Published : 17/11/2021 19:27 IST

ఇంటికి ‘వింటేజ్‌’ హంగులు!

ఇంటిని అలంకరించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కళ! కొంతమంది తమ ఇంటికి ఆధునిక హంగులద్దాలనుకుంటే.. మరికొందరు పాతకాలపు వస్తువులు, ఫర్నిచర్‌తో తమ కలల సౌధాన్ని ‘వింటేజ్‌’ మయం చేసుకోవాలనుకుంటారు. అయితే నాటి కాలం.. నాటి వస్తువులతో ఇంటిని అలంకరిస్తే లుక్‌ పోతుందేమోనన్న సందేహం కూడా కొంతమందిలో ఉంటుంది. కానీ వింటేజ్‌ ఫర్నిచర్‌కే ఆధునిక సొబగులద్ది సరికొత్తగా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు డిజైనర్లు. అంతేకాదు.. ఇలాంటి వింటేజ్‌ ఫర్నిచర్‌/వస్తువులతో ఇంటిని అలంకరించే క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

* చాలామందికి హాల్‌, బెడ్‌రూమ్‌ గోడలకు ఫొటోఫ్రేములు అతికించడం అలవాటు! అయితే వింటేజ్‌ లుక్‌ కోరుకునే వారు.. నాటి కాలానికి సంబంధించిన బ్యాండ్‌ పోస్టర్లు, మ్యూజిక్‌ పోస్టర్లు; సినిమా లవర్స్‌ అయితే పాత తరం హీరో-హీరోయిన్ల బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు; వింటేజ్‌ కార్లు-బైక్‌లకు సంబంధించిన వాల్‌ పోస్టర్లు.. వంటివి అంటించుకోవచ్చు. అదీ కాకపోతే.. మీ కుటుంబ సభ్యులు పాత కాలంలో దిగిన ఫొటోలతో ఓ ఫ్రేమ్‌ను తయారుచేయించి దాన్ని గోడకు తగిలించుకున్నా.. వింటేజ్‌ లుక్‌ వస్తుంది.

* ఇంటి అలంకరణలో భాగంగా గోడ మొత్తాన్ని వాల్‌ పెయింటింగ్స్‌తో తీర్చిదిద్దుకోవడం లేదంటే నచ్చిన వాల్‌ స్టిక్కర్‌ని అతికించడం.. ఇప్పుడు కామనైపోయింది. అయితే ఈ విషయంలో వింటేజ్‌ హంగుల్ని కోరుకునే వారు.. నాటి కాలాన్ని ప్రతిబింబించేలా రెట్రో ప్రింట్స్‌, నేచర్‌ థీమ్‌ వాల్‌ పేపర్స్‌, వింటేజ్‌ యానిమల్‌ ప్రింటెడ్‌ తరహావి.. ఇలా విభిన్నమైన వాల్‌ పేపర్స్‌ని కొని అతికించుకోవచ్చు.

* పాత కాలంలో రాగి, ఇత్తడి వస్తువుల్ని ఎక్కువగా వాడే వారు. వాటిని కేవలం వంట పాత్రలుగానే కాదు.. ఇంటి అలంకరణలోనూ భాగం చేసేవారు. ఇంటికి వింటేజ్‌ సొబగులద్దాలనుకునే వారు ఇదే ట్రెండ్‌ని కొనసాగించచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రాగి/ఇత్తడి గంగాళంలో నీళ్లు నింపి.. అందులో పూలు పేర్చి.. గుమ్మానికి ఎదురుగా అమర్చచ్చు. లేదంటే రాగి/ఇత్తడి గ్లాసులు, జార్‌లను ఫ్లవర్‌ వేజ్‌లుగా ఉపయోగించుకోవచ్చు.. అదీ కాదంటే ఆయా లోహాలతో తయారుచేసిన విభిన్న అలంకరణ వస్తువులు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంతేకాదు.. ఇక వాటి అవసరం లేదు అని పక్కన పడేసే గ్రామోఫోన్‌ వంటి పాత కాలపు వస్తువుల్నీ హాల్‌లోని టేబుల్‌పై అమర్చినా ఇల్లు కళకళలాడిపోతుందనడంలో సందేహం లేదు.

* ఇంటికి వింటేజ్‌ హంగులద్దాలనుకునే వారు ఇంట్లో వాడే ఫ్యాబ్రిక్స్‌ విషయంలోనూ పలు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఈ క్రమంలో చేనేత వస్త్రాలు, కాటన్‌-లినెన్‌, జ్యూట్‌.. వంటి మెటీరియల్స్‌తో రూపొందించిన కర్టెన్లు, బెడ్‌షీట్స్‌, సోఫా కవర్లు, దిండు కవర్లు, రగ్గులు.. వంటివి వాడాలి. ఇందులోనూ పెద్ద పెద్ద పూలు, జామెట్రిక్‌ ప్రింట్స్‌, సిటీ థీమ్‌తో రూపొందించినవి.. పాత కాలపు లుక్‌ని అందిస్తాయి.

* చెక్క అల్మరాలు, కుర్చీలు, టేబుల్స్‌, టిపాయ్‌.. వంటివన్నీ పాతబడిపోయాయంటూ మూలకు పడేస్తుంటారు చాలామంది. అయితే వీటితో ఇంటికి వింటేజ్‌ లుక్‌ని అందించచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చెక్కతో చేసిన టీపాయ్‌పై ఓ చక్కటి ఫ్లోరల్‌ ప్రింటెడ్‌ క్లాత్‌ని పరిచి ఉపయోగించుకోవడం, చిన్న చిన్న చెక్క బాక్సులుంటే వాటిని బ్యూటీ కిట్‌లా వాడుకోవడం, చెక్క టేబుల్‌పై ఓ చిన్న దూది పరుపును ఏర్పాటు చేసి రంగురంగుల కుషన్స్‌ని అమర్చుకుంటే అలా కాసేపు సేదదీరడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఆలోచిస్తే బోలెడన్ని ఆలోచనలొస్తాయి. తద్వారా అవి తిరిగి మనకు ఉపయోగపడడంతో పాటు ఇంటికీ నాటి కాలపు శోభను తీసుకొస్తాయి.

* విండ్‌ఛైమ్స్‌, షాండ్లియర్‌, గోడ గడియారాలు.. వంటి డెకరేటివ్‌ ఐటమ్స్‌లో కూడా వింటేజ్‌ థీమ్‌తో కూడినవి బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకొని అలంకరించుకున్నా ఇంటి అందం ఇనుమడిస్తుంది.

* చాలామంది ఇళ్లలో పాతకాలపు నిచ్చెనల్ని పక్కన పడేస్తుంటారు. నిజానికి వాటిని కూడా ఇంటి అలంకరణలో భాగం చేసుకోవచ్చు. అదెలాగంటే.. నిచ్చెనకు చక్కగా రంగు వేసి.. వాటిపై ఫొటోఫ్రేములు అమర్చుకోవడం, న్యాప్‌కిన్స్‌ వేలాడదీయడం.. లేదంటే రెండు నిచ్చెనల్ని ఏటవాలుగా ఒక దానికొకటి ఒరిగించి.. అరల్లా చేసి.. వాటిపై వస్తువుల్ని, పూల మొక్కల్ని, ఇతర డెకరేటివ్‌ ఐటమ్స్‌ని అమర్చుకోవచ్చు.

ఇంకా ఆలోచిస్తే వింటేజ్‌ డెకరేషన్‌కి సంబంధించి బోలెడన్ని ఐడియాలొస్తాయి.. మరి, మీ ఇంటికి వింటేజ్‌ లుక్‌ని అందించడానికి మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? మీ ఆలోచనల్ని మాతో పంచుకోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని