Published : 17/11/2022 21:50 IST

మడమలు పగిలితే..

చలికాలంలో మడమలు పగలడం సహజం. అయితే దీనివల్ల కొన్ని రకాల డ్రస్సులు వేసుకోవాలన్నా, వాటితో నలుగురి మధ్యలోకి వెళ్లాలన్నా ఎవరికైనా ఇబ్బందే.. కానీ ఈ సమస్యను ఇంట్లో లభించే పదార్ధాలతోనే సులభంగా పరిష్కరించుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి..

చర్మంలోని తేమ స్థాయిలో తేడా వచ్చినప్పుడు ఆ మార్పు స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఒకవేళ తేమ స్థాయి పెరిగితే చర్మం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. అలాకాకుండా తేమ స్థాయి తగ్గితే చర్మం పొడిబారినట్లు తయారవుతుంది. మడమల పగుళ్లు కూడా చర్మంలోని తేమ స్థాయి తగ్గడం వల్లే వస్తాయి. ఇది కేవలం చర్మం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా సంబంధించిన సమస్య. ఏ సమస్యనైనా ప్రారంభంలోనే గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటే తప్పకుండా తగ్గుముఖం పడుతుంది. లేదంటే అవి మరింత పెద్ద సమస్యలుగా మారతాయి.

తగ్గిన తేమ అందించాలి..

పగుళ్లు అనే సమస్య తలెత్తడానికి ముఖ్య కారణం- చర్మంలోని తేమ స్థాయి తగ్గడమే. అందుకే ముందు తగ్గిన తేమని తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. అందుకోసం పాదాలకు మాయిశ్చరైజర్ తరచూ రాసుకుంటూ ఉండాలి. అయితే పగటి పూట మాయిశ్చరైజర్ రాసినా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాం కాబట్టి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాబట్టి రాత్రి నిద్రించే సమయంలో రోజూ క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ రాసుకోవడం మంచిది. అప్పుడే అది పగుళ్ల ద్వారా చర్మంలోకి ఇంకి సమస్య తగ్గుముఖం పడుతుంది.

పెట్రోలియం జెల్లీతోనూ..

పాదాలు తేమని కోల్పోకుండా చేయడటానికి కేవలం మాయిశ్చరైజర్ ఒక్కటే కాదు.. పెట్రోలియం జెల్లీ కూడా తోడ్పడుతుంది. అయితే ఇది రాసుకున్న కాసేపటికి చర్మంలోకి ఇంకుతుంది. అప్పటి వరకు అటూ ఇటూ తిరగకుండా కాస్త ఓపిగ్గా, జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే దాని ద్వారా తేమ చర్మానికి అందుతుంది. రాత్రి సమయంలో నిద్రపోవడానికి ముందు పెట్రోలియం జెల్లీని పాదాలకు రాసుకుని సాక్సులు వేసుకుని పడుకోవాలి. ఇలా కొన్ని రోజులు క్రమంగా చేయడం వల్ల పగుళ్లు తగ్గుతాయి.

శుభ్రంగా.. పొడిగా..

పగుళ్లు రాకుండా ఉండాలన్నా, ఉన్న పగుళ్లు పెరగకుండా ఉండాలన్నా పాదాలను ఎల్లప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. అలాగే ఎక్కువ గాఢత, రసాయనాలు ఉన్న లిక్విడ్స్, సోప్స్‌ను దూరంగా ఉంచడం మేలు. లేదంటే అవి పాదాల్లో ఉన్న కాస్త తేమనూ పోగొట్టి మరింత పొడిబారేలా చేస్తాయి. ఫలితంగా సమస్య మరింత జటిలమవుతుంది.

ఇలా కూడా..

⚜ ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ పాదాలకు తరచుగా కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో మర్దన చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం వల్ల చర్మానికి అవసరమయ్యే తేమ అందుతుంది.

⚜ బాగా పండిన బొప్పాయి, అరటి.. ఇలా ఏ పళ్లనైనా మెత్తగా చేసి ఆ ముద్దను పాదాలకు అప్త్లె చేసి, 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత శుభ్రం చేయడం వల్ల పాదాలు మృదువుగా, సున్నితంగా మారతాయి. గరుకుదనం కూడా తగ్గుతుంది.

⚜ అలాగే రోజువారీ తీసుకునే ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు చేర్చుకోవడం తప్పనిసరి. వాటితో పాటు విటమిన్- ఇ ఎక్కువగా లభించే వెజిటబుల్ ఆయిల్స్, ఆకుకూరలు, గోధుమలు, చేపలు, తృణ ధాన్యాలు, నట్స్ మొదలైన పదార్థాలు కూడా తరచూ తీసుకోవడం ఉత్తమం.

ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మళ్లీ ఈ సమస్య తలెత్తడానికి అవకాశం ఉండదు. మృదువైన, కోమలమైన పాదాలు మన సొంతమవుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని