Published : 15/03/2023 21:13 IST

ముక్కుపై కళ్లద్దాల మచ్చలు మాయమిలా..!

సైట్‌ ఉందనో లేదంటే ఫ్యాషన్‌ కోసమో.. ఇలా కళ్లజోడు ధరించే చాలామందిలో ముక్కుపై కళ్లద్దాల మచ్చలు పడడం సహజం. అయితే కళ్లజోడు ధరిస్తే పర్లేదు కానీ.. కళ్లద్దాలు పెట్టుకోకపోతే ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. పైగా ఇవి అందాన్నీ దెబ్బతీస్తాయి. మరి, వీటిని నివారించుకునే మార్గాలేంటో తెలుసుకుందాం రండి..

ఎంపిక ఇలా!

కళ్లద్దాలు ఎంపిక చేసుకునేటప్పుడు లెన్స్ తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి.

అలాగే ఫ్రేము ఎంచుకునేటప్పుడు కూడా తేలికైనది తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల కళ్లజోడు తక్కువ బరువు ఉండి ముక్కుపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడచ్చు.

లెన్స్, ఫ్రేము తయారు చేసిన మెటీరియల్స్ చర్మానికి హాని కలిగించకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మెటల్ పడకపోవచ్చు. అలాంటివి పెట్టుకుంటే వెంటనే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి ఫ్రేమ్‌ మెటీరియల్‌ను ఎంచుకోవడం ముఖ్యం.

అలాగే కళ్లజోడు కొనుగోలు చేసే ముందే అది మీకు సరిగ్గా సరిపోయిందా? లేదా? అన్నది సరిచూసుకోవాలి. అది మరీ వదులుగా, బిగుతుగా లేకుండా చూసుకోవాలి.

మచ్చలు తగ్గాలంటే..!

ఒకవేళ కళ్లజోడు కారణంగా మచ్చలు పడ్డా కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.

నిమ్మరసం, రోజ్‌వాటర్‌తో..

కళ్లజోడు కారణంగా మచ్చలు పడిన చోట నిమ్మరసాన్ని అప్లై చేయడం వల్ల ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. కొద్దిగా నిమ్మరసం తీసుకుని, అందులో కాస్త రోజ్‌వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాయాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గుతాయి.

రోజ్‌వాటర్‌, వెనిగర్‌

అలాగే కొన్ని రోజ్‌వాటర్ తీసుకొని దానికి కొద్దిగా వెనిగర్ కలిపి ఈ మిశ్రమంతో మచ్చలు ఉన్న చోట రోజూ మర్దన చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే మచ్చలు మాయమైపోతాయి.

బాదం నూనె

బాదంనూనెలో ఉండే విటమిన్ ‘ఇ’ ముక్కు మీద మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుంది. ఈ క్రమంలో రోజూ బాదంనూనెతో మచ్చలు ఉన్నచోట మర్దన చేసుకుంటే చక్కని ఫలితం ఉంటుంది.

పాలు, తేనె, ఓట్స్‌..

ఒక గిన్నెలో పాలు, తేనె, ఓట్స్ తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంతో మచ్చలు ఉన్నచోట రోజూ మృదువుగా మర్దన చేయాలి. ఫలితంగా మచ్చలు తగ్గుముఖం పట్టడమే కాకుండా చర్మం తాజాగా మారి మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని