్దరం కలిసి ఫొటో దిగాం. కానీ ఆ ఫొటో తనకు నచ్చలేదని, మరో ఫొటో కోసం అభ్యర్థించింది. అయితే అప్పటికే మా మేనేజర్‌ ‘ఇది వరకే తీసుకున్నారు కదా మేడమ్‌!’ అంటూ ఆమెను వారించే ప్రయత్నం చేశారు. కానీ ‘ఆ యాంగిల్‌లో నా ఫొటో అంత బాగా రాదు.. దీన్ని నేను పోస్ట్‌ చేయలేను..’ అంటూ రిక్వెస్ట్‌ చేసింది. కారు దాకా నన్ను ఫాలో అయింది. నేను కాదనలేక ఆమె కోరిక మేరకు తనతో కలిసి మరో ఫొటోకు పోజిచ్చా. అయితే ఇలా ఆ అమ్మాయి ప్రవర్తించిన తీరు నన్ను ఆలోచనలో పడేసింది. దాంతో వెంటనే నా గత జ్ఞాపకాలు నా మదిలో మెదిలాయి.

అప్పుడు రియలైజ్‌ అయ్యా!

సాధారణంగా నేను ఫొటోలకు పోజిచ్చేటప్పుడు కుడి కంటే ఎడమవైపు యాంగిల్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తానన్న సంగతి చాలామందికి తెలుసు! నేను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ప్రతి ఫొటోలోనూ ఈ తేడాను మీరు గమనించచ్చు. ఎందుకంటే నా కుడివైపు యాంగిల్‌ నాకే నచ్చదు. ఫొటోగ్రాఫర్స్‌, సినిమాటోగ్రాఫర్స్‌కి కూడా ఆవైపు నుంచి షూటింగ్‌ చేయద్దని చెప్పేదాన్ని. ఎవరైనా నాకు తెలియకుండా కుడివైపు యాంగిల్‌లో ఫొటోలు తీస్తారేమోనన్న భయం కూడా నాలో ఉండేది. ఇలాంటి ఆలోచనలు క్రమంగా నన్ను ఒత్తిడి, ఆందోళనల్లోకి నెట్టేసేవి. కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి అచ్చం నాలా ప్రవర్తించిందో అప్పుడే ఇది సరికాదని తెలుసుకున్నా. ‘ఒక యాంగిల్‌ను ఇష్టపడడమంటే.. నా శరీరంలోని మరో భాగాన్ని విస్మరించడమే’ అన్న విషయం గ్రహించా. అప్పట్నుంచి నన్ను నేను ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం మొదలుపెట్టా. ఇప్పుడు నేను ఏ యాంగిల్‌లోనైనా ఫొటోలకు పోజివ్వడానికి మొహమాటపడట్లేదు.. భయపడట్లేదు. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు ఎడమ కంటే కుడివైపు యాంగిల్‌నే మరింతగా ఇష్టపడుతున్నా. ఈ స్వీయ ప్రేమే నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేసింది. అందుకే యాంగిల్స్‌తో సంబంధం లేకుండా అద్దం ముందు ధైర్యంగా నిలబడి ఇప్పుడు ఈ సెల్ఫీలు తీసుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది విద్య.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్