Published : 10/12/2022 17:13 IST

అత్తారింటికి.. దారిదిగో..!

అప్పటిదాకా పుట్టింట్లో ఎంతో స్వేచ్ఛగా, గారాబంగా పెరిగిన క్రమంలో పెళ్లయ్యాక అమ్మాయిలకు ఎన్నో బరువు బాధ్యతలు వచ్చిపడతాయి. అప్పుడే అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి ఇవన్నీ కొత్తగానే అనిపిస్తాయి. ఏ విషయంలో ఎలా మెలగాలో అర్థం కాని పరిస్థితి వారిది. అన్నింటికంటే ముఖ్యంగా అత్తింటి వారితో నడుచుకునే విధానం, అత్తమామలకిచ్చే గౌరవమర్యాదలు, వారి అభిరుచులేంటి.. వంటివన్నీ తెలుసుకొని ముందుకు సాగితేనే మెట్టినింటిని కూడా పుట్టింటిలా మార్చుకోవచ్చు. అత్తమామలతో సఖ్యత ఏర్పడుతుంది.. ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢమవుతుంది. అయితే ఇందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

వారి గురించి తెలుసుకోవాలి..

చిన్నప్పటి నుంచీ అమ్మ చాటు బిడ్డగా ఎదిగిన ఆడపిల్లలు పెళ్లి అనే సరికొత్త అనుబంధంతో ఒక్కసారిగా అత్తింట్లో అడుగుపెట్టే సరికి అన్నీ కొత్తగానే అనిపించడం సహజం. కాబట్టి అన్నింటికంటే ముందుగా చేయాల్సిన పని అత్తారింట్లో ఇమిడిపోవడం. ఇందుకోసం అక్కడి వారి ఆలోచనలేంటి..? అభిరుచులేంటి..?ఇలా ప్రతి ఒక్కటీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది నేరుగా వారి ప్రవర్తనను బట్టి తెలుసుకోవచ్చు. అదీ కాదంటే మీవారి సహాయం కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు అత్తమామలకు దూరంగా, ఇతర ప్రదేశాల్లో ఉన్నా వారి గురించి తెలుసుకోవడం మంచిది. ఇందుకోసం ఎలాగైతే అమ్మానాన్నలతో తరచూ ఫోన్లో, వీడియో కాల్‌లో మాట్లాడడం.. వంటివి చేస్తామో.. అదేవిధంగా అత్తమామలతో, ఆడపడుచులతోనూ మెలగాలి. ఇది వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా.. అత్తింటి వారితో అనుబంధాన్నీ పెంచుతుంది. అలాగే వారి అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక సందర్భాల్లో వారికి బహుమతులు అందించడం, వారిచ్చే బహుమతిని సంతోషంగా స్వీకరించడం.. వంటివీ చేయాలి. ఫలితంగా అత్తమామలతో ఉన్నప్పటికీ అమ్మానాన్నలతో ఉన్న భావన కలుగుతుంది. అలాగే వారికీ మీరంటే మరింత ఇష్టం పెరుగుతుంది.

ప్రతి విషయంలోనూ..

కొత్తగా అత్తింట్లోకి అడుగిడిన అమ్మాయికి అత్తింటి వాతావరణం అలవాటు పడాలంటే కాస్త సమయం పడుతుంది. అలాగని అన్ని విషయాలూ అత్తమామలే చెప్పాలి, భర్తే వివరించాలి అని చూడకుండా.. వారితో సులభంగా కలిసిపోయే తత్వం అలవాటు చేసుకోవాలి. అన్ని విషయాల్లోనూ పాలుపంచుకోవాలి. ఇది అత్తింటి వారితో అనుబంధాన్ని పెంపొందిస్తుంది.

నేరుగా వారితోనే..

ఒక్కోసారి అత్తమామలు, ఆడపడుచులతో ఎంత సఖ్యతగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ.. చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు చోటుచేసుకోవడం సహజం. అలాగని ఇటు మీరు, అటు వాళ్లు ఆ సమస్యలను భూతద్దంలో పెట్టి చూడడం అస్సలు సరికాదు. దీనివల్ల అనుబంధాల మధ్య విభేదాలు రావడం, కొన్ని సందర్భాల్లో చిన్న విషయమే చినికి చినికి గాలివానగా మారడం.. వంటివి జరుగుతాయి. అలాగే ఇంకొంతమందైతే 'మీ అమ్మ నన్ను ఎన్ని మాటలన్నా ఆమెను నువ్వేమీ అనవేంటి..', 'మీ చెల్లెలేంటి నన్ను కసురుకుంటోంది.. అలా చేయొద్దని ఆమెతో చెప్పలేవా..' అని తమ భర్తతో చెబుతుంటారు. ఇలా ఇద్దరి మధ్య వచ్చిన గొడవల్లో మూడో వ్యక్తిని చేర్చితే అసలు విషయం తేలదు సరికదా.. గొడవ మరీ పెద్దదవుతుంది. కాబట్టి అత్తింట్లో ఎవరితోనైనా సమస్య ఉంటే లేదంటే ఎవరైనా ఏదైనా అంటే వారితోనే నేరుగా మాట్లాడడం ఉత్తమం.

అందరూ కలిసి..

భార్యాభర్తలన్నాక ఇద్దరూ కలిసి బయటకు వెళ్లడం, సమయం గడపడం సహజమే. ఇక అప్పుడప్పుడు ఇతర ప్రదేశాలకు వెళ్లడమూ పరిపాటే. అయితే ఇలా ఎప్పుడూ మీరిద్దరే మీ పిల్లలతో కలిసి వెళ్లడం కాకుండా అప్పుడప్పుడూ అత్తమామలు, ఆడపడుచులు, తోడికోడళ్లు.. ఇలా కుటుంబ సభ్యులందరూ కలిసి వెకేషన్‌కి ప్లాన్ చేసుకోవచ్చు. మరోసారి మీ పుట్టింటివారితో కలిసి మరో చోటికి వెళ్లి సెలవుల్ని ఎంజాయ్ చేయచ్చు. అలాగే ఇంకోసారి ఇటు పుట్టింటివారు, అటు అత్తింటివారిని కలుపుకొని కూడా వెకేషన్‌కి ప్రణాళిక వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా ఉంటుంది. అంతేకాదు.. ఇటు మీవారు మీ పుట్టింటి వారితో, అటు మీరు మీ అత్తింటి వారితో మరింతగా కలిసిపోయే వీలుంటుంది. ఇది అందరి మధ్యా చక్కటి అనుబంధానికి బాటలు వేస్తుంది.

గౌరవమర్యాదలు..

అత్తమామల్ని ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారు.. కూతురిలా వాళ్లతో కలిసిపోయారు.. ఇక్కడి వరకూ బాగానే ఉంది.. కానీ అత్తింటి వారి ముందు మీ భాగస్వామితో గొడవ పడుతున్నారా? ఇది మాత్రం అస్సలు కరక్ట్ కాదు. దీనివల్ల 'మా ముందే వీరిద్దరూ ఇంతలా కీచులాడుకుంటున్నారు.. ఇక మేము పక్కన లేనప్పుడు ఇంకెంత గొడవ పడుతున్నారో..' అని వారు భావించే అవకాశం ఉంది. అంతేకాదు.. ఇలాంటి సంఘటనలు వారిని మానసికంగానూ కుంగదీస్తాయి. కాబట్టి మీరిద్దరే ఉన్నప్పుడు గొడవపడ్డా, ముద్దు చేసుకున్నా.. అది మీ ఇరువురికే పరిమితం కావాలి.. అంతేతప్ప ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తూ పెద్దవారి దృష్టికి తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. అలాగే భార్యాభర్తలిద్దరూ అత్తింటి వారి ముందు, పుట్టింటి వారి ముందు తమ భాగస్వామికి తగిన గౌరవం ఇవ్వాలి. అప్పుడే పెద్దవారికి ఆనందంగా ఉండడంతో పాటు మీకూ తగిన గౌరవమర్యాదలు వారి నుంచి లభిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని