Published : 22/10/2022 18:23 IST

జుట్టు తెల్లబడుతోందా?

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ బాధిస్తున్న సమస్యల్లో జుట్టు తెల్లబడటం కూడా ఒకటి. చిన్న వయసులోనే ఇప్పుడు ఇది సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో ఇంట్లో లభ్యమయ్యే కొన్ని పదార్థాలను వినియోగించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు అరికట్టవచ్చంటున్నారు నిపుణులు.

ఉసిరి రసం..

ఉసిరికాయల నుంచి తీసిన రసాన్ని రోజూ తాగడం ద్వారా జుట్టు తెల్లబడకుండా ఉండటమే కాదు.. జుట్టు రాలడం, చివర్లు చిట్లడం.. వంటి సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. ఈ రసం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి సైతం చక్కని ఉపశమనం లభిస్తుంది.

డికాక్షన్‌తో..

ఉసిరికాయల్ని కొద్ది గంటల పాటు నానబెట్టాలి. తర్వాత అందులో చెంచా నీలగిరి తైలం (యూకలిప్టస్ ఆయిల్) కలిపి రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమంలో ఒక గుడ్డు, కొద్దిగా నిమ్మరసం, పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా వేసుకుని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా తరచూ చేయడం వల్ల 15 రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

పెరుగుతో..

కొద్దిగా కరివేపాకు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. అందులో పావుకప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. 15 నుంచి 30 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత తలస్నానం చేయాలి. ఇది మన అమ్మమ్మల కాలం నుంచి పాటిస్తున్న చక్కని పద్ధతి.

జామ ఆకులతో..

కొన్ని జామ ఆకులు తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని తలకు అప్త్లె చేసుకుని కాసేపు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరినూనెతో..

కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అందులో చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో కురులకు బాగా మర్దన చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

అల్లం, తేనెతో..

కొద్దిగా అల్లం రసానికి చెంచా తేనె కలిపి రోజూ తాగడం ద్వారా కూడా కురులు తెల్లబడకుండా సంరక్షించుకోవచ్చు. అలాగే దీనివల్ల ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా..

⚛ ఆముదాన్ని కేశాలకు పట్టించి మృదువుగా మర్దన చేయాలి. కాసేపు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

⚛ వేపనూనెను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు.

⚛ శీకాకాయ, ఉసిరిపొడి.. వంటి సహజసిద్ధమైన పదార్థాలను కూడా ప్రత్యామ్నాయాలుగా వినియోగించుకోవచ్చు.

⚛ ఓట్స్, బ్లాక్‌టీ, నిమ్మరసం, బాదం నూనె.. ఇవన్నీ జుట్టు తెల్లబడకుండా సంరక్షించడానికి ఉపయోగపడేవే.. అంటున్నారు నిపుణులు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని