Vidya Balan: అందగాడు.. అర్థం చేసుకుంటాడు.. అందుకే నచ్చాడు!
యుక్త వయసు నుంచే అమ్మాయిలు తమ పెళ్లి గురించి కలలు కనడం సహజమే! తమకు కాబోయే వాడు అందంగా ఉండాలి.. తమను అర్థం చేసుకోవాలి.. అని కోరుకుంటారు. కానీ పెళ్లికి ముందు తనకు మాత్రం ఇలాంటి కోరికలేవీ...
(Photos: Instagram)
యుక్త వయసు నుంచే అమ్మాయిలు తమ పెళ్లి గురించి కలలు కనడం సహజమే! తమకు కాబోయే వాడు అందంగా ఉండాలి.. తమను అర్థం చేసుకోవాలి.. అని కోరుకుంటారు. కానీ పెళ్లికి ముందు తనకు మాత్రం ఇలాంటి కోరికలేవీ లేవంటోంది బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్. అసలు పెళ్లే చేసుకోవద్దనుకున్న తనకు సిద్ధార్థ్ తారసపడడంతో తన మనసు మార్చుకున్నానని చెబుతోంది. తమ పదకొండేళ్ల వైవాహిక బంధంలో తన భర్త తనను ఎంత ప్రేమించాడో, అన్ని విషయాల్లోనూ అంత ప్రోత్సహించాడని అంటోన్న విద్య.. ఇలాంటి భర్త దొరకడం నిజంగా అదృష్టమంటోంది. ప్రస్తుతం తన చిత్రం ‘నీయత్’ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటోన్న ఈ ముద్దుగుమ్మ.. తన పెళ్లి, వైవాహిక జీవితం, తనకెదురైన ఆరోగ్య సమస్యలు.. తదితర విషయాల గురించి పంచుకుంది.
బాలీవుడ్ తెరపై విభిన్న చిత్రాలకు, విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది విద్య. 2012, డిసెంబర్ 14న ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను వివాహమాడిన ఈ చక్కనమ్మ.. ‘బేగం జాన్’, ‘తుమారీ సులూ’, ‘శకుంతలా దేవి’.. వంటి మహిళా ప్రాధాన్య చిత్రాలతోనూ తనకు తిరుగులేదనిపించింది. ఇక గతేడాది ‘జల్సా’తో మన ముందుకొచ్చిన విద్య.. ప్రస్తుతం ‘నీయత్’ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది.
చూడగానే నచ్చేశాడు!
తన సినిమా ప్రమోషన్లలో భాగంగా.. ఈ చిత్ర విశేషాలతో పాటు తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలూ పంచుకుంది విద్య. ఈ క్రమంలోనే సిద్ధార్థ్‌తో తన ప్రేమ, పెళ్లి గురించి కూడా బయటపెట్టిందీ బబ్లీ బ్యూటీ.
‘మీరు నమ్ముతారో లేదో కానీ.. అసలు నేను పెళ్లే చేసుకోకూడదనుకున్నా. ఒక వివాహితగా నన్ను నేనెప్పుడూ ఊహించుకోలేదు. కానీ నా 26 ఏళ్ల వయసులో ‘పరిణీత’ చిత్రంలో నటించాను. 30 ఏళ్లొచ్చే సరికి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా.. అప్పుడనిపించింది.. ఈ విషయాలన్నీ ఎవరితోనైనా పంచుకోవాలని! నా జయాపజయాల గురించి నా మనసుకు నచ్చిన వ్యక్తితో షేర్ చేసుకోవాలని! సరిగ్గా ఇదే సమయంలో సిద్ధార్థ్ నాకు పరిచయమయ్యాడు. తొలిచూపులోనే నచ్చేశాడు. ఇద్దరి మధ్య ఎంతో ఆత్మీయత ఉందనిపించింది. తను చూడ్డానికి అందంగా ఉంటాడు. ఇప్పటివరకు నాకు తెలిసిన వాళ్లందరిలోకెల్లా అందగాడు! మా నాన్నలాగే తనకూ ఆత్మవిశ్వాసం ఎక్కువ. నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు.. నమ్మకస్థుడు, నిజాయతీపరుడు.. నిరాడంబరమైన వ్యక్తి. ఈ లక్షణాలే సిద్ధార్థ్‌తో ప్రేమలో పడేలా చేశాయి.. ఇక ముందు తనే ప్రపోజ్ చేశాడు.. ఆపై కొన్నేళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. పెళ్లయ్యాక నా జీవితం మరింత అత్యుత్తమంగా మారింది. ప్రతి విషయంలోనూ ప్రోత్సహించే భాగస్వామి దొరకడం నిజంగా నా అదృష్టం!’ అంటూ చెప్పుకొచ్చింది విద్య.
అప్పుడే పీసీఓఎస్ బారిన పడ్డా!
తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌కు సంబంధించిన అనుభవాల్ని, తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా బయటపెట్టే విద్య.. తనకెదురైన బాడీ షేమింగ్, ఇతర విమర్శల గురించి కూడా పలు సందర్భాల్లో పంచుకుంది. అయితే గతంలో తన జీవితంలో జరిగిన ఓ సంఘటన వల్ల ఒకప్పుడు పీసీఓఎస్, హార్మోన్ సంబంధిత సమస్యలతో బాధపడ్డానంటూ తన జీవితానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిందీ బాలీవుడ్ అందం.
‘మా అక్క ప్రియ పుట్టాక.. అమ్మ తన రెండో సంతానంగా అబ్బాయే కావాలనుకుంది. కానీ నేను పుట్టా. ఒకానొక సందర్భంలో తను ఈ విషయం చెప్పాక.. అబ్బాయి కంటే అమ్మాయే బెటర్ అనేలా నన్ను నేను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నా. మా కుటుంబంలో అబ్బాయిలూ ఉన్నారు.. వారికి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం చూసి అలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. అయితే ఓసారి మా నాన్న, మా అంకుల్ మధ్య జరిగిన చిన్న సంభాషణ నాకు ఇప్పటికీ గుర్తే!
‘కొడుకులు లేరని బాధపడకు.. నా కొడుకు నన్ను చూసుకున్నట్లే నిన్నూ ప్రేమగా చూసుకుంటాడు..’ అని మా అంకుల్ నాన్నతో అన్నాడు. ఈ మాటలు విని నాకు చాలా కోపం వచ్చింది. ఆ పక్కనే కూర్చున్న నేను, అక్క.. ‘మా నాన్నను కొడుకులే చూసుకోవాల్సిన అవసరం లేదు. మేమిద్దరం ఉన్నాంగా.. తనను పువ్వుల్లో పెట్టి చూసుకోవడానికి!’ అన్నాం. నిజానికి ఆ సంభాషణ అక్కడితో ముగియలేదు.. నా మనసుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.. ప్రతి విషయంలోనూ అబ్బాయిలతో పోటీ పడేలా నన్ను ప్రేరేపించేది.. ఈ ఒత్తిడే క్రమంగా నాలో పీసీఓఎస్, హార్మోన్ల సంబంధిత సమస్యలకు దారితీసింది..’ అందీ అందాల తార.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.