వాటికి కుంగిపోవద్దు.. ఇలా తిప్పికొట్టండి!
కొంతమంది ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. కానీ, అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేరు. ఇలాంటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో జరుగుతుంటాయి.
కొంతమంది ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. కానీ, అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేరు. ఇలాంటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో జరుగుతుంటాయి. సున్నిత మనస్తత్వం ఉండే మహిళలు విమర్శలు/అవమానాలను అస్సలు తట్టుకోలేరు. కొంతమంది తమ ఆనందం కోసం ఎదుటివారిని విమర్శిస్తే.. ఇంకొంతమంది వారి లోపాలను తెలియజేయడానికి విమర్శిస్తుంటారు. మరికొంతమంది తమ ప్రతిభ, అహంకారాన్ని చాటుకోవడానికి ఇతరులను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తుంటారు. ఇవి ఎదుటివ్యక్తి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ఈ క్రమంలో ఇతరుల నుంచి అవమానాలు/విమర్శలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందామా...
శాంతియుతంగా..
మనల్ని ఇతరులు అవమానపరిస్తే చెప్పలేనంత కోపం, బాధ కలుగుతుంటాయి. వాటికి వెంటనే బదులు తీర్చుకోవాలనుకోవడం సహజం. కానీ, ఆవేశంలో ప్రతిస్పందించినప్పుడు సమస్య మరింత పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దానివల్ల ఎలాంటి పరిష్కారం దొరకదు. కాబట్టి, మొదట మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఆ తర్వాత వారికి సున్నితంగా మీ అభిప్రాయాన్ని తెలియచేసే ప్రయత్నం చేయండి.
దూరంగా ఉండడమే ఉత్తమం..
కొంతమంది ఎదుటివారి చేతలను గమనిస్తూ వారిని అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలో తమ అహంకారాన్ని ప్రదర్శిస్తుంటారు. వీరికి ఎదుటి వ్యక్తి బాధపడతారన్న ఆలోచన కూడా ఉండదు. ఇలాంటివారితో ఎంత సానుకూలంగా ఉన్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి, ఇలాంటి వారికి దూరంగా ఉండడమే సరైన పరిష్కారం.
చతురతతో సమాధానం..
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అవమానాలు/విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఇలా విమర్శించేవారికి, అవమానించేవారికి అన్ని సందర్భాల్లోనూ ఎదుటివారిని ఇబ్బందిపెట్టాలన్న ఆలోచన ఉండకపోవచ్చు. కొంతమంది తమ మధ్య ఉన్న సాన్నిహిత్యంతో సరదాగా విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో అవతలి వ్యక్తి ఇబ్బందిపడుతున్నారన్న విషయాన్ని వారు గ్రహించరు. ఇలాంటప్పుడు వారికి చతురతతో సమాధానం చెప్పాలంటున్నారు నిపుణులు. దీనివల్ల అవతలి వ్యక్తికి మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపే అవకాశం ఉంటుంది.
వారితో చర్చించండి..
అందరూ మిమ్మల్ని బాధపెట్టాలన్న ఉద్దేశంతోనే విమర్శలు చేయరు. కొంతమంది మీ లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశంతో కూడా విమర్శలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వారిలో మీకు అత్యంత సన్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్రమే ఉంటారు. ఇలాంటి వారు విమర్శలు చేసినప్పుడు గట్టిగా సమాధానం చెప్పకుండా వారితో ఒకసారి చర్చించడం మంచిది. ఈ క్రమంలో మీ ప్రవర్తన, మీలో ఉండే లోపాల గురించి మీకు తెలియచేసి వారు మిమ్మల్ని సరిదిద్దాలనుకుంటున్నారేమో తెలుసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
సానుకూలంగా..
ఏ సమస్యకైనా సానుకూల ధోరణే సరైన పరిష్కారం. అయితే అన్ని సందర్భాల్లోనూ సానుకూలంగా ఉండడం కష్టమే. ముఖ్యంగా మనల్ని ఎవరైనా ఏదైనా విషయంలో అనవసరంగా విమర్శించినప్పుడు, అవమానించినప్పుడు విపరీతమైన కోపం రావడం సహజం. కానీ, అలాంటి సందర్భాల్లోనే మన వ్యక్తిత్వం బయటపడుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి సందర్భాల్లో సాధ్యమైనంతవరకు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ కోపాన్ని నియంత్రించుకోవడం అవసరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.