చంటి బిడ్డ కడుపు నిండా పాలు తాగాలంటే..!

శిశువులకు తల్లి పాలే ఆహారం.. వాటిని కడుపు నిండా తాగినప్పుడే వారి ఆకలి తీరుతుంది. అయితే కొంతమంది తల్లుల్లో పాల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, పలు కారణాల రీత్యా పిల్లలు స్తన్యాన్ని అందుకోలేకపోవడం.. వల్ల చిన్నారులు బొజ్జ నిండా చనుబాలు తాగలేకపోతుంటారు. దీనివల్ల వారికి సంపూర్ణ పోషకాలు అందక దీర్ఘకాలిక అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

Updated : 05 Aug 2021 13:30 IST

శిశువులకు తల్లి పాలే ఆహారం.. వాటిని కడుపు నిండా తాగినప్పుడే వారి ఆకలి తీరుతుంది. అయితే కొంతమంది తల్లుల్లో పాల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, పలు కారణాల రీత్యా పిల్లలు స్తన్యాన్ని అందుకోలేకపోవడం.. వల్ల చిన్నారులు బొజ్జ నిండా చనుబాలు తాగలేకపోతుంటారు. దీనివల్ల వారికి సంపూర్ణ పోషకాలు అందక దీర్ఘకాలిక అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే చంటిబిడ్డలు పాలు తాగకపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకొని.. వాటిని సరిదిద్దుకోవడం తల్లుల బాధ్యతే అంటున్నారు. ఈ క్రమంలో బాలింతలు కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.

ఆకలిని పసిగట్టడమెలా?!

పసి పిల్లలు తమకు ఆకలేస్తోందని, కడుపు నిండిందని చెప్పలేరు. అందుకే రోజుకు 8-12 సార్లు నిర్ణీత వ్యవధుల్లో తల్లులు పిల్లలకు పాలివ్వాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఇక సాధారణంగా ఒకసారి బేబీ కడుపు నిండా పాలు తాగడానికి సుమారు 20 నిమిషాల సమయం పడుతుందట! అయితే చిన్నారి కడుపు నిండా పాలు తాగుతోందా? లేదా? అన్న విషయం తెలుసుకోవడానికి ఓ సులభమైన పద్ధతుందంటున్నారు నిపుణులు. అదేంటంటే..!

సాధారణంగా కడుపు నిండా పాలు తాగే చిన్నారులు రోజులో కనీసం 6-8 సార్లు మూత్రవిసర్జన, మూడుసార్లు మల విసర్జన చేస్తారట! ఇలా చేస్తున్నట్లయితే వాళ్లు కడుపు నిండా పాలు తాగుతున్నట్లే లెక్క అని అంటున్నారు నిపుణులు.. అలాగే వాళ్లకు వేళకు ఆకలవుతున్నట్లుగా తల్లులు భావించి నిర్ణీత వేళల్లో పిల్లలకు పాలివ్వాలని సూచిస్తున్నారు.

మసాజ్‌ మంచిదే!

తల్లి స్తన్యం నుంచి వచ్చే పాలు సరిపోక, నోటికి అందక.. నిపుల్‌ నోట్లో పెట్టినప్పుడు ఊరికే చప్పరిస్తుంటారు కొందరు పిల్లలు. దాంతో వాళ్లు పాలు తాగుతున్నారనుకుంటాం.. కానీ అలా ఎంత సేపు చేసినా వారి కడుపు నిండదు. అందుకే చనుబాలిస్తున్నప్పుడు రొమ్మును వెనక నుంచి కాస్త ఒత్తడం వల్ల పాలు చిన్నారి నోటికి అందడంతో పాటు రొమ్ముల్లో పాల ఉత్పత్తి సైతం పెరుగుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్రసవం అయిన తొలి రోజుల్లో తల్లుల్లో పాలు పడడానికి ఈ ప్రక్రియ మరింతగా తోడ్పడుతుంది. అంతేకాదు.. ఇలా స్తన్యాన్ని ప్రెస్‌ చేయడం, రొమ్ముల్ని మర్దన చేయడం వల్ల కూడా పాల ఉత్పత్తి సుమారు 48 శాతం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా పాల గ్రంథుల్లో నిండిన పాలను చిన్నారి ఎప్పటికప్పుడు తాగడం వల్ల పాల ఉత్పత్తి క్రమంగా పెరుగుతుంది.. వయసుతో పాటే పెరిగే వారి ఆకలీ తీరుతుంది.

రెండు వైపులా ఇస్తున్నారా?

తల్లి పాలు ఎక్కువగా ఉత్పత్తి కావాలన్నా, పిల్లల బొజ్జ నిండాలన్నా వాళ్లు రెండు స్తన్యాల్లో ఉత్పత్తయ్యే పాలు సమానంగా తాగాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. ఓ 20 నిమిషాల పాటు ఫీడింగ్‌ ఇస్తున్నట్లయితే.. పది నిమిషాలు కుడి రొమ్ము పాలు తాగేలా, మరో పది నిమిషాలు ఎడమ రొమ్ము పాలు తాగేలా చూడాలి. లేదంటే తలా ఓ ఐదు నిమిషాల చొప్పున రెండుసార్లు బేబీ పొజిషన్‌ మార్చి పాలిచ్చినా సరిపోతుంది. ఎందుకంటే ఇలా రెండువైపులా సమానంగా పాలిస్తే పాల గడ్డలు ఏర్పడకుండా ఉండడంతో పాటు ఎక్కువ మొత్తంలో పాలు ఉత్పత్తవుతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా చిన్నారులు కడుపు నిండా పాలు తాగి వయసు ప్రకారం బరువు పెరిగే అవకాశాలూ ఎక్కువే!

‘కంగారూ కేర్‌’తో ఫలితం!

తల్లీబిడ్డలిద్దరి ఒంటి స్పర్శ ఒకరికొకరు తాకినప్పుడు ఇద్దరూ ఏదో తెలియని మధురానుభూతికి లోనవుతారంటారు. అయితే చనుబాల ఉత్పత్తి పెంచడంలోనూ ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ‘కంగారూ కేర్‌’ పద్ధతికి ఆదరణ పెరుగుతోందని చెప్పాలి.

ఇందులో భాగంగా తల్లి దుస్తులేవీ లేకుండా తన చిన్నారిని ఎదపై పడుకోబెట్టుకోవడం వల్ల చిన్నారికి ఆమె స్పర్శ తెలిసిపోతుంది. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల బుజ్జాయి తమ తల్లి వాసనను పసిగట్టి.. చనుమొనల్ని వెతికి వాటిని అందుకుంటారని, తద్వారా వారికి పాలు తాగడం అలవాటవుతుందని, ఫలితంగా తల్లిలోనూ పాల ఉత్పత్తి క్రమంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఫీడింగ్‌ పొజిషన్స్‌ చెక్‌ చేసుకున్నారా?

పాపాయి యాక్టివ్‌గా పాలు తాగాలన్నా, తద్వారా తల్లి స్తనాల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి కావాలన్నా పాలిచ్చే పొజిషన్స్‌ కూడా కీలకమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పిల్లలు పాలు తాగే భంగిమ వారికి సౌకర్యవంతంగా లేకపోతే కూడా వారు పాలు తాగడానికి ఆసక్తి చూపించరట! అందుకే ఇటు మీకు, అటు పాపాయికి కంఫర్టబుల్‌గా ఉండే భంగిమలో కూర్చోవడం లేదంటే పడుకోవడం, ఈ క్రమంలో ఫీడింగ్‌ పిల్లో/సాధారణ దిండు వంటివి ఉపయోగించడం.. చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

బాటిల్‌ ఫీడ్‌ ఇవ్వాలనుకుంటే..!

సాధారణంగా ఆరు నెలల దాకా పిల్లలు పూర్తిగా తల్లి పాల పైనే ఆధారపడతారు. అయితే ఆ తర్వాత తల్లిపాలతో పాటు ఘనాహారం కూడా అలవాటు చేస్తారు. ఇక ప్రసవానంతర సెలవు ముగించుకొని తిరిగి ఉద్యోగాలకు వెళ్లే తల్లులూ చాలామందే! ఇలాంటప్పుడు చనుబాలే అయినా బాటిల్‌ రూపంలో అందించాలనుకుంటారు అమ్మలు . ఈ క్రమంలో బ్రెస్ట్‌ పంప్‌ సహాయంతో పాలు తీయడం, వాటిని భద్రపరచడం.. వంటివి చేస్తారు. ఇలా చేసినప్పటికీ డ్యూటీకి వెళ్లే ముందు, తిరిగి వచ్చాక.. వీలైనప్పుడల్లా తల్లి నేరుగా చిన్నారికి పాలివ్వడం మాత్రం మానద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే పంప్‌ సహాయంతో పాలు తీయడం కంటే.. చిన్నారి నేరుగా తాగినప్పుడే పాల ఉత్పత్తి తగ్గకుండా ఉంటుందని చెబుతున్నారు. ఇక తల్లి అందుబాటులో లేనప్పుడు, ఆ తీసిన పాలను బాటిల్‌ ద్వారా పట్టడం కాకుండా.. స్పూన్‌, చిన్న కప్పు సహాయంతో వారికి తాగించడం అలవాటు చేయాలంటున్నారు. ఎందుకంటే బాటిల్‌ నిపుల్‌ ద్వారా పాలు పీల్చేటప్పుడు గాలి కూడా వారి కడుపులోకి చేరి గ్యాస్ట్రిక్‌ సమస్యలకు దారితీయచ్చు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త వహించాలి.

ఇక వీటితో పాటు తల్లి రొమ్ముల్లో ఎక్కువ పాలు ఉత్పత్తవడానికి నిపుణుల సలహా మేరకు చక్కటి పోషకాహారం, సప్లిమెంట్స్‌ కూడా వాడచ్చు. మరి, మీ చిన్నారులు బొజ్జ నిండా పాలు తాగడానికి మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? చనుబాల ఉత్పత్తిని పెంచుకోవడానికి ఎలాంటి పోషకాహారం తీసుకుంటున్నారు? మాతో పంచుకోండి. మీరిచ్చే సలహాలు, చిట్కాలు.. ఎంతోమంది తల్లులకు మార్గనిర్దేశనం చేయచ్చు..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్