Published : 23/10/2022 11:18 IST

Green Diwali: కాస్త సహజంగానే..!

ఏ పండగైనా.. ఇంటి ముంగిళ్లలో అందమైన రంగవల్లుల్ని తీర్చిదిద్దకపోతే అసలు ఆ రోజు పండగ వాతావరణమే కనిపించదు. అయితే వీటికోసం ఉపయోగించే రంగులు రసాయనాలతో కూడినవి కాకుండా సహజసిద్ధంగా తయారుచేసినవి వాడడం మంచిది. అలాంటి ఆర్గానిక్ రంగులు ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వీటితో పాటు సహజసిద్ధమైన తాజా పువ్వులు, పూరేకలతో మీ రంగవల్లికకు మరింత శోభనివ్వండి. మీ ముంగిళ్ల ముందు పూల సువాసనలతో పండగని మొదలుపెట్టండి.

గ్రీన్ గిఫ్ట్స్..!

పండగ నాడు బహుమతులనగానే చాక్లెట్స్, స్వీట్స్, డ్రైఫూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం.. ఇవేనా? అందుకే ఈసారి గ్రీన్ గిఫ్ట్స్‌కి ఓటేద్దాం! ఈ క్రమంలో సన్నిహితులకు ఓ మొక్కను బహుమతిగా అందిద్దాం. వాటిని పెంచడానికి ఉపయోగించే కుండీల విషయంలో కూడా జాగ్రత్త వహించండి. వెదురు బుట్టలని, జనపనారతో అల్లిన బుట్టల్ని, మట్టికుండలని అందుకోసం ఉపయోగించండి. ఇవి కాకుండా ఏదైనా మంచి పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇవ్వచ్చు. సాధారణంగా గిఫ్ట్‌ని ఇచ్చేటప్పుడు వాటిని అందంగా ఉన్న బ్యాగ్స్‌లోనో, కలర్‌ఫుల్‌గా కనిపించడానికి ర్యాపర్లతో గిఫ్ట్ ప్యాక్ చేయిస్తుంటాం. ఇందుకు చాలామంది ప్లాస్టిక్ గిఫ్ట్ ప్యాక్ ర్యాపర్లను ఉపయోగిస్తుంటారు. వాటి వల్ల పర్యావరణానికి ఎక్కువగా ముప్పు వాటిల్లుతోంది. కాబట్టి ప్లాస్టిక్ తరహా ర్యాపర్లకు బదులుగా పలుచగా ఉండి, వివిధ రంగుల్లో దొరికే కాటన్ క్లాత్‌లో చుట్టి ఇవ్వండి. వాటిపై ఆకులతో, పువ్వులతో అలంకరిస్తే చూడచక్కగా ఉంటుంది. వీటితో పాటుగా రంగురంగుల పేపర్ ర్యాపర్లు కూడా వాడచ్చు. ఇంకా కావాలంటే వాటిపై స్కెచ్ పెన్నులతో అందమైన డిజైన్లనూ వేయచ్చు. ఇంకాస్త ట్రెండీగా ఉండాలంటే బీడ్స్, స్టోన్స్ వంటి వాటితోనూ గిఫ్ట్స్ ప్యాక్‌ను తీర్చిదిద్దచ్చు. ఇలాంటి గిఫ్ట్స్, ర్యాపింగ్ మెటీరియల్‌తో మన వంతుగా పర్యావరణాన్ని సంరక్షిద్దాం.

మట్టి వస్తువులతో..!

ఈ దీపాల పండక్కి ఇల్లంతా అందంగా అలంకరించడం సహజం. అయితే ఈసారి కేవలం మట్టితో తయారు చేసిన అలంకరణ వస్తువులను ఎంచుకుని 'గ్రీన్ దివాలీ'కి ఓటేయండి. అందరిలోకెల్లా మీ ఇల్లే ప్రత్యేకంగా, శోభాయమానంగా వెలిగిపోతుంది. వాల్ డెకరేటివ్ ఐటమ్స్, వాల్ హాంగింగ్స్, విండ్‌ఛైమ్స్.. వంటి వివిధ రకాల ఎన్నో అలంకరణ వస్తువులు మట్టితో, పేపర్‌తో రూపొంది మార్కెట్లో కొలువుదీరాయి. ఈసారి ప్లాస్టిక్ పువ్వులతో కాకుండా సహజమైన పూలతో మీ ఇంటిని అలంకరించండి. దివ్వెల పండగకి ప్రమిదలు లేకపోతే అసలు పండగే సంపూర్ణం కాదు. అవి కూడా మట్టితో తయారుచేసిన ప్రమిదలు వివిధ రకాల ఆకారాల్లో, సహజమైన రంగులద్దినవి కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.

పెట్స్‌ జాగ్రత్త!

సాధారణంగా కుక్కల్లాంటి పెంపుడు జంతువులు మంటలను చూసి భయపడతాయి. టపాసుల శబ్దాలు వాటిని మరింత భయభ్రాంతులకు గురిచేస్తాయి. పైగా వాటికి వాసన పీల్చే సామర్థ్యం కూడా అధికంగా ఉండడంతో పొగకు ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదముంది. అందుకే పండగ రోజు పెంపుడు జంతువులను శబ్దాలు వినిపించని గదిలో కట్టేసి ఉంచడం మంచిది. ఇంట్లో వెలిగించే దీపాలు, ప్రమిదలకు కూడా వాటిని దూరంగా ఉంచాలి. లేకపోతే అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదముంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని