ఆన్‌లైన్ కోర్సుల రారాణి!
కొంతమంది ఓటమిని అంగీకరించరు.. చేసే ప్రతి పనిలోనూ గెలవాలన్న తపన వారిని ఓడిపోనివ్వదు కూడా! కేరళలోని కొట్టాయంకు చెందిన రెహ్‌నా షాజహాన్ ఈ కోవకే చెందుతుంది. అర మార్కుతో తన కలల కాలేజీ జామియా మిల్లియా ఉస్మానియాలో సీటు కోల్పోయిన ఆమె.. ‘పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు’.. ఆపై అదే కాలేజీలో ఎంబీఏ....
(Photos: Instagram)
కొంతమంది ఓటమిని అంగీకరించరు.. చేసే ప్రతి పనిలోనూ గెలవాలన్న తపన వారిని ఓడిపోనివ్వదు కూడా! కేరళలోని కొట్టాయంకు చెందిన రెహ్‌నా షాజహాన్ ఈ కోవకే చెందుతుంది. అర మార్కుతో తన కలల కాలేజీ జామియా మిల్లియా ఉస్మానియాలో సీటు కోల్పోయిన ఆమె.. ‘పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు’.. ఆపై అదే కాలేజీలో ఎంబీఏ సీటు సంపాదించింది. అక్కడితో ఆగిపోకుండా ఆన్‌లైన్‌లో బోలెడన్ని కోర్సులు చేసి అపారమైన జ్ఞానాన్ని సొంతం చేసుకుంది. ఇలా తాను చదివిన 81 ఆన్‌లైన్ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లు సుమారు రెండేళ్ల క్రితం ఒకే రోజు ఆమెకు అందాయి. దీంతో ఒక్కరోజులో అత్యధికంగా ఆన్‌లైన్ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లు పొందిన వ్యక్తిగా అప్పట్లో ప్రపంచ రికార్డు సృష్టించింది రెహ్‌నా. విజ్ఞానాన్ని నలుగురికి పంచినప్పుడే ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపగలమని నమ్మే ఆమె కథ, అనితర సాధ్యమైన రికార్డులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం విశేషం.
అక్కే.. నా స్ఫూర్తి!
రెహ్‌నా షాజహాన్‌ది కొట్టాయంలోని ఇల్లికల్ అనే ప్రాంతం. చిన్నతనం నుంచీ చదువులో మెరుగ్గా ఉన్నప్పటికీ ‘సగటు విద్యార్థి’ అనే ముద్ర ఆమెపై పడిపోయింది. కారణం.. ఆమె అక్క నెహ్లా తనకంటే తెలివైన విద్యార్థి కావడమే! అయితే ఎంతోమంది రెహ్‌నాను తన అక్కతో పోల్చినా.. తాను మాత్రం ఆమెనే ఆదర్శంగా తీసుకున్నానని చెబుతోందామె. ‘అక్కతో నాకు మంచి అనుబంధం ఉంది.. తనను నేను ఇత అని ముద్దుగా పిలుస్తాను. చాలామంది అక్కతో నన్ను పోలుస్తూ నాపై యావరేజ్ స్టూడెంట్ అనే ముద్ర వేశారు. కానీ దాన్ని నేను నెగెటివ్‌గా తీసుకోకుండా చెరిపేయాలని నిర్ణయించుకున్నా..’ అంటుంది రెహ్‌నా.
అర మార్కుతో మిస్సయింది!
అక్కను స్ఫూర్తిగా తీసుకొని చదువు కొనసాగించిన రెహ్‌నాకు దిల్లీలోని ‘జామియా మిల్లియా ఉస్మానియా’ కళాశాలలో ఎం.కామ్ చదవాలనేది కోరిక. కానీ అర మార్కుతో ఆ అవకాశం ఆమె చేజారిపోయింది. ఆ క్షణం ఒకింత భావోద్వేగానికి లోనైన ఆమె.. కసితో ఏకకాలంలో రెండు పీజీ ఆన్‌లైన్ కోర్సులకు దరఖాస్తు చేసుకుంది. అలా సోషల్ వర్క్‌లో మాస్టర్స్, గైడెన్స్-కౌన్సెలింగ్‌లో డిప్లొమా పూర్తి చేసింది. ఆపై CATలో మంచి మార్కులు సాధించి.. జామియాలోనే ఎంబీఏ కోర్సులో చేరింది. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘క్యాట్‌లో మంచి మార్కులు రావడం, జామియాలో సీటు రావడంతో నాపై నాకు నమ్మకం మరింత పెరిగింది. కలల్ని సాకారం చేసుకోవడంలో ఉన్న సంతృప్తిని అప్పుడు నేను రుచి చూశా. వీలైనన్ని సర్టిఫికేషన్ కోర్సుల ద్వారా నా నైపుణ్యాలను మరింతగా పెంచుకోవాలనుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది రెహ్‌నా.
ఆన్‌లైన్ కోర్సులతో రికార్డు!
ఆన్‌లైన్‌లో అత్యధికంగా కోర్సులు చేయాలని అనుకోవడమే కాదు.. ఓవైపు ఎంబీయే చదువుతూనే.. మరోవైపు ఆ పనిని చకచకా పూర్తి చేసేసింది రెహ్‌నా. దాంతో సుమారు రెండేళ్ల క్రితం 81 ఆన్‌లైన్ కోర్సుల సర్టిఫికెట్లను ఒకే రోజు అందుకొని సరికొత్త చరిత్ర లిఖించిందీ కేరళ అమ్మాయి. ‘ఓటమిని అంగీకరించను.. గెలిచేదాకా పోరాడతా..’ అంటోన్న ఈ బ్రిలియంట్ లేడీ.. మొన్నటిదాకా దుబాయ్‌లోని ఓ ప్రముఖ సంస్థలో పనిచేస్తూ లక్షల వేతనం అందుకునేది. అయితే తన తండ్రి ఆపరేషన్ రీత్యా ఆయన బాగోగులు చూసుకోవడానికి ఇటీవలే ఉద్యోగం వదిలేసి స్వదేశానికి తిరిగొచ్చేసింది.
సేవలోనూ మిన్నే!
రెహ్‌నాకు సమాజ సేవ చేయడమన్నా మక్కువే! ఈ ఇష్టంతోనే రెండు ఆన్‌లైన్ పీజీ కోర్సులు చదివే క్రమంలోనే దిల్లీలోని ‘విమెన్స్ మ్యానిఫెస్టో’ అనే స్వచ్ఛంద సంస్థలో చేరింది. మహిళల సాధికారత, అభ్యున్నతి కోసం కృషి చేసింది. తన ప్రతిభ, సమాజ సేవకు గుర్తింపుగా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఆమె.. ఈ ఏడాది ‘ఇంటర్నేషనల్ ఇన్‌స్పిరేషనల్ ఉమన్ అవార్డు’ సొంతం చేసుకుంది. పలు వేదికలపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తూ, తనలో ఉన్న అపార జ్ఞానాన్ని ఎంతోమంది విద్యార్థులకు పంచుతూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది రెహ్‌నా.
తానింత స్థాయికి చేరుకోవడానికి అక్క స్ఫూర్తితో పాటు తల్లిదండ్రులు, భర్త ఇబ్రహీం రియాజ్ ప్రోత్సాహం ఎంతో అంటోందీ కేరళ అమ్మాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.