Parenting: పిల్లల విషయంలో ఈ తప్పులు చేయద్దు..!
దంపతులు ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మారతారో అప్పటినుంచి వారి ప్రాధాన్యాలు కూడా మారుతుంటాయి. వారి ఆలోచనలన్నీ పిల్లలే లోకంగా ఉంటాయి. ఏ పని చేసినా పిల్లలను దృష్టిలో పెట్టుకునే చేస్తుంటారు. అయితే పిల్లలను పెంచడంలో మాత్రం ఒక్కొక్కరిది....
దంపతులు ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మారతారో అప్పటినుంచి వారి ప్రాధాన్యాలు కూడా మారుతుంటాయి. వారి ఆలోచనలన్నీ పిల్లలే లోకంగా ఉంటాయి. ఏ పని చేసినా పిల్లలను దృష్టిలో పెట్టుకునే చేస్తుంటారు. అయితే పిల్లలను పెంచడంలో మాత్రం ఒక్కొక్కరిది ఒక్కో విధానం. కొంతమంది గారాబం చేస్తే.. మరికొంతమంది స్ట్రిక్ట్‌గా పెంచుతారు. ఈ క్రమంలో తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కొన్నిసార్లు మరీ కఠినంగా కూడా వ్యవహరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో వారిపై విపరీతమైన ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా...
అతిగా వద్దు...
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలపై కొన్ని అంచనాలను పెట్టుకుంటారు. ఎక్కువ మార్కులు రావాలని, ఆటల్లో బహుమతులు సాధించాలని, ఇంటి పనుల్లో సహాయ పడాలని.. ఇలా రకరకాల అంచనాలను పెట్టుకుంటారు. అయితే కొంతమంది పిల్లలు తమ పేరెంట్స్ సహకారం అందించినా వారి అంచనాలను అందుకోలేకపోతుంటారు. దీంతో అసహనానికి లోనై పిల్లలను ‘నీకు ఏదీ చేత కాదు’ అని నిందిస్తుంటారు. ఇలా చేయడం వల్లనైనా పిల్లల్లో పట్టుదల పెరుగుతుందనేది తల్లిదండ్రుల భావన. కానీ, ఇలా ఎప్పుడో ఓసారి చేస్తే పర్లేదు. కానీ, ప్రతిసారీ ఇలా ప్రవర్తిస్తే పిల్లలు వ్యతిరేక మార్గంలో పయనించే అవకాశం ఉంటుంది.
వాటిని సానుకూలంగా తీసుకోవాలి..
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉండాలనుకుంటారు. అయితే పిల్లలకు కొన్ని సందర్భాల్లో వ్యతిరేక ఆలోచనలు వస్తుంటాయి. దీనిని పేరెంట్స్ తట్టుకోలేరు. కోపంలో వారిపై అరిచేస్తుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వారికి కుంగుబాటుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఎదిగే కొద్దీ వారిలో సమస్యలను పరిష్కరించుకునే నైపుణ్యాలు కూడా తగ్గుతాయి. దీని ప్రభావం వారి కెరీర్‌పై కూడా పడుతుంది. కాబట్టి, పిల్లలు వ్యతిరేక ఆలోచనలతో మీ దగ్గరికి వచ్చినప్పుడు శాంతంగా వినండి. ఆ తర్వాత ఆ ఆలోచనలను సానుకూలంగా ఎలా మార్చుకోవాలో వివరించండి. దానికి కావాల్సిన సహకారం అందించండి.
కోపం వద్దు...
కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుంది. ఇలాంటివారు ప్రతి దానికీ కోపగించుకుంటారు. తాము చెప్పిందే వినాలనే మనస్తత్వంతో ఉంటారు. అయితే ప్రతి బంధానికి కొన్ని హద్దులు ఉంటాయి. వాటిని మీరకుండా ప్రవర్తించినప్పుడే బంధం దృఢంగా ఉంటుంది. ఇదే విషయం పిల్లలకు కూడా వర్తిస్తుంది. అయితే కోపం ఎక్కువగా ఉన్నవారు ఇలాంటి హద్దులను పట్టించుకోరు. దానివల్ల పిల్లలపై కూడా అరిచేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు వారి సమస్యలను మీతో చెప్పడానికి కూడా భయపడుతుంటారు. ఫలితంగా వారి భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టకుండా మిమ్మల్ని సంతృప్తిపరచాలనే అంశం గురించే ఆలోచిస్తుంటారు. కాబట్టి పిల్లల ముందు సాధ్యమైనంత వరకు కోపాన్ని నియంత్రించుకోవాలి.
వారి అభిప్రాయాలూ ముఖ్యమే...
కొంతమంది తల్లిదండ్రులు తమకు తాము నిపుణులుగా భావిస్తుంటారు. మేము చేసిందే కరెక్ట్ అనే భావనతో ఉంటారు. ఇలాంటి వారు తమ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. ఇతరులవి చిన్న సమస్యలుగా భావిస్తుంటారు. ఈ రకమైన మనస్తత్వాన్ని పిల్లలపై కూడా చూపిస్తుంటారు. పిల్లల జీవితానికి సంబంధించిన నిర్ణయాలను కూడా తామే తీసుకుంటారు. వారి అభిప్రాయాలను కొంచెం కూడా పట్టించుకోరు. వారికి ఏం తెలియదనే భావనతో ఉంటారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో పిల్లల మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి, పిల్లల అభిప్రాయాలను కూడా వినాలి. వారి వైపు నుంచి ఆలోచించి ఒకవేళ సాధ్యం కాకపోతే సానుకూలంగా వివరించాలి.
వీటిని కూడా...
* మరికొంతమంది క్రమశిక్షణ పేరుతో ప్రతి విషయంలోనూ చాలా కఠినంగా ఉంటారు. పిల్లలు చేసే ప్రతి పనికి నిబంధనలు పెడుతుంటారు. దాంతో వారికి స్చేచ్ఛ లేకుండా పోతుంది. ఇలాంటి పిల్లలు చదువులో రాణించినా ఇతరులతో మాట్లాడే నైపుణ్యాలు లేక మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
* ఇంకొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇతర విద్యార్థులతో పోలుస్తూ పదే పదే తిడుతుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఎవరి నైపుణ్యాలు వారికి ఉంటాయి. కాబట్టి, వాటిని గుర్తించి తగిన సహకారం అందించాలి.
చివరగా.. పిల్లల విషయంలో కఠినంగా ఉన్నా, గారాబం చేసినా అది పరిమితుల్లో ఉండాలి. ఇందులో ఏది అతి చేసినా తల్లిదండ్రులు, పిల్లలు ఇబ్బందిపడక తప్పదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.