Published : 24/06/2022 20:19 IST

డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!

కొందరమ్మాయిలకు ముఖం అంతా బాగానే ఉంటుంది.. కానీ గడ్డం దగ్గరకు వచ్చేసరికి మాత్రం చిన్న సమస్య వస్తుంది. అదే- డబుల్ చిన్. దీంతో వాళ్లు అసౌకర్యానికి గురవుతుంటారు. మరి, ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలి? రండి.. తెలుసుకుందాం..!

డబుల్ చిన్ సమస్య నుంచి బయటపడటానికి ఉపకరించే చిట్కాలు తెలుసుకునే ముందు అసలు అది రావడానికి గల కారణాలేంటో చూద్దాం..! ఈ సమస్య తలెత్తడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు.

అధిక బరువు - ఒకేసారి బరువు పెరగడం లేదా తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. బరువు పెరిగినప్పుడు గడ్డం దగ్గర కొవ్వులు పేరుకుపోవడం, తగ్గినప్పుడు అక్కడి చర్మం వదులుగా మారడమే ఇందుకు కారణం.

వంశపారంపర్యంగా - డబుల్‌చిన్‌కు జన్యుపరమైన కారణాలుంటే మెదడుకు సంబంధించిన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు నిపుణులు.

వయసు పైబడడం - వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు దృఢత్వాన్ని కోల్పోవడం, కొవ్వు పేరుకుపోవడం.. వంటివి ఈ సమస్యకు కారణమవుతాయట! కాబట్టి కండరాల దృఢత్వానికి, కొవ్వు కరగడానికి పలు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.

ఇలా తగ్గించుకోవచ్చు!

బాగా నమలండి..!

డబుల్‌చిన్ సమస్యతో బాధపడేవారు ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల ముఖ కండరాలకు వ్యాయామం అంది పటిష్టంగా తయారవుతాయి. దీని వల్ల అదనపు కొవ్వులు పేరుకుపోకుండా ముఖాకృతి చక్కగా ఉంటుంది. అలాగే మార్కెట్లో లభించే షుగర్‌ఫ్రీ చూయింగ్ గమ్స్ నమలడం కూడా మంచిదే. తద్వారా దవడల దగ్గర పేరుకున్న కొవ్వు సులభంగా కరుగుతుంది.

తెల్లసొనతో..

రెండు గుడ్లలోని తెల్లసొన, ఒక టేబుల్‌స్పూన్ పాలు, కాస్తంత తేనె, నిమ్మరసం.. ఇవన్నీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ చుట్టూ, డబుల్ చిన్ ఉన్న చోట ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. అలా 30 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. తెల్లసొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఫలితంగా డబుల్‌చిన్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గుడ్డు వాసన నచ్చని వారు ఈ మిశ్రమంలో కొన్ని చుక్కల ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తుంది. చెడు కొవ్వును కరిగిస్తుంది. కాబట్టి కాఫీ, టీలకు బదులుగా గ్రీన్‌ టీని డైట్‌లో చేర్చుకోవాలి.

విటమిన్ ‘ఇ’

మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ ‘ఇ’ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బ్రౌన్ రైస్, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, స్వీట్ కార్న్, యాపిల్, సోయా బీన్స్, పప్పు దినుసులు.. ఇలాంటి వాటిల్లో విటమిన్ ‘ఇ’ ఎక్కువగా లభిస్తుంది.. కాబట్టి వీటిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి.

నీళ్లు ఎక్కువగా..

రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే కొవ్వుతో పాటు దవడ, గడ్డం కింద పేరుకున్న అనవసర కొవ్వు కూడా కరిగిపోతుంది. అలాగే నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను కూడా తినాలి.

ఇవి కూడా..

ఎక్కువగా నవ్వడం, మాట్లాడటం వల్ల కూడా ముఖ కండరాలకు చక్కని వ్యాయామం అందుతుంది. తద్వారా డబుల్‌చిన్ సమస్యను తగ్గించుకోవచ్చు.

మెడ గుండ్రంగా, మెల్లగా కొద్ది సమయంపాటు తిప్పడం, పైకి కిందకు కదిలించడం.. మొదలైన చిన్న చిన్న వ్యాయామాల ద్వారా కూడా ఫలితం ఉంటుంది.

బరువు పెరగకుండా చేసే వ్యాయామాలతో పాటు గుండె సంబంధిత వ్యాయామాలు చేస్తే మరీ మంచిది.

అలాగే తీసుకునే ఆహార పదార్థాల్లో కాల్యరీలు, కొవ్వులు లేనివి ఎంచుకోవాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని