Career Tips: ఇరవైల్లో ఈ తప్పులు వద్దు..!

చదువు, స్నేహితులతో టీనేజ్ సరదాగా గడిచిపోతుంటుంది. ఇరవైల్లోకి అడుగుపెట్టిన తర్వాత అసలైన సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒకపక్క ఉన్నత చదువులు చదువుతూనే మరోపక్క కెరీర్‌ను ఎంచుకోవాలి. ఈ సమయం ప్రతి ఒక్కరికీ...

Published : 09 Jun 2023 20:17 IST

చదువు, స్నేహితులతో టీనేజ్ సరదాగా గడిచిపోతుంటుంది. ఇరవైల్లోకి అడుగుపెట్టిన తర్వాత అసలైన సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒకపక్క ఉన్నత చదువులు చదువుతూనే మరోపక్క కెరీర్‌ను ఎంచుకోవాలి. ఈ సమయం ప్రతి ఒక్కరికీ ఎంతో కీలకం. ఈ సమయంలోనే వారి భవిష్యత్తుకు అడుగులు పడతాయి. అలాగే ఎక్కువ తప్పులు చేసేది కూడా ఈ సమయంలోనే. అయితే చదువైపోయి జాబ్ ఎంచుకునేటప్పుడు, ఆ తర్వాత కెరీర్‌లోనూ చేసే కొన్ని తప్పులు దీర్ఘకాలంలో నష్టాలు తెచ్చిపెడుతుంటాయి. వాటిని సాధ్యమైనంత వరకు నియంత్రించుకుంటే భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా...

సంతోషమే ప్రధానం కాదు...

చదువు పూర్తైన తర్వాత చాలామంది కెరీర్‌ను ఎంచుకునే సమయంలో తమ సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. కానీ, ఇది సరైన నిర్ణయం కాదు. అదేంటీ? నచ్చిన కెరీర్‌ ఎంచుకోవడంలో తప్పేంటి? అనే అనుమానం మీకు రావచ్చు. సంతోషం కలిగించే పని చేయడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే కెరీర్‌ను ఎంచుకునేటప్పుడు మాత్రం ఏ పని బాగా చేయగలుగుతారో ఆలోచించుకోవాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మీకు రకరకాల మెహందీ డిజైన్లు వేయడమంటే మక్కువ ఉండచ్చు. కానీ, ప్రోగ్రామింగ్‌ చేయడంపై మంచి పట్టు ఉండచ్చు. ఇలాంటప్పుడు టెక్నాలజీనే కెరీర్‌గా ఎంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను పొందచ్చు.

అదే జీవితం కాదు...

కొంతమందికి కొంతకాలం తర్వాత చేస్తున్న ఉద్యోగం సంతృప్తినివ్వకపోవచ్చు. ఇలాంటివారిలో చాలామంది ఒక్కసారి కెరీర్ ఎంచుకున్నాక రిటైరయ్యేవరకు అందులోనే కొనసాగాలనే అపోహలో ఉంటారు. దీనివల్ల భవిష్యత్తులో పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి, మీరు చేస్తోన్న ఉద్యోగం నచ్చకపోతే మరో రంగంలోని ఉద్యోగాన్ని ఎంచుకోండి.
కొత్త కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి కొంత సమయం పట్టినా దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందచ్చు. కరోనా మహమ్మారి సమయంలో ఇలాంటి నిర్ణయాలు చాలామందే తీసుకున్నారు. కాబట్టి, కెరీర్‌ని మార్చుకోవడమనేది సర్వసాధారణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డాక్టర్లు మోడలింగ్‌ చేయడం, యాక్టర్లు బిజినెస్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి, కెరీర్‌ విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవడానికి వెనకడుగు వేయద్దు.

పొదుపు మంత్రం..

ఇరవైల్లో ఉండే చాలామంది తమ సంపాదనలో అధిక భాగం పార్టీలు, టూర్లు అంటూ ఎంజాయ్‌ చేయడానికి ఖర్చు పెడుతుంటారు. దాంతో నెల తిరగకుండానే జీతం మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత క్రెడిట్‌ కార్డుని ఉపయోగించడం మొదలు పెడుతుంటారు. ఫలితంగా అత్యవసరం వచ్చినప్పుడు ఇతరులను అడగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇరవైల్లో ఉన్నప్పుడే 50-30-20 రూల్‌ని పాటించమంటున్నారు ఆర్థిక నిపుణులు. 50 శాతం జీతాన్ని నిత్యావసరాలకు, 30 శాతం సంపాదనను వ్యక్తిగత అవసరాలకు, కోరికలకు కేటాయించి మిగిలిన 20 శాతం సొమ్మును తప్పనిసరిగా పొదుపు చేయమని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా మరొకరిని అడగాల్సిన పరిస్థితి ఎదురవ్వదు. అయితే ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటించాలి.

నెట్‌వర్క్‌ కూడా ముఖ్యమే...

కాలేజీలో ఉన్నప్పుడు ఉద్యోగం సంపాదించే క్రమంలో చాలామంది విపరీతంగా కష్టపడుతుంటారు. లెక్చరర్ల అభిప్రాయాలు తీసుకోవడం, సీనియర్ల నంబర్లు తీసుకోని వారితో మాట్లాడడం, నైపుణ్యాలు పెంచుకోవడానికి కోచింగ్‌ సెంటర్లకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. కానీ, ఉద్యోగం సంపాదించిన తర్వాత చాలామంది రిలాక్సవుతుంటారు. ఇలా చేయడం వల్ల నష్టాలున్నాయంటున్నారు నిపుణులు.

ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నిత్య విద్యార్థి లాగా ఉండాలి. కొత్త కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో మీరు ఎంచుకున్న రంగంలోని నిపుణులతో నెట్‌వర్క్ ఏర్పర్చుకోవాలంటున్నారు. దీనికోసం లింక్డ్ఇన్‌ వంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఖాతా తెరచి మీ కెరీర్‌కు సంబంధించిన వివరాలను పొందుపరచాలి. ఆ తర్వాత మీరు ఎంచుకున్న రంగంలోని నిపుణుల గురించి తెలుసుకుని వారితో ఇంటరాక్ట్‌ అవ్వచ్చు. ఈ క్రమంలో కెరీర్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్