ఆఫీసులో ఇలా చేయద్దు!

ప్రతి మనిషిలోనూ పాజిటివ్, నెగెటివ్.. రెండు రకాల భావోద్వేగాలు దాగుంటాయి. అయితే పాజిటివ్ ఎమోషన్స్ వల్ల ఎలాంటి సమస్యలూ తలెత్తకపోయినా, నెగెటివ్ ఎమోషన్స్ మాత్రం మనల్ని మానసికంగా కుంగిపోయేలా....

Updated : 24 Apr 2023 20:47 IST

ప్రతి మనిషిలోనూ పాజిటివ్, నెగెటివ్.. రెండు రకాల భావోద్వేగాలు దాగుంటాయి. అయితే పాజిటివ్ ఎమోషన్స్ వల్ల ఎలాంటి సమస్యలూ తలెత్తకపోయినా, నెగెటివ్ ఎమోషన్స్ మాత్రం మనల్ని మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా పనిచేసే చోట ఇలాంటి భావోద్వేగాలు అస్సలు ప్రదర్శించకూడదంటున్నారు కార్పొరేట్ నిపుణులు. లేదంటే దాని ప్రభావం మనం చేసే పని మీద పడుతుంది. అంతేకాదు.. మనకుండే ఇలాంటి భావాల వల్ల సహోద్యోగులకు మనపై చులకన భావం ఏర్పడే అవకాశం లేకపోలేదు. దీన్ని అదనుగా తీసుకొని కొందరు మనల్ని మానసికంగా మరింత బలహీనపడేలా చేసే ప్రమాదమూ ఉంది. ఇలా తరచూ జరగడం వల్ల దాని ప్రభావం మన కెరీర్‌పై తీవ్రంగానే ఉంటుంది. కాబట్టి మనం పని చేసే చోట కొన్ని భావోద్వేగాలను అదుపు చేసుకొని ముందుకు సాగమంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆఫీసులో ఎలాంటి భావోద్వేగాలను ఎలా అదుపు చేసుకోవాలో తెలుసుకుందాం రండి..

కోపమొస్తోందా..?

'అబ్బబ్బా.. ఎంత చేసినా ఈ పని మాత్రం అయిపోవట్లేదు.. దీనికి తోడు ఎవరైనా రాకపోతే వారి పనీ నేనే చేయాలి..' అంటూ కోపం తెచ్చుకుంటుంటారు కొంతమంది. అయితే దీనివల్ల నిరాశానిస్పృహలు ఆవహించడం తప్ప మరే ప్రయోజనమూ ఉండదు. ఇక ఆ సమయంలో ఎవరైనా తోటి ఉద్యోగులు కదిపారంటే ఆ కోపాన్నంతా వారిపై చూపిస్తుంటారు. ఇలాంటి ధోరణి పనిచేసే చోట అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఇటు మీ పనీ పూర్తి కాదు.. అటు ఇతరులతోనూ అభిప్రాయభేదాలు ప్రారంభమవుతాయి. కాబట్టి పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఆలోచించాలి. వాటిలో ఈరోజే కచ్చితంగా పూర్తిచేయాల్సిన పనులేంటో చూసుకొని మీకున్న సమయంలోనే వాటిని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత సమయం ఉంటే మిగతా పనులు చేయడం, లేదంటే వాటిని మరుసటి రోజు పూర్తిచేయడం.. ఇలాంటి చిన్న చిన్న ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరిస్తే.. పని ఎక్కువగా ఉందన్న చికాకు మీపై పడకుండా ఉంటుంది. మీ కోపాన్ని ఎవరి పైనా ప్రదర్శించకుండా అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి.

ఏడుస్తున్నారా?

మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న వారికి కూడా ఇటు వృత్తిపరంగా, అటు వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలుంటాయి. అయితే కొందరు ఈ రెండింటినీ సమన్వయం చేసుకోలేక పనిచేస్తున్న సమయంలో వ్యక్తిగత సమస్యలు గుర్తొచ్చి లేదంటే ఎవరైనా గట్టిగా మందలించినప్పుడు.. వెంటనే ఏడ్చేస్తుంటారు. అలాగే వృత్తిపరమైన విషయాలు ఇంటి దాకా తీసుకెళ్లి అక్కడ కూడా తమకి, ఇంట్లో వాళ్లకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు. కానీ ఇలా సహోద్యోగుల ముందు, పైఅధికారుల ముందు ఏడవడం వల్ల వారికి మీరు చులకనయ్యే అవకాశముంది. కాబట్టి సమస్య ఏదైనా మన మనసులో ఉండే బాధను, ఏడుపును అదుపులో ఉంచుకొని దాని ప్రభావం చేసే పనిపై పడకుండా చూసుకోవడం ఉత్తమం. మరీ అంతలా బాధనిపిస్తే మీకు కాస్త క్లోజ్‌గా ఉన్న ఉద్యోగులతో లేదంటే మీ కుటుంబ సభ్యులతో పంచుకొని దాని పరిష్కారం కోసం వారి సహాయం తీసుకోవడంలో తప్పు లేదని గుర్తుంచుకోండి.

అసూయకు దూరం..

ఆఫీసన్నాక అందరు ఉద్యోగులూ ఒకే రకంగా పని చేయాలని, అందరి ఆలోచనలూ ఒకే తరహాలో ఉండాలని రూలేం లేదు. కొందరికి పని విషయంలో మంచి మంచి ఆలోచనలు రావచ్చు.. దాంతో వారు పై అధికారుల మెప్పు పొందచ్చు. మరికొందరు తటస్థంగానే ఉండచ్చు. అయితే ఇలా సహోద్యోగులపై పొగడ్తల వర్షం కురిపించినప్పుడు కొందరు ఉద్యోగులు వారిపై అసూయ పడుతుంటారు. 'అబ్బా.. ఆ మాత్రం పనికే అంత పొగడాలా.. మేం చేయలేమా ఏంటి.. ఆ పాటి పని..' అంటూ వారిపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకుంటుంటారు. కానీ ఇలాంటి వాటి వల్ల ఇతరులకు మీపై చెడు అభిప్రాయం కలగడం తప్ప మరే ప్రయోజనమూ ఉండదు. కాబట్టి సహోద్యోగుల విషయంలో ఇలాంటి అభిప్రాయాలు మాని.. మీకు తెలియని విషయాలు వారి నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఏ విషయంలోనైనా ఇతరులతో పోల్చుకోవడం మాని.. ఉద్యోగులందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ.. ఒకవేళ వారేదైనా విజయం సాధిస్తే.. మీరూ వారిని మనస్ఫూర్తిగా అభినందించడం నేర్చుకోవాలి.

అపరాధ భావంలో ఉన్నారా?

పై అధికారులు అప్పగించిన పనిని సరైన సమయంలో పూర్తి చేయకపోయినా, పని చేయడానికి పెట్టుకున్న డెడ్‌లైన్లో అది పూర్తవకపోయినా, అందులో తప్పులున్నా.. చాలామంది ఉద్యోగుల మనసుల్లో అపరాధ భావం మెదులుతుంటుంది. అయితే దీని ప్రభావం ఆ తర్వాత మనం చేసే పనిపై పడడంతో పాటు అది మన మనసునూ కుంగదీస్తుంది. కాబట్టి మీలో ఉన్న అపరాధ భావాన్ని వెంటనే తొలగించడం మంచిది. ఇందుకోసం పదే పదే దాని గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం కాకుండా అనుకున్న సమయంలో పని పూర్తిచేయలేకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకొని వాటిని మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి. తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఫలితంగా మరోసారి ఈ భావన మన మనసులోకి రాకుండా పనిపై పూర్తి ఏకాగ్రత నిలిపి దాన్ని శ్రద్ధగా చేయగలుగుతాం.

భయాందోళనలకు దూరంగా..

కొత్తగా ఉద్యోగంలో చేరినా, అందులో కొన్నేళ్ల అనుభవం గడించినా కొందరికి వారు చేసే ఉద్యోగం పట్ల కాస్త భయం దాగుంటుంది. పని విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ కాకపోవడం, అన్ని అంశాల్లో ఇతరులతో పోల్చుకోవడం.. వంటి సందర్భాల్లో ఇలాంటివి సహజంగా ఎదురవుతుంటాయి. మరి, ఇలాంటి భయం వల్ల మీపై మరింత ఒత్తిడి పడి, చేస్తున్న పని కూడా సరిగ్గా చేయలేరు. కాబట్టి మీ పనికి సంబంధించిన అంశాల విషయంలో ఎప్పటికప్పుడు అప్ టు డేట్‌గా ఉండేలా జాగ్రత్తపడాలి. అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు. కాబట్టి మీకు తెలియని విషయాలను సహోద్యోగులను అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఇతరులకు నాకంటే ఎక్కువ అంశాల్లో పరిజ్ఞానం ఉంది.. అంటూ ఎదుటివారితో పోల్చుకొని బాధపడడమూ కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి విషయాలను దృష్టిలో ఉంచుకుంటే పని ప్రదేశాల్లో భయమనేదే మీ దరి చేరదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని