నచ్చని డిగ్రీ చేశారా? అయినా ఇలా కెరీర్‌లో సెటిలవ్వచ్చు!

కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు వచ్చాయని ఇంటర్‌ అయిపోగానే సహస్ర ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ కోర్సులో చేరింది. తీరా కోర్సు పూర్తయ్యే సమయానికి ఆమెకు వేరే సబ్జెక్టుపై మక్కువ ఉందని గ్రహించింది. దాంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయింది.....

Updated : 18 Feb 2022 14:07 IST

కెమిస్ట్రీలో ఎక్కువ మార్కులు వచ్చాయని ఇంటర్‌ అయిపోగానే సహస్ర ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ కోర్సులో చేరింది. తీరా కోర్సు పూర్తయ్యే సమయానికి ఆమెకు వేరే సబ్జెక్టుపై మక్కువ ఉందని గ్రహించింది. దాంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయింది.

ఇక శ్రావణి తన కుటుంబ సభ్యుల ఒత్తిడితో బీటెక్‌లో చేరింది. కానీ, ఆమెకు కంప్యూటర్‌ కోర్సు అంటే అస్సలు ఇష్టం లేదు. ఎలాగోలా అయిష్టంగానే కోర్సు పూర్తి చేసింది. కానీ అందులోనే కెరీర్‌ని కొనసాగించడం ఇష్టం లేక ‘నెక్స్టేంటి?’ అన్న ఆలోచనలో పడిపోయింది.

వీరిలాగే చాలామంది విద్యార్థులు కుటుంబ సభ్యుల ఒత్తిడి, భవిష్యత్తుపై సరైన అవగాహన-మార్గనిర్దేశనం లేకపోవడంతో తమకు నచ్చని కోర్సులను ఎంచుకొని ఇబ్బంది పడుతుంటారు. పలు సర్వేలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. అయితే నచ్చని కోర్సు ఎంచుకున్నంత మాత్రాన కెరీర్‌ అక్కడితో ఆగిపోదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకుంటే నచ్చని సబ్జెక్టులో డిగ్రీ చేసినా కెరీర్‌లో సెటిలవ్వచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

వాటిని రాసుకోవాలి...

ఆసక్తి లేని సబ్జెక్టుల్లో డిగ్రీ చేసినంత మాత్రాన మీ కెరీర్‌ అక్కడితో ఆగిపోదు. అలాగే ఆ డిగ్రీ ఎందుకూ పనికిరాదనే భావన కూడా సరి కాదు. చెడులో కూడా మంచిని వెతుక్కోవాలంటారు పెద్దలు. ప్రతి వ్యక్తికి ఒక్కో ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. కొంతమందికి ఏదైనా అంశంపై పరిశోధన చేయడమంటే ఇష్టముండచ్చు.. మరికొంతమందికి తెలుసుకున్న విషయాలను విడమరిచి చెప్పే నేర్పూ ఉండచ్చు.. ఇంకొంతమందికి నాయకత్వ లక్షణాలెక్కువగా ఉండచ్చు. కాబట్టి.. మీరు కోర్సు పూర్తి చేసే క్రమంలో మీరు కనబరిచిన ప్రత్యేక నైపుణ్యాలను ఒక పేపర్‌ మీద రాసుకోండి. ఆపై మీరు చదివిన డిగ్రీకి, మీకున్న నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగం వెతుక్కుంటే కెరీర్‌లో బోర్‌ అనే ఫీలింగే రాదు.

ఆన్‌లైన్‌ చక్కటి పరిష్కారం..

కొవిడ్‌ వల్ల విద్యావ్యవస్థ చిన్నాభిన్నం అయింది. అయితే అదే సమయంలో ఆన్‌లైన్‌ విద్యకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా అప్పటిదాకా ఉన్న ట్రెడిషనల్‌ సబ్జెక్టులకు బదులుగా ఆన్‌లైన్‌లో కొత్త కొత్త కెరీర్లకు(ఉదాహరణకు.. డేటా సైన్స్‌, సేల్స్‌ఫోర్స్‌.. వంటివి) ఆదరణ బాగా పెరిగింది. ఆ కోర్సుల వల్ల ఉపాధి అవకాశాలు కూడా మెండుగానే ఉంటున్నాయి. కాబట్టి, అందులో మీ అభిరుచికి తగ్గట్లుగా.. తక్కువ వ్యవధిలో పూర్తయ్యే కోర్సుని ఎంపిక చేసుకుంటే హాయిగా ఇంట్లో నుంచే నేర్చేసుకోవచ్చు. ఎలాగూ ఇష్టమైన కోర్సు కాబట్టి ఉద్యోగాన్వేషణ కూడా ఉత్సాహంగా కొనసాగించచ్చు. తద్వారా కెరీర్‌లోనూ సెటిలవ్వచ్చు.

అనుబంధ కోర్సులు..

కొంతమంది విద్యార్థులు తాము నేర్చుకున్న సబ్జెక్టుపై మక్కువ చూపిస్తుంటారు. కానీ, అదే కోర్సుకు సంబంధించిన ఉద్యోగాలు చేయడమంటే వారికి నచ్చదు. ఉదాహరణకు.. మ్యాథ్స్‌, ఫైనాన్స్ అంటే ఇష్టం ఉన్న వారికి అకౌంటెంట్‌ జాబ్‌ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు ఆ కోర్సుకు అనుబంధంగా ఉన్న వేరే కోర్సుల్ని నేర్చుకోవచ్చు. ఉదాహరణకు.. ఫైనాన్స్‌ సబ్జెక్టుగా డిగ్రీ చేసిన వారు ఫైనాన్షియల్‌ అనాలిసిస్‌, డేటా విజువలైజేషన్‌.. వంటి అనుబంధ కోర్సులు నేర్చుకొని అందులోనే ఉద్యోగాలు వెతుక్కోవచ్చు. నచ్చని డిగ్రీ చేసినా ఇష్టమైన కెరీర్‌ని ఎంచుకోవడానికి ఇదీ ఓ మార్గమే!

ఆ సందేహం వద్దు..

నచ్చని డిగ్రీ చేసినా.. ఆ తర్వాత కొత్త కోర్సులు నేర్చుకున్న విద్యార్థులు ఉద్యోగానికి సిద్ధమవుతారు. ఈ క్రమంలో చేసిన డిగ్రీ, నేర్చుకున్న కోర్సు వేర్వేరుగా ఉండచ్చు.. ఇలాంటప్పుడు దానిని రెజ్యుమేలో పొందుపరచాలా? వద్దా? అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే మీరు నేర్చుకున్న ప్రతి కోర్సు/సబ్జెక్టుకు సంబంధించిన వివరాలు రెజ్యుమేలో పొందుపరచడం వల్ల ఎలాంటి నష్టం ఉండదంటున్నారు నిపుణులు. అయితే ఇంటర్వ్యూ సమయంలో మీ డిగ్రీ, ఆ తర్వాత కొత్తగా నేర్చుకున్న కోర్సు గురించి, అలాగే మీలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలు.. వంటి విషయాలన్నింటిపైనా పూర్తి అవగాహన ఉండడం ముఖ్యం. తద్వారా ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకు తడబడకుండా సమాధానాలు చెప్పగలుగుతారు. ఫలితంగా ఉద్యోగమూ మీ సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్