Noise Dieting: సౌండెక్కువైతే.. అసలుకే మోసం..!

అధిక బరువు సమస్యను వ్యాయామాలు, డైటింగ్‌లతో ఎలాగైతే పరిష్కరిస్తామో.. శబ్ద తీవ్రత సమస్యను కూడా 'నాయిస్ డైటింగ్'తో నియంత్రించవచ్చు. అది ఎలాగో చూద్దాం..!

Published : 29 Jul 2023 19:30 IST

ఉదయాన్నే నిద్ర లేపే అలారం దగ్గర నుంచి.. పడుకునే ముందు చూసే టీవీ వరకు రోజూ రకరకాల తీవ్రతలు గల శబ్దాలు వింటుంటాం. అయితే మన చెవిలో చాలా సున్నితమైన కణాలుంటాయి. ఇవి శబ్ద తీవ్రతను కొంతవరకు మాత్రమే తట్టుకోగలవు. కానీ.. మనం వినే మితిమీరిన శబ్దాలు ఈ కణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఈక్రమంలో మనం పూర్తిగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పైగా ఇలా కోల్పోయిన వినికిడి శక్తిని తిరిగి పొందగలిగే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో అధిక బరువు సమస్యను వ్యాయామాలు, డైటింగ్‌లతో ఎలాగైతే పరిష్కరిస్తామో.. శబ్ద తీవ్రత సమస్యను కూడా 'నాయిస్ డైటింగ్'తో నియంత్రించవచ్చు. అది ఎలాగో చూద్దాం..!

సాధ్యమైనంత వరకు చెవులకు ప్రమాదం కలిగించే శబ్దాల నుంచి దూరంగా ఉండడం మంచిది. శబ్ద తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే మన చెవులకు అవి అంత ప్రమాదకరమని గుర్తుపెట్టుకోండి.

ఇవి పాటించండి..!

శబ్ద కాలుష్యం గురించి విశ్లేషించేటప్పుడు మనం రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. మొదటిది.. మనం వినే శబ్దం ఎంత తీవ్రత కలిగుంది? రెండోది.. ఆ శబ్దాన్ని మనం ఎంతసేపు వింటున్నాం..! 80-85 డెసిబెల్స్ తీవ్రతతో ఉన్న శబ్దాన్ని 15-30 నిమిషాల పాటు వింటే మన వినికిడి శక్తి దాదాపు పాడవుతుందని నిపుణుల అంచనా. ఈ క్రమంలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేంటో చూద్దాం..!

ఇయర్ ప్లగ్స్ వాడండి..

అధిక తీవ్రత గల శబ్దాల నుంచి చెవులను రక్షించేందుకు ఇయర్ ప్లగ్స్‌ను వాడండి. ఒకవేళ అధిక శబ్దం వెలువడే చోట మీరు కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటే ఇయర్ ప్లగ్స్ వాడడం వల్ల చెవులకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. అలాగే ప్రైవేట్ పార్టీలు, కన్సర్ట్స్‌కి వెళ్లినప్పుడు స్పీకర్స్‌లో మ్యూజిక్ వినాల్సి వచ్చినప్పుడు ఇయర్ ప్లగ్స్ వాడండి. అవి దాదాపు 15 నుంచి 35 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని మన చెవుల్లోకి వెళ్లకుండా నియంత్రిస్తాయి.

అంత సౌండ్ వద్దు..!

వివిధ రకాల గ్యాడ్జెట్లలో మ్యూజిక్ వినేటప్పుడు తక్కువ సౌండ్‌తో వినడం అలవాటు చేసుకోండి. వాటివల్ల మనం అధిక శబ్దాల నుంచి మన చెవులను రక్షించిన వాళ్లమవుతాం. అలాగే ఫోన్‌లో సంభాషించేటప్పుడు ఫోన్ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడండి.

కారులో జాగ్రత్త..!

సాధారణంగా కారులో ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటుంటారు. కానీ అది ప్రమాదకరం. తక్కువ సౌండ్‌తో మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి.

పై జాగ్రత్తలు పాటించడం వల్ల శబ్ద కాలుష్యం నుంచి మన వినికిడి శక్తిని రక్షించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని