అలాంటి వారితో అసౌకర్యం లేకుండా..!

ఇంటి తర్వాత మనం ఎక్కువ సమయం గడిపేది ఆఫీస్‌లోనే! ఇంట్లో ఎంత సౌకర్యంగా ఉంటామో.. పని ప్రదేశంలోనూ అంతే సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకున్నప్పుడే సాఫీగా పనిచేసుకోగలుగుతాం.

Published : 28 Aug 2023 21:11 IST

ఇంటి తర్వాత మనం ఎక్కువ సమయం గడిపేది ఆఫీస్‌లోనే! ఇంట్లో ఎంత సౌకర్యంగా ఉంటామో.. పని ప్రదేశంలోనూ అంతే సౌకర్యవంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకున్నప్పుడే సాఫీగా పనిచేసుకోగలుగుతాం.. చక్కటి ఉత్పాదకతనూ సంస్థకు అందించగలుగుతాం. అయితే కొన్నిసార్లు ఇది కుదరకపోవచ్చు.. సహోద్యోగుల అనుచిత ప్రవర్తన, పైఅధికారుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు, అధిక పనిభారం.. వంటివి మన పనికి అంతరాయం కలిగించడమే కాదు.. ఒక రకమైన అసౌకర్యం, అసహనానికి గురయ్యేలా చేస్తుంటాయి. మరి, దీన్నిలాగే కొనసాగిస్తే.. చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టలేం. అందుకే ఈ అసౌకర్యాన్ని వీలైనంత త్వరగా దూరం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ఆ వేధింపులకు.. చెక్!

మన చుట్టూ మనల్ని ప్రోత్సహించే వారి కంటే నిరుత్సాహపరిచే వారే ఎక్కువ మంది ఉంటారు. పని ప్రదేశంలోనూ అంతే! ఈ క్రమంలో కొంతమంది వేధింపులకూ గురి చేస్తుంటారు. మాటలు/చేతలతో హింసించడం, లైంగికంగా వేధించడం, సైబర్‌ బుల్లీయింగ్‌.. వంటి కేసులు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటివి కూడా పని ప్రదేశంలో మనల్ని అసౌకర్యానికి గురిచేస్తుంటాయి. మరి, వీటిని ఎక్కువగా పట్టించుకుంటే మానసిక సమస్యలు తప్పవు. అలాగని పూర్తిగా నిర్లక్ష్యం చేసినా.. లేనిపోని సమస్యల బారిన పడచ్చు. కాబట్టి ఇలా వేధింపులకు గురి చేసే వారిపై హెచ్‌ఆర్ విభాగానికి ఫిర్యాదు చేయచ్చు. ఫలితంగా వారు వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం, మారకపోతే తగిన చర్యలు తీసుకోవడం.. వంటివి చేస్తారు. ఇకపై వారితో జాగ్రత్తగా మసలుకుంటే.. మీ పని మీరు సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవచ్చు.

ఓకే.. కొన్నిసార్లు ‘నో’!

ఆఫీస్‌లో ‘నా పనేదో నాది’ అంటే అన్నిసార్లూ ఇది కుదరకపోవచ్చు. సహోద్యోగులు సెలవులో ఉన్నప్పుడు, పైఅధికారులు అదనపు బాధ్యతలు అప్పగించినప్పుడు.. అదనంగా కొన్ని పనులు స్వీకరించాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు ‘అన్ని పనులూ నేనే చేయాలా?’ అంటూ ఒక రకమైన అసౌకర్యానికి గురవుతుంటాం.. ఈ పనులన్నీ ఎప్పుడు పూర్తవుతాయన్న ఆందోళనా చుట్టుముడుతుంది. నిజానికి ఇలా టెన్షన్‌ పడుతుంటే.. అటు పనులూ పూర్తి కావు.. ఇటు సహనమూ దెబ్బతింటుంది. కాబట్టి సహోద్యోగులు సెలవులో ఉన్నప్పుడు, మీ పనితీరు, ఓపికను పరీక్షించడానికి పైఅధికారులు అదనపు పని భారాన్ని మీపై మోపినప్పుడు.. సానుకూల దృక్పథంతో వాటిని స్వీకరించమంటున్నారు నిపుణులు. ఒకవేళ పని పూర్తి చేయడానికి కాస్త ఆలస్యమైనా.. టెన్షన్‌ పడిపోకుండా.. నెమ్మదిగా దీని గురించి అధికారులకు వివరణ ఇస్తే సరిపోతుంది. ఇక ఇలాంటి సందర్భాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రతిసారీ ఇదే పునరావృతమవుతున్నా.. మీ టీమ్‌ లీడర్‌ మిమ్మల్నే టార్గెట్‌ చేస్తూ మీపై అదనపు పనిభారాన్ని మోపాలని చూస్తున్నట్లయితే మాత్రం.. దీని గురించి పైఅధికారులకు ఫిర్యాదు చేయచ్చు.. తద్వారా మీరూ అసౌకర్యానికి గురికాకుండా.. మీ పనుల్ని మీరు సమర్థంగా పూర్తిచేయగలుగుతారు.

పోటీ.. ఆరోగ్యకరంగా!

ఆఫీస్‌ పని మన వ్యక్తిగతం కాదు.. అంతిమంగా అది సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ క్రమంలో ఒక్కరిగా కాదు.. బృందంగా కలిసి పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం.. కానీ కొంతమంది తమ ఉత్పాదకతను ఇతరులతో పోల్చుకోవడం, వారు తమ కంటే బాగా పని చేస్తే సహించలేకపోవడం, వారిపై లేనిపోనివి కల్పించి సహోద్యోగులు/పైఅధికారులకు చెప్పడం, ఇతరుల ఐడియాలను తమవిగా చెప్పుకొని క్రెడిట్ కొట్టేయాలనుకోవడం.. వంటివి చేస్తారు. దీనివల్లే పని ప్రదేశంలో అనారోగ్యకరమైన పోటీ నెలకొంటుందంటున్నారు నిపుణులు. ఉద్యోగుల్లో ఉండే ఈ తరహా అనారోగ్యకరమైన పోటీతత్వం.. వ్యక్తిగతంగానే కాదు.. సంస్థ అభివృద్ధికీ ఆటంకంగా మారుతుందంటున్నారు. ఇలాంటి చోట పనిచేయడమంటే ఎవరికైనా అసౌకర్యంగానే అనిపిస్తుంటుంది.

అయితే ఇలాంటప్పుడే సంయమనం పాటించాలంటున్నారు నిపుణులు. ఇలా మిమ్మల్ని చూసి ఈర్ష్య పడే వారు, మీ పనుల్ని తమవిగా చెప్పుకొనే వారితో గొడవ పడకుండా.. మీరే నేరుగా ఓసారి మీ పైఅధికారుల్ని కలవాలంటున్నారు. వారి ప్రవర్తన గురించి నెమ్మదిగా వివరిస్తూనే.. మీ పనితనాన్ని వారి ముందుంచాలి. అప్పుడు ఎవరెలాంటి వారో వారికి అర్థమవుతుంది. ఏ గొడవా ఉండదు.. ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని