అలాగ వెళ్లి.. ఇలాగ తుళ్లి..

ముసురు పట్టినవేళ సెలవులొస్తే.. మనసు ఏదైనా కొత్త ప్రదేశాన్ని చూసి రావాలని కోరుకుంటే.. చినుకుల సవ్వడిని ఆస్వాదిస్తూ.. కారుమబ్బుల కబుర్లు వింటూ.. సేదతీరే మనోహరమైన ప్రదేశాలెన్నో ఉన్నాయి. వరుసగా సెలవులు వస్తున్నాయి కదా! మరపురాని పర్యటనకు శ్రీకారం చుట్టేయండి..

Updated : 19 Dec 2022 11:32 IST

ముసురు పట్టినవేళ సెలవులొస్తే.. మనసు ఏదైనా కొత్త ప్రదేశాన్ని చూసి రావాలని కోరుకుంటే.. చినుకుల సవ్వడిని ఆస్వాదిస్తూ.. కారుమబ్బుల కబుర్లు వింటూ.. సేదతీరే మనోహరమైన ప్రదేశాలెన్నో ఉన్నాయి. వరుసగా సెలవులు వస్తున్నాయి కదా! మరపురాని పర్యటనకు శ్రీకారం చుట్టేయండి..

లాహిరి లాహిరి.. 
శ్రీశైలం నుంచి అక్కమహాదేవి వెళ్లేవారి కోసం పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీ నిర్వహిస్తోంది. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు పాతాళగంగ నుంచి మరబోటు బయల్దేరుతుంది. పెద్దలకు రూ.380, పిల్లలకు రూ.200. పాతాళగంగ వరకు రోప్‌వే ఛార్జీలు, అటవీశాఖ అనుమతి రుసుం ప్యాకేజీలోనే పొందవచ్చు.

కొల్లాపూర్‌ సమీపంలోని సోమశిల నుంచీ అక్కమహాదేవి గుహకు వెళ్లొచ్చు. సోమశిల నుంచి కృష్ణానదిలో 85 కిలోమీటర్లు బోటులో ప్రయాణించాలి. అక్కడి నుంచి శ్రీశైలానికీ తీసుకెళ్తారు. టికెట్‌ ధర పెద్దలకు రూ.1,200, పిల్లలకు రూ.800. హైదరాబాద్‌ నుంచి కొల్లాపూర్‌కు బస్సులు ఉంటాయి. కర్నూలు నుంచి వనపర్తి మీదుగా కొల్లాపూర్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులు, ఆటోల్లో సోమశిలకు (9 కి.మీ.) వెళ్లొచ్చు.

కృష్ణమ్మ ఒడ్డున  అక్కమహాదేవి గుహ, నాగర్‌కర్నూల్‌ 
శ్రీశైలం క్షేత్రానికి కృష్ణానది అదనపు అందాన్నిస్తుంది. తాజాగా తరలి వస్తున్న వరద జలాలతో కృష్ణవేణి జలకళ సంతరించుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించడానికి ఇదే మంచి తరుణం. సిరిగిరి పరిసరాల్లో ఎన్నో పర్యాటక కేంద్రాలున్నాయి. వాటిలో ఒకటి అక్కమహాదేవి గుహ. పాతాళగంగకు 16 కిలోమీటర్ల దూరంలో, కృష్ణవేణి ఒడ్డున, చిక్కటి అడవిలో... నిలువెత్తు గిరుల మధ్య ఉంటుందీ గుహ. దీని ఎదురుగా అందమైన శిలాతోరణం ఉంది. 30 అడుగుల ఎత్తులో 200 అడుగుల పొడవుతో.. 16 అడుగుల వెడల్పుతో ఉన్న రాతి తోరణాన్ని చూసిన ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే.. విశాలమైన గుహ కంటపడుతుంది. పొరలు పొరలుగా పరుచుకున్న గండశిలల మధ్య ఉంటుందిది. అందులో స్తంభాలపై అపురూప శిల్పాలు చూడొచ్చు. లోనికి వెళ్లడానికి సన్నని మార్గం ఉంటుంది. పూర్తిగా వంగి పాకుతూ ముందుకు వెళ్తే... సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం కనిపిస్తుంది. 12వ శతాబ్దంలో ఇదే గుహలో కర్ణాటకకు చెందిన శివభక్తురాలు అక్కమహాదేవి తపస్సు చేసిందని చెబుతారు. సమీపంలోని కదలీ వనంలో ఆమె శివైక్యం అయిందంటారు. ఆ మహాభక్తురాలి పేరిట దీనిని అక్కమహాదేవి గుహ అని పిలుస్తారు. ఇక్కడికి నదీ మార్గంలో వెళ్లాలి. పాతాళగంగ నుంచి మరబోట్లు ఉంటాయి. నదీ తీరం వెంట అక్కడక్కడా చిన్న చిన్న గుడిసెలు.. కనువిందు చేస్తాయి. రకరకాల పక్షులు స్వాగత గీతాలు పలుకుతాయి. గంట బోటు ప్రయాణం తర్వాత అక్కమహాదేవి గుహ వస్తుంది. నది ఒడ్డు నుంచి గుహ వరకు మెట్ల మార్గం ఉంది. ఉభయ సంధ్యల్లో కృష్ణమ్మ సోయగాలు మనోహరంగా కనిపిస్తాయి.

- ఎన్‌.జిక్రియ, మహబూబ్‌నగర్‌

తూర్పు సిందూరం ఎర్రమట్టి దిబ్బలు, విశాఖపట్నం
సాగరతీరంలో సుందరసీమలెన్నో. వాటిలో విశాఖ నుంచి భీమిలి వెళ్లే దారి ఒకటి. ఓవైపు అంతులేని సముద్రం. ఇంకోవైపు అంతుచిక్కని అందాలు. కైలాసగిరి వీక్షణం, రుషికొండ తీర సోయగం, తోట్లకొండ తీర వయ్యారం ఇవి దాటాక ఉందో ప్రకృతి అద్భుతం. అదే భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలు.

తీరం వెంబడి గాలి.. కాసింత చల్లదనాన్ని ఇస్తుంది. రవ్వంత వెచ్చదనం కలిగి ఉంటుంది. అణువంత ఇసుక రేణువులనూ మోసుకొస్తుంది. అలా గాల్లో తేలుతూ వెళ్లిన ఇసుక రేణువులు.. అల్లంత దూరంలో రాశులుగా ఏర్పడ్డాయి. దిబ్బలుగా స్థిరపడ్డాయి. వేల సంవత్సరాల పరిణామ క్రమంలో ఏర్పడిన వింతలోకమిది. సముద్రంలో నీటి మట్టం పెరగడం, తగ్గడం.. ఇసుక దిబ్బలు ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకునేలా చేశాయి. వర్షాలు కురిసినప్పుడు దిబ్బలు కరిగి.. వాటి మధ్య సుందరమైన లోయలు ఏర్పడ్డాయి. ఈ అందాల దిబ్బలు బంగాళాఖాతం తీరానికి కూసంత దూరంలో సిందూరంతో అలికినట్టుగా కనువిందు చేస్తాయి. నాలుగు కిలోమీటర్ల పొడవు, రెండు కిలోమీటర్ల వెడల్పుతో ఇవి విస్తరించాయి. మధ్యలో లోయలతో, చుట్టూ చెట్లతో మనోహరంగా ఉంటుందీ ప్రాంతం. సూర్యకిరణాలు నిటారుగా ప్రసరించినప్పుడు.. ఇసుక దిబ్బలు అరుణ కాంతులీనుతూ మనసును మైమరపింపజేస్తాయి. ఇవి ఎరుపు రంగు సంతరించుకోవడానికి వేల ఏళ్లు పట్టింది. ఇసుకతో కొట్టుకువచ్చిన మట్టిలో ఇనుప ధాతువు ఉండటం, తేమ కారణంగా ఆక్సిలీకరణ చెంది ఎరుపు రంగులోకి మారాయి. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో పురాతన, రాతియుగానికి చెందిన కళాఖండాలు లభ్యమయ్యాయి.

సందర్శన ఉచితం 
ఎర్రమట్టి దిబ్బలు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి. ఈ తరహా దిబ్బలు తమిళనాడు, శ్రీలంకలోనూ ఉన్నాయి. పర్యాటకానికి అనువుగా ఉన్నవి ఇవే కావడం విశేషం. విహారానికే కాదు.. సినిమా షూటింగ్‌లకూ ఈ ప్రాంతం చిరునామా. 1980, 90 దశకాల్లో చిత్ర నిర్మాణాలు ఇక్కడ విరివిగా జరిగేవి. ఇప్పుడు విశాఖ పర్యాటక సిగలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఎర్రమట్టి దిబ్బల సందర్శనకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. భీమిలి జేవీ అగ్రహారం నుంచి వెళ్లే మార్గంలో పర్యాటక శాఖ వ్యూ పాయింట్‌ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి చూస్తే సువిశాల ప్రకృతి సంపదను కళ్లారా చూడొచ్చు. ఒకప్పుడు బౌద్ధ కేంద్రంగా విలసిల్లిన తోట్లకొండ ఇక్కడికి దగ్గర్లోనే ఉంటుంది. 
చేరుకునేదిలా: ఈ పర్యాటక కేంద్రం విశాఖపట్నం నుంచి 20 కి.మీ. దూరంలో, భీమిలి నుంచి 4 కి.మీ. దూరంలో ఉంది. విశాఖ నుంచి బస్సులు, ట్యాక్సీల్లో చేరుకోవచ్చు. భీమిలి నుంచి జేవీ అగ్రహారం మీదుగా వ్యూపాయింట్‌కు వెళ్లొచ్చు.

- ఆర్‌.సురేశ్‌, విశాఖపట్నం

పర్యాటక వరం  లక్నవరం, ములుగు 
ప్రకృతి రమణీయతకు మారుపేరు లక్నవరం సరస్సు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రానికి సమీపంలో ఈ సరస్సు ఉంది. సముద్రాన్ని తలపించే లక్నవరం ఇప్పుడు అలుగు పోస్తూ.. అలరిస్తోంది. సరస్సు సోయగాలను చూసే పర్యాటకుల సంఖ్యా పెరిగింది. చెరువులో ఏర్పాటు చేసిన తీగల వంతెనలు ప్రత్యేక ఆకర్షణ. వాటిపై నడుస్తూ రెండు గుట్టల మధ్య ఉన్న లక్నవరం అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు పరవశించిపోతారు. సరస్సులో బోటు షికారు చేయొచ్చు. చెరువు మధ్యలో ఉన్న దీవుల్లో కాటేజీలు నిర్మించారు. అక్కడ విడిది చేస్తే.. ఏదో ద్వీపంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. వారాంతాల్లో లక్నవరానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా జింకల పార్కు, సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. సమీపంలో నైట్‌క్యాంప్‌ ఈవెంట్లూ జరుగుతుంటాయి.

చలో బొగత.. 
లక్నవరం సరస్సుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బొగత జలపాతం. తెలంగాణ నయాగరాగా పిలుచుకునే బొగత పాలనురగల పరవళ్లతో పర్యాటకులను ఆహ్వానిస్తోంది. పాములూరు అడవుల్లో పుట్టిన వాగు.. వంకలు దాటి తనవంక రమ్మంటోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం పెనుగోలు చీకుపల్లి దగ్గర జలపాతంగా మారి కనువిందు చేస్తోంది. జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిండుగా ప్రవహిస్తూ పర్యాటకుల మదిని దోచుతుంది. జలపాతం దగ్గర అటవీశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వాచ్‌టవర్లు, పగోడాలు నిర్మించారు. పిల్లల కోసం చిల్డ్రన్‌పార్క్‌, బటర్‌ఫ్లై పార్క్‌ ఏర్పాటు చేశారు. సాహస క్రీడలకు వేదికగా మలిచారు. జిప్‌సైకిల్‌, జిప్‌లైన్‌ అందుబాటులోకి తెచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు తరలి వస్తుంటారు. రోజంతా జలపాతం పరిసరాల్లో సేదతీరుతారు.

చేరుకునేదిలా: లక్నవరం సరస్సు వరంగల్‌ నుంచి 75 కి.మీ. దూరంలో ఉంటుంది. వరంగల్‌ నుంచి ఏటూరునాగారం వెళ్లే బస్సు ఎక్కి చెల్వాయ్‌ దగ్గర దిగాలి. అక్కడి నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో సరస్సుకు చేరుకోవచ్చు. బొగత జలపాతం వరంగల్‌ నుంచి 135 కి.మీ. దూరంలో ఉంటుంది. ఏటూరునాగారం నుంచి 24 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి ఏటూరునాగారానికి బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి జగన్నాథపురం మీదుగా బొగత జలపాతానికి చేరుకోవచ్చు. ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

ఈజీ ప్యాకేజీ.. 
బొగత జలపాతం, లక్నవరం సరస్సులకు పర్యాటకశాఖ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌, లక్నవరం, బొగత జలపాతం చేరుకునే విధంగా ఈ ప్యాకేజీ రూపొందించారు. ‌
www.tstdc.in వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. లక్నవరం, తాడ్వాయి వన కుటీరాల సందర్శనకూ ప్యాకేజీ అందుబాటులో ఉంది. వివరాలకు ‌www.ecotourism.bhupalpally.com వెబ్‌సైట్‌ చూడండి.

- సోగాల స్వామి, జయశంకర్‌ భూపాలపల్లి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్