ఆరు తరాలు.. 185 మంది.. ఒకే ఇంట్లో..!

ఈ రోజుల్లో చిన్న కుటుంబాలే ఎక్కువ! తరాల తరబడి ఒకే ఇంట్లో కలిసున్న ఉమ్మడి కుటుంబాల్ని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. అందులోనూ మహా అయితే రెండు, మూడు తరాల వారు కలిసుండడం చూస్తుంటాం. కానీ ఏకంగా ఆరు తరాల నుంచి కలిసే ఉంటోంది ఓ ఫ్యామిలీ.

Published : 24 Jun 2024 20:25 IST

(Photos: Screengrab)

ఈ రోజుల్లో చిన్న కుటుంబాలే ఎక్కువ! తరాల తరబడి ఒకే ఇంట్లో కలిసున్న ఉమ్మడి కుటుంబాల్ని వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. అందులోనూ మహా అయితే రెండు, మూడు తరాల వారు కలిసుండడం చూస్తుంటాం. కానీ ఏకంగా ఆరు తరాల నుంచి కలిసే ఉంటోంది ఓ ఫ్యామిలీ. చిన్న-పెద్ద, ముసలి-ముతక.. ఇలా మొత్తంగా 185 మంది సభ్యులున్న ఈ కుటుంబం ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ తరం వారికి రిలేషన్‌షిప్‌ పాఠాలు నేర్పుతోంది. ఇంతకీ ఎక్కడుందీ ఉమ్మడి కుటుంబం? ఇన్ని తరాల వారు తమ ఆలోచనల్ని బ్యాలన్స్‌ చేసుకుంటూ ఎలా ముందుకు సాగగలుగుతున్నారు? అసలు ఇంతమందికి వండి వార్చడం ఈ కుటుంబంలోని మహిళలకు ఎలా సాధ్యమవుతోంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కుటుంబం కథ చదవాల్సిందే!

రాజస్థాన్‌లోని అజ్మీర్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది నసీరాబాద్‌ అనే ప్రాంతం. దానికి ఆనుకొని ఉంది రమ్సర్‌ అనే గ్రామం. ఈ ఊళ్లో అన్ని కుటుంబాలు ఒకెత్తయితే.. ‘బగ్డీ మాలీ ఫ్యామిలీ’ మరో ఎత్తు. ఈ గ్రామంలోకి కొత్తగా ఎవరు అడుగుపెట్టినా.. ఈ కుటుంబాన్ని చూసి ముగ్ధులవుతుంటారు. ఇందుకు కారణం.. ఇదో పెద్ద ఉమ్మడి కుటుంబం. పెద్దదంటే రెండు, మూడు తరాలు.. 20 లేదా 30 మంది ఉంటారేమో అనుకునేరు! ఈ ఇంట్లో ఏకంగా ఆరు తరాలకు చెందిన వారు నివసిస్తుంటారు.

‘ఐకమత్యమే’ పాఠంగా!

ఈ కుటుంబానికి పెద్ద సుల్తాన్‌ మాలీ. ఆయనకు ఆరుగురు కొడుకులు. మోహన్‌లాల్‌, భన్వర్‌లాల్‌, రామ్‌చంద్ర, ఛగన్‌లాల్‌, ఛౌతులాల్‌, బిర్దీచంద్‌. సుల్తాన్‌ మాలీ తన కొడుకులకు చిన్నతనం నుంచి ‘ఐకమత్యమే మహాబలం’ అన్న పాఠాన్ని నేర్పించారు. ‘కలిసి ఉంటే కలదు సుఖం!’ అన్న విషయాన్ని నూరిపోశారు. ఆయన ఆలోచనలు, ఆశయాలకు తగ్గట్లే ఈ ఆరుగురు కొడుకులూ ఒకరంటే ఒకరికి ప్రాణమిచ్చేంత ప్రేమతో మెలిగేవారు. అయితే కొన్నేళ్లకు తండ్రి సుల్తాన్‌, తోబుట్టువులు భన్వర్‌లాల్‌, రామ్‌చంద్ర కాలం చేసినా.. మిగిలిన నలుగురు సోదరులు తమ తండ్రి కోరిక మేరకు తామెప్పుడూ కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. అదృష్టమేంటంటే.. ఈ ఇంటికొచ్చిన కోడళ్లూ ఈ కుటుంబ విలువల్ని అర్థం చేసుకొని కలిసి మెలిసి మెలగాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఆరు తరాల నుంచి కలిసే ఉంటోన్న ఈ కుటుంబంలో 65 మంది పురుషులు, 60 మంది మహిళలు, 60 మంది చిన్నారులు.. మొత్తం కలిపి 185 మంది నివసిస్తున్నారు.

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ..!

సాధారణంగా అత్తాకోడళ్లు, తోడికోడళ్లు.. ఒకే ఇంట్లో ఉంటే చాలా సందర్భాల్లో ఒకరంటే మరొకరికి పడకపోవడం, ఏ ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు, ఇష్టాయిష్టాలు కలవకపోవడం.. దీంతో గొడవలు రావడం చూస్తుంటాం. అలాంటిది ఈ మాలీ ఫ్యామిలీలో ఆరు తరాల నుంచి కుటుంబ సభ్యులంతా ఐకమత్యంతో కలిసి ఉండడం చూసి ఇరుగుపొరుగు వారు ఆశ్చర్యపోతుంటారు. ఇందుకు కారణం ఒకరినొకరు అర్థం చేసుకోవడమే అంటున్నారు ఈ ఇంటి కోడళ్లు. వరుసకు తోడికోడళ్లే అయినా.. సొంత అక్కచెల్లెళ్లలా మెలుగుతామంటున్నారు వీరు.

‘ఇంత పెద్ద ఇంట్లోకి అడుగుపెట్టడం నిజంగా నా అదృష్టం. నా భర్త పూర్వీకులు చూపిన మార్గంలోనే నేనూ నడవాలని ఈ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడే నిర్ణయించుకున్నా. అయితే ఒకరినొకరు ఎంతగా అర్థం చేసుకున్నా.. మా మధ్య కూడా అప్పుడప్పుడూ చిన్నపాటి అభిప్రాయ భేదాలొస్తుంటాయి. వాటినీ సామరస్యంగానే పరిష్కరించుకుంటాం. మా ఇంట్లో పెద్ద వాళ్లు కూర్చొని ఇలాంటి సమస్యల్ని పరిష్కరిస్తారు. ఆపై తిరిగి ఎప్పటిలాగే ప్రేమగా కలిసిపోతాం. ఈ ప్రేమ, ఆప్యాయతలే మా కుటుంబాన్ని కలిపి ఉంచుతున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరం రోజూ కలిసే భోజనం చేస్తాం. కష్టసుఖాల్లోనూ పాలుపంచుకుంటాం.. ఒకరికొకరు అండగా నిలుస్తుంటాం..’ అంటూ తమ ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌ సీక్రెట్స్‌ని బయటపెట్టారు ఈ ఇంటి కోడళ్లలో ఒకరైన లాడీ దేవి.

రోజూ పండగే!

ఇక ఈ కుటుంబ సభ్యుల్లో కొంతమంది ప్రభుత్వోద్యోగాలు చేస్తుంటే.. మరికొందరు ప్రైవేటు వృత్తిఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. మిగతా వారు వ్యవసాయం, పశు పోషణ, వ్యక్తిగతంగా షాపులు నిర్వహించడం, ట్రాక్టర్లు నడపడం.. వంటి పనులు చేస్తుంటారు. అంతేకాదు.. పిల్లల చదువు, కెరీర్‌ విషయాల్లో వారికి పూర్తి స్వేచ్ఛనిస్తుందట ఈ మాలీ కుటుంబం. ఇంతమంది సభ్యులున్న ఈ కుటుంబంలో సాధారణంగానే రోజూ పండగ వాతావరణం కనిపిస్తుంటుంది. అలాంటిది ఇక ప్రత్యేక సందర్భాల్లో వీళ్ల ఆనందం, ఉత్సాహం రెట్టింపవుతాయట! ఏ పండగొచ్చినా, పెళ్లి జరిగినా, పూజలు నిర్వహించినా.. అందరూ కొత్త బట్టలు ధరించడం, ఆడ-మగ అన్న తేడా లేకుండా సరదాగా సెలబ్రేట్‌ చేసుకోవడం ఈ కుటుంబంలో చూడచ్చు. అంతేకాదు.. తమ కుటుంబంలోని మహిళల్ని వారి ఇష్టాయిష్టాలు, అభిరుచుల మేరకు ప్రోత్సహించడానికీ వెనకాడదీ మాలీ ఫ్యామిలీ. ఇందుకు.. ఈ కుటుంబంలోని ఓ కోడలు గతంలో సర్పంచ్‌గా ఎన్నికవడమే ప్రత్యక్ష ఉదాహరణ! అంతేకాదు.. ఆమె తన పనితనంతో ఆ గ్రామంలోని రోడ్లు-రవాణా, విద్యుత్‌, మురుగు నీటి సదుపాయాల్ని మెరుగుపరిచి అసలైన నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఈ కుటుంబానికీ పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చింది.

నెలకు రూ. 12 లక్షల ఖర్చు!

సాధారణంగా కుటుంబంలో పది మంది సభ్యులుంటేనే వంట చేయడం కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది 185 మందికి వండి వార్చాలంటే? అంత సులభం కాదు. కానీ ఈ బాధ్యతను ఈ ఇంటి కోడళ్లు, ఆడవారు సమర్థంగా నిర్వర్తిస్తున్నారు.

‘మా ఇల్లు చాలా పెద్దది. అందులోనూ వంటగది కూడా పెద్దగానే ఉంటుంది. ఇక్కడ 13 స్టౌలు నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటాయి. రోజూ 50 కిలోల పిండితో చపాతీలు చేస్తాం. 15 కిలోల కాయగూరలు వండుతాం. ఇంట్లో ఆడవాళ్లందరం తలా ఓ పని పంచుకుంటాం.. దాంతో కష్టమనిపించకుండా సునాయాసంగా పనులు పూర్తిచేయగలుగుతున్నాం. ఇక మా కుటుంబం మొత్తానికి నెలకు సరిపడా రేషన్‌ కోసమే రూ. 12 లక్షలు ఖర్చవుతుంది..’ అని చెబుతున్నారు లాడీ దేవి. ఇలా ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోన్న ‘బగ్డీ మాలీ ఫ్యామిలీ’ ఆ గ్రామంలోనే కాదు.. ఆ రాష్ట్రవ్యాప్తంగానూ పాపులారిటీని సంపాదించుకుంది.


సారాకూ నచ్చేసింది!

ఇక మొన్నామధ్య ఓ చిత్ర షూటింగ్‌ కోసం బాలీవుడ్‌ నటీనటులు సారా అలీ ఖాన్‌, విక్కీ కౌశల్‌ ఈ గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఓ రోజు ఈ మాలీ కుటుంబాన్ని సందర్శించి, ఈ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. వారి ఆతిథ్యాన్నీ స్వీకరించారు. ఈ వీడియోను సారా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. ఈ ఆదర్శ కుటుంబం గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. చాలామంది దీనిపై స్పందిస్తూ.. ‘ఈ ఆదర్శ కుటుంబం.. నేటి తరం వారికి స్ఫూర్తిదాయకం..!’ అంటూ పోస్టులు కూడా షేర్‌ చేశారు. మరి, ఈ పే...ద్ద కుటుంబంపై మీరూ ఓ లుక్కేసేయండి!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్