ఫర్నిచర్‌పై మరకలు మాయమిలా..

సరళ ఎంతో ముచ్చటపడి తనకు నచ్చిన మోడల్ డైనింగ్‌ టేబుల్‌ని దగ్గరుండి మరీ తయారు చేయించుకుంది. కానీ కొన్ని రోజులు గడిచేసరికి దానిపై ఏవేవో మరకలు పడ్డాయి. ఎంత ప్రయత్నించినా అవి పోవడం లేదు....

Published : 28 May 2023 13:32 IST

సరళ ఎంతో ముచ్చటపడి తనకు నచ్చిన మోడల్ డైనింగ్‌ టేబుల్‌ని దగ్గరుండి మరీ తయారు చేయించుకుంది. కానీ కొన్ని రోజులు గడిచేసరికి దానిపై ఏవేవో మరకలు పడ్డాయి. ఎంత ప్రయత్నించినా అవి పోవడం లేదు.. సరికదా కొత్తవి వచ్చి చేరుతున్నాయి.

ఈ విధంగా ఫర్నిచర్‌పై పడిన మరకలను పోగొట్టాలని చాలామంది గృహిణులు ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మరకలు శుభ్రం చేసే తీరు వల్ల ఫర్నిచర్‌ కళ తగ్గిపోతుంది. ఈ క్రమంలో ఇంట్లోని ఫర్నిచర్‌ను సులభమైన పద్ధతుల్లో శుభ్రం చేసుకోవడమెలాగో తెలుసుకుందాం..!

టూత్‌పేస్ట్‌తో..

సాధారణంగా డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు, గ్లాసులు పెట్టడం వల్ల వలయాల మాదిరిగా నీటి మరకలు ఏర్పడతాయి. వీటిని తొలగించడానికి టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. కొద్దిగా టూత్‌పేస్టుని తీసుకుని దానిని నీటితో పలుచగా అయ్యేలా కలపాలి. దీనిని మరకపై రాసి కొన్ని నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో తుడిచేయాలి. ఈ చిట్కాని ఉపయోగించి కేవలం డైనింగ్ టేబుల్ మీదనే కాదు కిటికీలు, తలుపులపై పడిన నీటిచుక్కల మరకల్ని కూడా సులభంగా వదిలించేయచ్చు.

ఫర్నిచర్ వ్యాక్స్‌తో..

సాధారణంగా ఫర్నిచర్‌పై ఏర్పడే మరకలు నీటి వల్లనే ఏర్పడతాయి. కాబట్టి వాటిని సులువుగా తొలగించడానికి ఫర్నిచర్ వ్యాక్స్‌ని ఉపయోగించవచ్చు. కొద్దిగా ఫర్నిచర్ వ్యాక్స్‌ని తీసుకొని మరకపై రాసి మెత్తని వస్త్రంతో తుడిచేయాలి. అప్పటికీ మరక వదలకపోతే.. మినరల్ స్పిరిట్‌లో ముంచిన మెత్తని వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది.

లిక్విడ్ బ్లీచ్‌తో..

చెక్కతో చేసిన ఫర్నిచర్‌పై ఏర్పడిన ఎలాంటి మరకనైనా లిక్విడ్ బ్లీచ్‌తో సులభంగా తొలగించవచ్చు. టూత్‌బ్రష్‌ను లిక్విడ్ బ్లీచ్‌లో ముంచి మరకపై సున్నితంగా రుద్దాలి. కొన్ని నిమిషాల తర్వాత మెత్తటి పొడి వస్త్రంతో తుడిచేస్తే మరక పోతుంది.

వీటిని కూడా ప్రయత్నించండి..

అరచెంచా వెనిగర్‌ని ఒక కప్పు చల్లటి నీటిలో కలపాలి. ఈ మిశ్రమంలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి మరకపై తుడవాలి.

గోరువెచ్చని నీటిలో సబ్బు కలిపి తుడిచినా మరక చాలావరకు పోతుంది.

కొద్దిమొత్తంలో ఉప్పు తీసుకొని ఆలివ్ ఆయిల్‌తో ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరకపై రాసి కొంత సమయం తర్వాత తుడిచేయాలి.

కొద్దిగా పెట్రోలియం జెల్లీని మరకపై రాసి మరుసటి రోజు వస్త్రంతో తుడిస్తే మరక వదిలిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్