Published : 18/10/2022 12:40 IST

అందుకే పిల్లలకూ ఆధ్యాత్మికత అవసరం!

పిల్లలకు చదువు ఎంత ప్రధానమో.. ఆధ్యాత్మిక చింతన కూడా అంతే అవసరం. కానీ, నేటి తరం పిల్లలు గ్రేడ్‌లు, ర్యాంకుల హడావిడిలో పడి ఎక్కువ సమయం చదువుకోవడానికే కేటాయిస్తున్నారు. ఫలితంగా వారికి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకునే అవకాశం లభించడం లేదు. కానీ, పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతనను అలవరచాలంటున్నారు నిపుణులు. దీనివల్ల జీవితంలో సన్మార్గంలో నడవడంతో పాటు, ఎత్తుపల్లాలను ఎలా ఎదుర్కోవాలి, ఒత్తిడిని అధిగమించి మానసిక ప్రశాంతత ఎలా పొందాలి మొదలైన విషయాలు తెలుస్తాయంటున్నారు. ఈ క్రమంలో తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మరి, అవేంటో తెలుసుకుందామా...

ముందుగా తెలుసుకోవాలి...

కుటుంబపరంగా, సమాజపరంగా వివిధ ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం సహజం.  వాటివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ, ఈ రోజుల్లో చాలామంది వాటి అసలు అర్థం తెలుసుకోకుండా ఎవరికి నచ్చినట్టు వారు మార్చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు  గుడ్డిగా పాటించేస్తూ అసలు విషయాన్ని గాలికి వదిలేస్తున్నారు. కాబట్టి, ముందుగా మీరు పిల్లలకు ఏ విషయాలు నేర్పించాలనుకుంటున్నారో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత పిల్లలకు నేర్పించడం వల్ల ఆచారాలు ఆయా ఆచారాలు, సంప్రదాయాల వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోగలుగుతారు. తద్వారా వారికి క్రమేపీ ఆధ్యాత్మికత దిశగా ఆసక్తి కలుగుతుంది.

కథలు చెప్పాలి...

వివిధ మత గ్రంథాలు, పురాణాలు మొదలైన వాటిలో ఉండే వివిధ అంశాల గురించి పిల్లలకు చిన్న చిన్న కథల రూపంలో చెప్పడం వల్ల వారిలో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. అలాగే జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలను ఎలా ఎదుర్కోవాలి? ఇతరులతో ఎలా ప్రవర్తించాలి? వంటి ఎన్నో జీవన పాఠాలను చిన్న చిన్న ఉదాహరణల రూపంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది.

చేసి చూపించాలి...

అసలు విషయాలు శోధించాలే కానీ ప్రతి మతంలోనూ ఎన్నో మంచి విషయాలు దాగి ఉంటాయి. చాలామంది వీటి గురించి నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు కూడా. మానవ సేవే మాధవ సేవ, అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు.. మొదలైనవన్నీ అందులో భాగమే. అయితే పాటించాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం చాలామంది వెనకడుగు వేస్తుంటారు. పిల్లల విషయంలో మీరూ ఈ తప్పులు చేయద్దంటున్నారు నిపుణులు. మంచి అలవాట్లను మీరు పాటిస్తూ, వారినీ పాటించేలా చేయాలంటున్నారు. అప్పుడే ఆధ్యాత్మికతకు అసలైన అర్థం ఉంటుందంటున్నారు.

ధ్యానం..

ఏ మతంలోనైనా ధ్యానానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. అయితే ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ధ్యానం చేస్తుంటారు. ఎలా చేసినా అంతిమంగా కలిగే ప్రయోజనాలు మాత్రం దాదాపు ఒకేవిధంగా ఉంటాయి. కాబట్టి మీ పిల్లలు క్రమం తప్పకుండా ధ్యానం చేసేలా ప్రోత్సహించండి. దీనిద్వారా వారికి ఆధ్యాత్మిక భావన కలగడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఫలితంగా చదువులోనూ రాణించగలుగుతారు.

పిల్లలకు చదువుకునే వయసులోనే ఆధ్యాత్మికత చింతనను కూడా అలవరిస్తే వారు మంచి విజయాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆధ్యాత్మికతను అలవాటు చేసే క్రమంలో వారి చదువుకు భంగం కలగకుండా జాగ్రత్త పడాలి. ఎక్కువ సమయం పట్టే కార్యక్రమాలను సాధ్యమైనంత వరకు సెలవు రోజుల్లోనే సాధన చేయడం మంచిది. తద్వారా వారి చదువుకి ఎలాంటి ఆటంకం కలగదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని