పిల్లలు మళ్లీ స్కూలుకెళ్తున్నారా?

వేసవి సెలవులు ముగిసి మళ్లీ స్కూళ్లు మొదలవుతున్నాయంటే చాలు.. అప్పటిదాకా హాయిగా ఆడుకున్న పిల్లలంతా ఒక్కసారిగా దిగాలుగా మారిపోతారు. అందుకు కారణం.. అప్పటిదాకా పుస్తకాలకు దూరంగా, తమకు నచ్చిన విధంగా....

Published : 13 Jun 2023 12:38 IST

వేసవి సెలవులు ముగిసి మళ్లీ స్కూళ్లు మొదలవుతున్నాయంటే చాలు.. అప్పటిదాకా హాయిగా ఆడుకున్న పిల్లలంతా ఒక్కసారిగా దిగాలుగా మారిపోతారు. అందుకు కారణం.. అప్పటిదాకా పుస్తకాలకు దూరంగా, తమకు నచ్చిన విధంగా హాయిగా ఆట-పాటలతో గడపడం, ఇష్టమొచ్చిన టైమ్‌కి నిద్రలేవడం, బంధువుల ఇళ్లల్లో మూటగట్టుకున్న సరదాలే! అయితే ఇలాంటి వాతావరణంలో నుంచి సడెన్‌గా పని వాతావరణంలోకి అడుగుపెట్టాలంటే మనకే కాస్త సమయం పడుతుంది. ఇక స్కూలుకెళ్లే పిల్లల సంగతైతే చెప్పనక్కర్లేదు. అలాగని వేసవి సెలవులు ముగిశాక తిరిగి చిన్నారుల్ని బడికి పంపేటప్పుడు రోజూ ఇలా అయిష్టంగానే పంపాలా? వారే ఇష్టపూర్వకంగా స్కూలుకు వెళ్లేలా చేయలేమా? అంటే కచ్చితంగా చేయగలమని అంటున్నారు నిపుణులు. అయితే ఇందుకు తల్లిదండ్రులు ముందు నుంచే పిల్లల చేత కొన్ని నియమాలు పాటించేలా చేయాలని వారంటున్నారు.

నిద్ర-ఆహారానికి ఈ రొటీన్..

వేసవి సెలవుల్లో పిల్లలు ఇష్టమొచ్చిన సమయానికి పడుకొని, ఉదయం కాస్త ఆలస్యంగా నిద్ర లేవడానికి అలవాటు పడడం సహజమే. స్కూల్ తెరిచిన తర్వాత కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తే స్కూలుకు ఆలస్యమవడంతో పాటు స్కూల్లో బద్ధకించే అవకాశమూ లేకపోలేదు. అంతేకాదు.. స్కూలంటే ఇష్టమున్న పిల్లలు కూడా.. 'అప్పుడే స్కూల్ స్టార్టయిందా.. ఇంకొన్ని రోజులు సెలవులుంటే బాగుండేది..' అనుకుంటుంటారు. ఇలాంటి ఆలోచనలు మనసులోకి రాకూడదంటే వారిని ముందు నుంచే స్కూలుకి సన్నద్ధం చేయాలి. అందుకోసం స్కూల్స్ ప్రారంభం కావడానికి రెండుమూడు రోజుల ముందు నుంచే పిల్లలచే పక్కా ప్రణాళిక పాటించేలా చేయాలి. ఈ క్రమంలో రాత్రుళ్లు టీవీలు, మొబైల్స్ అన్నీ కట్టిపెట్టి వారు త్వరగా నిద్రకు ఉపక్రమించేలా చేయడం, ఉదయాన్నే త్వరగా నిద్రలేపడం.. వంటివి చేయాలి. అలాగే సెలవుల్లో వారు కాలంతో పని లేకుండా ఇష్టమొచ్చిన సమయానికి, వారికి నచ్చిన ఆహారం తినడానికి అలవాటు పడి ఉంటారు. అందుకని స్కూలు సమయాలకు తగినట్లుగా పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్.. వంటివి అలవాటు చేయాలి. తద్వారా రాత్రుళ్లు డిన్నర్ కూడా సరైన సమయానికి చేసే అవకాశముంటుంది. ఇలా చేయడం వల్ల నిద్ర-ఆహారం.. బ్యాలన్స్‌డ్‌గా ఉండి స్కూల్‌కెళ్లినా వారిని నిరుత్సాహం ఆవహించకుండా ఉంటుంది.

కొత్త కొత్తగా ఉన్నది!

వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ పునఃప్రారంభం అవుతాయంటే స్కూలుకెళ్లే చిన్నారుల్లో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. కారణం.. పై క్లాసులకు వెళ్తున్నప్పుడు స్కూల్ యూనిఫాం దగ్గర్నుంచి పుస్తకాల దాకా అన్నీ కొత్త వస్తువులు కొనిస్తారనే ఆనందమే వారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్సులు, పుస్తకాలు, నోట్‌బుక్స్.. వంటివి కొనిచ్చేటప్పుడు మీరొక్కరే వెళ్లి కొనడం కాకుండా వారిని మీ వెంటే తీసుకెళ్లి వారికి నచ్చినవి కొనివ్వడం మంచిది. తద్వారా వారిలో కొత్త ఉత్సాహం కలగడంతో పాటు ఏ వస్తువు ఎలా కొనాలన్న విషయమూ చిన్నతనం నుంచే అలవడుతుంది. ఇలా తమకు నచ్చిన వస్తువులతో ఇష్టపూర్వకంగా స్కూలుకెళ్లడం, వాటిని తమ తోటి స్నేహితులకు చూపిస్తూ ఆనందపడడం, ఆ తర్వాత ఇంటికొచ్చి ఆ ఆనందాన్ని, ఫ్రెండ్స్ రియాక్షన్‌ని మరెంతో సంతోషంగా మీతో పంచుకోవడం.. ఇలా వారి సంతోషం చూసి మీకూ సంతృప్తి కలుగుతుంది.

రూమ్‌ని అందంగా సర్దేయండి!

స్కూల్ ప్రారంభమవుతుందంటే కేవలం వారికి సంబంధించిన యూనిఫాం, పుస్తకాల పైనే కాదు.. వారి గదిపై కూడా ఓ లుక్కేయాలి. అప్పటిదాకా సెలవులంటూ చిందరవందరగా పడేసిన వస్తువులు, బట్టలతో వారి గదంతా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి పిల్లల గదిని నీట్‌గా సర్దుతూ, ఆ పనిలో వారినీ భాగం చేయడం మంచిది. ఈ క్రమంలో పాత పుస్తకాలు తీసేసి, వాటి స్థానంలో కొత్త పుస్తకాలను సర్దడం, స్కూల్ బ్యాగు, వాటర్ బాటిల్.. వంటి వస్తువులన్నీ పిల్లలు ఎక్కడెక్కడ పెట్టుకోవాలో నిర్దేశించి, రోజూ అక్కడే పెట్టుకోమని చెప్పడం, వారికి కొనిచ్చిన కొత్త బట్టల్ని అల్మరాల్లో నీట్‌గా సర్దడం, డ్రస్సులు, ఇంట్లో వేసుకొనే బట్టలు.. వంటి వాటన్నింటికీ ఒక చోటు నిర్దేశించి, వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చడం.. వంటివన్నీ వారికి నేర్పించాలి. ఇలా చేయడం వల్ల వారి గదిని ఎలా నీట్‌గా పెట్టుకోవాలి, ఎలా సర్దుకోవాలి.. వంటి విషయాలన్నీ వారికి అవగతమవుతాయి.

వీటినీ మరవద్దు!

3-4 తరగతుల నుంచి పిల్లలు ప్రతిరోజూ స్థిరంగా కూర్చొని తమంతట తాముగా పాఠ్యాంశాలను కనీసం ఒక గంట పాటు చదువుకునేలా అలవాటు చేయాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లలకు అవసరమైన సలహాలు, సూచనలు, అర్థం కాని విషయాలు.. వంటివి చెప్పాలి. అంతేకానీ.. వారి హోంవర్క్ మీరే చేయడం మంచిది కాదు. ఇలా రోజూ ఓ గంట పాటు పాఠ్యాంశాల్ని అర్థం చేసుకుంటూ చదివితే అది వారికి ముందుముందు ఎంతో ఉపయోగపడుతుంది.

ఎదిగే పిల్లలకు లంచ్ బాక్సుల్లో చక్కటి పోషకాహారాన్ని, వాళ్లు ఇష్టంగా తినేలా రుచికరంగా అందివ్వడం మంచిది. ఈ క్రమంలో పప్పు-క్యారట్లు, బఠాణీలు, బీన్స్.. వంటి వాటితో చేసిన కిచిడీ, పండ్లు.. వంటివి అలవాటు చేస్తే వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇందుకోసం న్యూట్రిషనిస్ట్‌ని సంప్రదించడం లేదంటే అంతర్జాలాన్ని ఆశ్రయించడం మంచిది.

స్కూలుకెళ్లడానికి ముందు రోజు రాత్రే పిల్లలు తమ బ్యాగ్ సర్దుకుని, రేపు వేసుకునే బట్టలు రడీగా పెట్టుకొని ఉండేలా వారితో రోజూ అలవాటు చేయించాలి.

కొందరు పిల్లలు ఎన్ని చేసినా బడికెళ్లడానికి కడుపునొప్పి, తలనొప్పి అంటూ సాకులు చెబుతుంటారు. అన్ని సమయాల్లోనూ వాళ్లు చెప్పేది కరక్ట్ కాకపోవచ్చు. పిల్లలు ఇలా చెబుతున్నారంటే అందుకు.. వారు బడిలో ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్నారని గుర్తించాలి. అదేంటో వారినే నెమ్మదిగా అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. అంతేకాదు.. అది నిజంగా సమస్యే అయితే దాన్ని స్కూల్ టీచర్ల సహాయంతో అధిగమించేందుకు ప్రయత్నిస్తే స్కూల్లో పిల్లల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా చిన్నారులు ఇష్టపూర్వకంగా స్కూలుకెళ్లగలుగుతారు.

ఇక స్కూల్ నుంచి ఇంటికి తిరిగి రాగానే పిల్లలు చేయాల్సిన పనులు, హోంవర్క్, పాఠ్యాంశాలు చదువుకోవడం, ఇతర వ్యాపకాలు నేర్చుకోవడం.. వంటి అంశాలన్నింటికీ సంబంధించిన టైమ్‌టేబుల్‌ని ముందుగానే వేసి వారితో అలవాటు చేయించాలి.

అలాగే బడికెళ్లే సమయంలో, పాఠాలు నేర్చుకునే సమయంలో పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారన్న అనే అనుమానం మీకు వచ్చినట్లయితే.. ఒకట్రెండు వారాల్లోపే ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ఈ క్రమంలో స్కూలుకెళ్లి పిల్లలకున్న అనుమానాలు, ఆందోళనల గురించి మాట్లాడితే మంచిది. దీనివల్ల టీచర్ల నుంచి భరోసా అందుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని