Vidya Balan: ఆ డైట్‌తో బరువు తగ్గా!

ఎప్పుడూ ఒకే శరీరాకృతిని మెయింటెయిన్‌ చేసే వాళ్లు.. ఉన్నట్లుండి బరువు తగ్గినా, పెరిగినా ఇట్టే తెలిసిపోతుంది. మారిన వాళ్ల శరీరాకృతిని చూసి ఓవైపు ఆశ్చర్యపోయినా.. మరోవైపు అందుకు కారణమేంటో తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. ప్రస్తుతం బాలీవుడ్‌ బబ్లీ బ్యూటీ విద్యాబాలన్‌ను చూసి ఫ్యాన్స్‌ ఇలాగే షాకవుతున్నారు.

Published : 18 Jun 2024 14:06 IST

(Photo: Instagram)

ఎప్పుడూ ఒకే శరీరాకృతిని మెయింటెయిన్‌ చేసే వాళ్లు.. ఉన్నట్లుండి బరువు తగ్గినా, పెరిగినా ఇట్టే తెలిసిపోతుంది. మారిన వాళ్ల శరీరాకృతిని చూసి ఓవైపు ఆశ్చర్యపోయినా.. మరోవైపు అందుకు కారణమేంటో తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. ప్రస్తుతం బాలీవుడ్‌ బబ్లీ బ్యూటీ విద్యాబాలన్‌ను చూసి ఫ్యాన్స్‌ ఇలాగే షాకవుతున్నారు. ఆమె బరువు తగ్గి స్లిమ్‌గా మారడమే ఇందుకు కారణం! తాజాగా ఓ సినిమా స్క్రీనింగ్‌కి హాజరైన విద్య.. స్టైలిష్‌ లుక్‌లో నాజూగ్గా దర్శనమిచ్చింది. తానిలా బరువు తగ్గడం వెనకున్న సీక్రెట్‌నూ బయటపెట్టింది. మరి, అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కొంతమంది సన్నగా ఉంటే బాగుంటారు.. మరికొందరు కాస్త చబ్బీగా ఉన్నప్పుడే అందంగా కనిపిస్తారు. ఎప్పుడూ కాస్త బబ్లీగా ఉండే విద్యకు ఈ శరీరాకృతి చక్కగా నప్పుతుంది. అయితే ఎప్పుడూ ఇదే శరీరాకృతిని మెయింటెయిన్‌ చేసే ఈ భామ.. ఈ మధ్య బరువు తగ్గి స్లిమ్‌గా తయారైంది. తాజాగా కార్తీక్‌ ఆర్యన్‌ నటించిన ‘చందూ ఛాంపియన్‌’ సినిమా స్క్రీనింగ్‌కి ఇలాంటి స్లిమ్‌ లుక్‌లోనే హాజరైంది. దాంతో ఫ్యాన్స్‌ ‘తను విద్యాబాలనేనా?’ అన్నంతగా ఆశ్చర్యపోయారు. ఓవైపు విద్య స్లిమ్‌ లుక్‌కి ఫిదా అవుతూనే.. మరోవైపు తానిలా బరువు తగ్గడం వెనకున్న అసలు సీక్రెట్‌ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

నచ్చిందే చేస్తా!

‘చందూ ఛాంపియన్‌’ సినిమా స్క్రీనింగ్‌కి హాజరైన విద్య.. నలుపు రంగు వెస్టర్న్‌ అవుట్‌ఫిట్‌లో దర్శనమిచ్చింది. వదులైన స్లీవ్స్‌తో ఆమె లుక్‌ ఇనుమడించిందని చెప్పచ్చు. గోల్డెన్‌ ఇయర్‌ రింగ్స్‌, హై-హీల్స్‌, పోనీ హెయిర్‌స్టైల్‌, తక్కువ మేకప్‌తో మెరిసిపోయిన ఈ భామ.. తానిలా బరువు తగ్గి నాజూగ్గా మారడానికి తాను పాటించిన ఆహార నియమాలే కారణమంటూ ఓ సందర్భంలో పంచుకుంది.

‘నా జీవితంలో బరువు విషయంలో ఎన్నో అనుభవాలున్నాయి. గతంలో హార్మోన్ల సమస్య కారణంగా బరువు పెరిగాను.. ఈ క్రమంలో చాలామంది నన్ను విమర్శిస్తుంటే నేనూ నా శరీరాన్ని అసహ్యించుకునేదాన్ని. ఒక్కోసారి కోపం, చిరాకు ఆవహించేవి. నాజూగ్గా మారి నన్ను నేను నిరూపించుకోవాలని నా శరీరాన్ని ఇబ్బంది పెట్టిన రోజులూ ఉన్నాయి. కానీ ఇది సరికాదని ఆ తర్వాత రియలైజ్‌ అయ్యా. అప్పట్నుంచి బరువు పెరిగినా, తగ్గినా, ఎలా ఉన్నా నన్ను నేను స్వీకరించడం మొదలుపెట్టా. దాంతో నా శరీరంపై నాకు ఇష్టం పెరిగింది. తగ్గాలనిపించినప్పుడు తగ్గుతున్నా. నేను ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారమే తీసుకుంటా. గ్లూటెన్‌ ఫుడ్స్‌కి దూరంగా ఉంటా. ఏది తీసుకున్నా పచ్చివి మాత్రం అస్సలు తీసుకోను..’ అంది విద్య. ఇలా ‘No Raw Food Diet’ తాను బరువు తగ్గడంలో, చక్కటి శరీరాకృతిని మెయింటెయిన్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పకనే చెప్పిందీ ముద్దుగుమ్మ.

ఏంటీ ‘No Raw’ డైట్?

పేరుకు తగినట్లే పచ్చివి తీసుకోకపోవడం ఈ డైట్‌లో కీలకం! కాయగూరలు, మాంసం, ఇలా రోజువారీ తీసుకునే ఆహార పదార్థాలేవైనా.. పచ్చిదనం పోయే వరకు ఉడికించడం లేదంటే ఇతర పద్ధతుల్లో వండుకొని తీసుకోవడం వల్ల వీటిలోని పోషకాలు శరీరానికి అందడమే కాదు.. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి సులభంగా జీర్ణమవుతుందంటున్నారు నిపుణులు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు.. ఈ ఆహార నియమాలు పాటించడం మంచిదంటున్నారు.

ఎన్నో ప్రయోజనాలు!

కొన్ని రకాల పచ్చి ఆహార పదార్థాల్ని తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

⚛ ముఖ్యంగా మాంసం, గుడ్లు, పాశ్చరైజేషన్‌ చేయని పాలు-పాల పదార్థాల్లో ఈ-కొలై, సాల్మొనెల్లా.. వంటి హానికారక బ్యాక్టీరియా ఉంటుంది. వీటిని నేరుగా తీసుకోవడం, సరిగ్గా ఉడికించకపోవడం వల్ల ఈ బ్యాక్టీరియా పొట్టలోకి చేరి వివిధ అనారోగ్యాలకు దారి తీస్తుంది. అదే సరైన ఉష్ణోగ్రత వద్ద వీటిని ఉడికిస్తే ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులకు దూరంగా ఉండచ్చంటున్నారు నిపుణులు.

⚛ ఆహార పదార్థాల్ని ఉడికించడం వల్ల.. వాటిలో ఉండే సంక్లిష్టమైన ప్రొటీన్‌, ఫైబర్‌.. వంటి పోషకాలు విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్‌, కడుపుబ్బరం.. వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఇలా ఆహారం ఉడికించుకొని తీసుకోవడమే మేలు!

⚛ ఆయా పదార్థాల్ని ఉడికించిన తర్వాతే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్‌.. వంటి పోషకాల్ని శరీరం త్వరగా గ్రహిస్తుంది. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే టొమాటో, క్యారట్‌.. వంటివి ఉడికించుకొని తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అదే మరికొన్ని పోషకాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద నిర్వీర్యమైపోతాయట! కాబట్టి ఏ పదార్థాల్ని ఎంత ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలో పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

⚛ ఉడికించడం వల్ల ఆహారం రుచి కూడా పెరుగుతుంది. ఇది ఆహారాన్ని ఆస్వాదించడంలో, తద్వారా సమతుల ఆహారాన్ని తీసుకోవడంలో మనల్ని ప్రేరేపిస్తుంది.

పోషకాలు తరిగిపోకుండా..!

అయితే ‘No Raw’ డైట్ వల్ల ఆరోగ్యానికి పలు ప్రయోజనాలున్నప్పటికీ.. కొన్ని పదార్థాల్ని ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు నశించే అవకాశమూ ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఆ పోషకాలు తరిగిపోకుండా వండుకోవాలంటున్నారు. ఈ క్రమంలో స్టీమింగ్‌, మైక్రోవేవింగ్‌, సాటింగ్‌.. వంటి పద్ధతులు మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటివల్ల ఆయా పదార్థాల రుచి పెరగడంతో పాటు వాటిలోని పోషకాలూ పూర్తి స్థాయిలో శరీరానికి అందే అవకాశాలు ఎక్కువంటున్నారు. అలాగే కొంతమంది పచ్చి కాయగూరల్ని నీటిలో ఉడికిస్తుంటారు. దీనివల్ల ‘బి’, ‘సి’.. వంటి నీటిలో కరిగే విటమిన్లు నశించిపోతాయి. కాబట్టి ఇలాంటి కుకింగ్‌ పద్ధతులకు దూరంగా ఉండడం మేలు!

బ్యాలన్స్‌ తెలియాలి!

అయితే పచ్చి ఆహారం వల్ల పలు అనారోగ్యాలెదురవుతాయి.. కాబట్టి ప్రతిదీ వండుకొనే తినాలా? అంటే.. కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని రకాల పదార్థాల్ని పచ్చిగా తీసుకున్నప్పుడే వాటిలోని అత్యవసర పోషకాలు, ఎంజైమ్స్‌, ఫైబర్‌.. వంటివి పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయంటున్నారు. ముఖ్యంగా డ్రైఫ్రూట్స్‌, పండ్లు, పండ్ల రసాలు, మొలకెత్తిన గింజలు, నట్స్‌, విత్తనాలు.. వంటివి పచ్చిగానే తీసుకోవాలట! కాబట్టి ప్రతిదీ పచ్చిగా తీసుకోవడం, ప్రతిదీ ఉడికించుకొని తీసుకోవడం కాకుండా.. వ్యక్తిగత ఆరోగ్యం, అవసరాల్ని బట్టి ఈ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు శరీరానికి అందే అవకాశం ఎక్కువంటున్నారు. ఈ క్రమంలో పోషకాహార నిపుణుల సలహాలు తీసుకోవడం మరీ మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్