రెండంతస్తుల మట్టిల్లు.. ఎంత చల్లగా ఉందో..!

నేటి ఆధునిక యుగంలో గృహ నిర్మాణంలో ఎన్నో మార్పులొచ్చాయి. చాలామంది ఖర్చు ఎంతైనా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఫలితంగా ప్రపంచమంతా కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతోంది. అయినా కొన్ని గ్రామాల్లో ఇంకా మట్టి ఇళ్లు దర్శనమిస్తుంటాయి. రూపాలీ దీక్షిత్‌ అనే ట్రావెల్ వ్లాగర్ ఇటీవల అలాంటి మట్టి ఇంటినే సందర్శించింది.

Updated : 10 Jul 2024 14:11 IST

(Photos: Instagram)

నేటి ఆధునిక యుగంలో గృహ నిర్మాణంలో ఎన్నో మార్పులొచ్చాయి. చాలామంది ఖర్చు ఎంతైనా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఫలితంగా ప్రపంచమంతా కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతోంది. అయినా కొన్ని గ్రామాల్లో ఇంకా మట్టి ఇళ్లు దర్శనమిస్తుంటాయి. రూపాలీ దీక్షిత్‌ అనే ట్రావెల్ వ్లాగర్ ఇటీవల అలాంటి మట్టి ఇంటినే సందర్శించింది. అయితే అది సాధారణ మట్టిల్లు కాదు. రెండంతస్తుల మట్టిల్లు. బయట ఎంత వేడి ఉన్నా ఆ ఇంట్లో మాత్రం 25 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత ఉండదంటూ ఆ ఇంటి విశేషాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అంతే.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోని ఏకంగా కోటి మందికి పైగా వీక్షించారు. ఈ క్రమంలో రూపాలీతో పాటు, ఆ ఇంటి గురించిన విశేషాలు తెలుసుకుందామా...

ఉద్యోగం వదిలేసి..!

జైపూర్‌కి చెందిన రూపాలీ దీక్షిత్‌ సివిల్‌ ఇంజినీర్‌గా పని చేసేది. అయితే రొటీన్‌ జాబ్‌తో విసిగిపోయిన ఆమె 2022లో ఉద్యోగాన్ని వదిలేసింది. అలా ఏడాదికి పైగా ఉద్యోగం లేకుండానే గడిపింది. ఈ క్రమంలో ఫ్రెండ్‌ ఇచ్చిన సలహాతో ఏదైనా కొత్తగా చేయాలని భావించింది. స్వతహాగా ట్రావెలింగ్ పట్ల మక్కువ ఉండడంతో.. ‘భారత్‌ భ్రమణ్‌’ పేరుతో ఏడాది కాలంలో దేశాన్ని చుట్టేయాలని భావించింది. అలా గత ఏడాది నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ట్రావెల్ వ్లాగర్‌గా మారి దేశంలోని ఎన్నో ప్రాంతాలకు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేయడం ప్రారంభించింది. తన ప్రయాణంలో భాగంగా వారణాసిలోని ఓ రెస్టరంట్‌లో కోల్‌కతా మహిళకు, ఓ విదేశీ జంటకు మధ్య జరిగిన సంఘటనను పోస్ట్‌ చేసింది. అది నెట్టింట వైరల్‌గా మారడంతో రూపాలీకి ఒక్కసారిగా అభిమానులు పెరిగారు. అప్పట్నుంచి ఎన్నో వీడియోలను పోస్ట్‌ చేసింది. ఆమెకు యూట్యూబ్‌లో 12 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 60 వేల మంది ఫాలోవర్లున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఓ గ్రామంలోని రెండంతస్తుల మట్టింటిని సందర్శించిన వీడియోను పోస్ట్‌ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది రూపాలీ.

లోపల ఎంత చల్లగా ఉందో..!

‘నా ప్రయాణంలో భాగంగా స్కూటీపై మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామం నుంచి వెడుతున్నాను. దాహం వేయడంతో ఓ ఇంటి దగ్గర ఆగి అక్కడి మహిళను మంచినీళ్లు అడిగాను. ఆమె ఇంట్లోకి పిలిచి నీళ్లు ఇచ్చింది. ఇంటి లోపల చూసి నాకు ఆశ్చర్యమేసింది. ఎందుకంటే అది రెండంతస్తుల మట్టిల్లు. ఇంట్లోకి వెళ్లగానే కిచెన్‌ ఉంది. ఆ తర్వాత ఒక బెడ్‌రూం.. దాన్నుంచి పైకి ఎక్కడానికి మెట్లున్నాయి. పైన మరొక గది ఉంది. ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే బయట 47 డిగ్రీల వేడి ఉన్నా ఇంట్లో మాత్రం 20 నుంచి 25 డిగ్రీల మించి వేడి లేదు. వారికి ఫ్యాన్‌ అవసరం ఏమాత్రం లేదు. వారి మట్టిల్లు చల్లగా ఉండడమే కాదు.. నివసించడానికి అనువైనది.. ఎంతో విలువైనది’ అంటూ ఆ ఇంటి గురించి చెప్పుకొచ్చింది రూపాలీ.
దాంతో పలువురు నెటిజన్లు సైతం మట్టి ఇళ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతూ కామెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు. ఒక నెటిజన్‌ కాంక్రీట్‌ ఇళ్ల జీవితం కాలం 30 నుంచి 40 సంవత్సరాలుంటే.. మట్టిల్లు మాత్రం 200 ఏళ్ల పాటు ఉంటుందని పోస్ట్‌ చేశారు.

నగరీకరణ పెరిగిపోయి ప్రపంచమంతా కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న ప్రస్తుత కాలంలో.. ఇలాంటి నివాసాలు మనదైన పల్లె సంస్కృతికి.. ప్రకృతితో పెనవేసుకున్న జీవన శైలికి తార్కాణంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు.

మరి, మీరూ ఓసారి ఆ ఇంటిని చూసేయండి..!Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్