ఈ బద్ధకపు భర్తతో వేగేదెలా?!
భార్యాభర్తల అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ బంధాన్ని దృఢంగా మార్చుకునే క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురవుతాయో.. అన్ని మధురానుభూతులూ సొంతమవుతాయి. ఇద్దరి మధ్య వచ్చే సమస్యలకు సానుకూలంగా స్పందించినప్పుడే....
భార్యాభర్తల అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ బంధాన్ని దృఢంగా మార్చుకునే క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురవుతాయో.. అన్ని మధురానుభూతులూ సొంతమవుతాయి. ఇద్దరి మధ్య వచ్చే సమస్యలకు సానుకూలంగా స్పందించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. సాధారణంగా దంపతులు కొన్ని సమస్యల్ని తరచూ ఎదుర్కొంటుంటారు. అందులో ముఖ్యమైనది బద్ధకం. ఒకవైపు ఇంటి పనులు చేయడం, పిల్లలను చూసుకోవడం.. మరోవైపు ఆఫీసు వర్క్‌తో చాలామంది భార్యలు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇలాంటివారిలో కొంతమంది తమ బద్ధకపు భర్తతో వేగలేకపోతారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. మరి, ఇలా జరగకుండా అనుబంధాన్ని నిలుపుకోవాలంటే మీ భర్త ప్రవర్తనను మీరే మార్చుకోవాలంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..
కారణాలను వెతకండి...
కొంతమంది మహిళలు ‘నా భార్త చాలా బద్ధకస్తుడు, ఏ పనిలో సహాయం చేయడు. ఆయన వల్ల విసుగు చెందాను..’ అని నిట్టూరుస్తుంటారు. అయితే దీనికంటే ముందు అతని బద్ధకానికి గల అసలు కారణాలను వెతికే ప్రయత్నం చేయండి. ఇందుకోసం ఇద్దరూ కూర్చొని మీ సమస్యలను అంశాల వారీగా చర్చించుకోండి. కొన్ని సందర్భాల్లో ఆఫీసులో ఉండే ఒత్తిళ్ల వల్ల ఇంటి దగ్గర బద్ధకంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి, ముందు కారణాన్ని వెతికి దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి.
‘సూపర్ హీరో’ను చేయండి..!
‘నా భర్త ఇవతలి గిన్నె తీసి అవతల పెట్టడు’ అని కొంతమంది మహిళలు వాపోతుంటారు. ఇలాంటి వారికి రివర్స్ సైకాలజీని అప్లై చేయాలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా వారికి కొన్ని రకాల పనులు అప్పగించండి. ‘ఈ పనులు మీరు మాత్రమే చేయగలుగుతారు’ అని వారిని ప్రోత్సహిస్తూనే.. వారికి ‘సూపర్ హీరో’ టైటిల్ ఇవ్వండి. అయితే అన్ని సందర్భాల్లో మీ భర్త అవసరం మీకు ఉండకపోవచ్చు. కానీ, అవసరం లేకున్నా క్రమంగా ఆ పనులను వారికే అప్పగించడం ద్వారా వారు వాటిని తమ బాధ్యతగా భావించే అవకాశం ఉంటుంది. అలాగే వారు ఆ పనులు చేయడం ద్వారా మీరు, పిల్లలు ఎంత ఆనందపడుతున్నారో వారికి తెలియజేయండి. దాంతో వారు తమకిచ్చిన ‘సూపర్ హీరో’ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఆ పనిని క్రమం తప్పకుండా చేసేందుకు ఆరాటపడడం ఖాయం!
మీరే కారణమా?
కొంతమంది మహిళలు తమకు తాము సూపర్ ఉమన్‌గా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో పని చేయడం, పిల్లలను చూసుకోవడం, ఆఫీసు పని.. ఇలా అన్ని రకాల పనులను భర్త సహకారం లేకుండా ఒక్కరే పూర్తి చేసుకుంటారు. దీనిని అదనుగా చేసుకొని కొంతమంది భర్తలు ‘ఎలాగూ పనులన్నీ తనే చేసుకుంటుంది కదా!’ అని విశ్రాంతి తీసుకుంటారు. దీనివల్ల క్రమంగా బద్ధకం వచ్చేస్తుంటుంది. మీరు కూడా అన్ని సందర్భాల్లో అన్ని పనులూ పూర్తి చేయలేరు. ఇలాంటప్పుడే అసలు సమస్య వస్తుంది. కాబట్టి, మీకు అన్ని పనులు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్ని పనులను మీ భర్తకు అప్పగించడం మంచిది. తద్వారా మీకూ కాస్త సమయం దొరుకుతుంది. మీ భర్తా బద్ధకాన్ని పక్కన పెట్టి బాధ్యతగా వ్యవహరిస్తారు.
అభినందించండి...
చేసిన పనికి ప్రశంసలు దక్కితే వారు తమ పనిని మరింత ఉత్సాహంగా చేస్తుంటారు. భర్తల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. కానీ, కొంతమంది వారు చేసిన పనిలో తప్పులు వెతుకుతుంటారు. దీనివల్ల వారు చేసే పనుల్ని కూడా పక్కన పెట్టే అవకాశాలూ లేకపోలేదు. అందుకే పేచీ పెట్టుకోవడానికి బదులుగా వారు చేసిన పనిని ప్రశంసించడం లేదా వారికి ప్రేమతో ఓ కానుకివ్వడం.. వంటివి చేయడం వల్ల వారు సంతృప్తి పడడంతో పాటు మీకు మరింతగా సహాయం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఇద్దరి మధ్య అనుబంధమూ దృఢమవుతుంది.
ఇలా చేయకండి...
కొంతమంది ఒకే పని గురించి వందసార్లు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తి చిరాకు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఒకవేళ వాళ్లు పని గురించి మర్చిపోయినా సాధ్యమైనంత వరకు వారికి నెమ్మదిగా గుర్తు చేసే ప్రయత్నం చేయండి. అలాగే అతను చేసే పనిలో ఏదైనా ఇబ్బంది పడుతుంటే మీ వంతుగా సహాయం అందించండి. దీనివల్ల అతని పట్ల మీకున్న శ్రద్ధ తెలుస్తుంది.
దానిని ఆమోదించాలి...
ఒకే పనిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. కాబట్టి, మీరు చెప్పిన పనిని అనుకున్న విధంగా అవతలి వ్యక్తి చేయలేదని నిందించకండి. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తి మరింత సోమరిగా మారే అవకాశం ఉంటుంది. బదులుగా వారు చేసిన పనిని ఆమోదించండి. అలాగే కొంతమంది పనిని త్వరగా చేస్తే, మరికొంతమంది నెమ్మదిగా చేస్తుంటారు. ఇలాంటప్పుడు కూడా చిరాకు పడకండి. మీకు ఎంతో కొంత పనిభారాన్ని తగ్గిస్తున్నందుకు ఆనందపడండి.
ఆడుతూ పాడుతూ...
మారుతున్న జీవనశైలిలో భాగంగా ప్రతి ఒక్కరూ బిజీగా గడుపుతున్నారు. దాంతో భార్యభర్తల మధ్య మాట్లాడుకునే సమయం కూడా తగ్గుతుంది. కాబట్టి, ఏ పనైనా ఇద్దరూ పంచుకొని చేయండి. ఈ సమయంలో మనసులోని మాటల్ని పంచుకోండి. ఫలితంగా పని త్వరగా పూర్తవ్వడమే కాదు.. ఇద్దరూ కలిసి ఇలా సమయం గడపడం వల్ల మీ దాంపత్య బంధమూ బలపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.