Updated : 07/01/2022 20:25 IST

చలికాలంలోనూ ఆరోగ్యంగా ఇలా!

చలికాలం వచ్చిందంటే చాలు.. జలుబు, దగ్గు, ఆస్తమా, పొడి చర్మం.. ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీంతో ఏ పనీ చేయకముందే అలసట, నీరసం దరిచేరతాయి. మరి వీటన్నింటినీ వదిలించుకుని ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవండి..

మోతాదులో నీళ్లు..

చలికాలంలో దాహం వేయదు.. మరి అలాగని నీరు తాగడం మానేస్తే శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. ఫలితంగా చర్మం పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దాహం వేయకున్నా ఎప్పటిలాగే చలికాలంలో కూడా ప్రతిరోజూ  నీరు తాగడం మంచిది. దీనివల్ల శరీరంలోని విషపదార్థాలు సులభంగా బయటికి వెళ్లిపోయి.. తద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు.

ఆహారమూ ముఖ్యమే!

ఏ సీజన్‌లోనైనా మనం ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడే కీలకమైన అంశం మనం తీసుకునే ఆహారం. అలాగే చలికాలంలో ఆరోగ్యంగా ఉండడానికి తాజా పండ్లు, కూరగాయలు; పరిశుభ్రమైన ఆహారం.. తీసుకోవాలి. ఏది తీసుకున్నా సరే.. ముందు చేతులు సబ్బుతో లేదా లిక్విడ్ హ్యాండ్‌వాష్‌తో పరిశుభ్రంగా కడుక్కొని తీసుకోవడం చాలా మంచిది. లేదంటే క్రిములు శరీరంలోకి వెళ్లి కొత్త ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

ఒత్తిడికి దూరంగా..

ఈ రోజుల్లో ఒత్తిడి అనేది సర్వసాధారణ సమస్య. అలాగని దీన్ని తేలిగ్గా తీసుకుంటే క్రమంగా ఒత్తిడి పెరిగిపోయి జలుబు, ఫ్లూ.. వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి ఏ పనినైనా ఒత్తిడికి గురవకుండా చేయడం అలవాటు చేసుకోండి. అలాగే ఎప్పుడూ పనే కాకుండా వారానికి ఒకటి లేదా రెండుసార్లు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపడం.. లాంటివి చేయడం వల్ల కూడా ఒత్తిడికి దూరంగా ఉండచ్చు.

రాత్రిపూట నిద్ర..

మనం ఆరోగ్యంగా ఉండడంలో నిద్ర కూడా తన వంతు పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ప్రతిరోజూ రాత్రిపూట కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం అనేది ఆరోగ్యకరం. ఇలా చేయడం వల్ల ప్రతిరోజూ ఉత్సాహంతో ముందుకు సాగచ్చు. లేదంటే శరీరం నీరసంగా, బద్ధకంగా అయిపోతుంది.

వ్యాయామం తప్పనిసరి!

'అబ్బా.. చలిగా ఉంది కదా! వ్యాయామం ఏం చేస్తాంలే..' అని బద్ధకిస్తుంటారు చాలామంది. కానీ అది ఆరోగ్యకరం కాదు. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఓ అరగంట పాటు వ్యాయామం చేయడం మంచిది. దీనివల్ల అటు దృఢంగానూ.. ఇటు ఆరోగ్యంగానూ ఉంటాం.. మరో రకంగా చెప్పాలంటే ఒత్తిడి కూడా తగ్గుతుంది.

చల్లబడుతున్నాయా??

చలికాలంలో రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల చేతి వేళ్లు, కాళ్లు చల్లగా అయిపోవడం మనం గమనిస్తూనే ఉంటాం. చలికి తట్టుకోలేక కొంతమందికైతే చేతి వేళ్ల చివర్లలో ముడతలు కూడా పడుతుంటాయి. మరి అలాంటి సమస్యల్ని తగ్గించుకోవాలంటే చేతులను లేదా కాళ్లను ఒకదానికొకటి రాపిడి చేసుకోవడం; నెమ్మదిగా, గుండ్రంగా తిప్పడం.. లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ బాగా జరిగి చల్లగా కాకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించడం మర్చిపోవద్దు.

చర్మ ఆరోగ్యానికి..

చలికాలంలో చర్మం పొడిబారిపోయి పగుళ్లు, అలర్జీ.. వంటి సమస్యలు ఎదురవడం సర్వసాధారణం. వీటితో చిరాగ్గా అనిపిస్తుంటుంది. కాబట్టి చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లు రాసుకోవడం, ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం, ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా లభించే చేపలు, విటమిన్ ఇ ఎక్కువగా ఉండే పాలకూర, బాదం, అవకాడో.. వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటివల్ల చర్మంపై ఉండే పగుళ్లు తగ్గిపోయి ఆరోగ్యవంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

దృష్టిలో ఉంచుకోండి..

* బయట దొరికే పండ్ల రసాలు, కేక్స్, చాక్లెట్లు, స్వీట్లు.. తదితర పదార్థాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వీటి తయారీలో ఉపయోగించే చక్కెరలు శరీరంలోని రోగనిరోధకశక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంటుంది.

* చలికాలంలో ఒక్కోసారి అజీర్తి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా సరిపడేంత ఆహారం తీసుకోవడం మంచిది.

* విటమిన్ సి ఎక్కువగా లభించే నిమ్మజాతి పండ్లు; జింక్ ఎక్కువగా లభించే పాలకూర, నట్స్, చేపలు, మాంసం, నువ్వులు.. వంటి ఆహార పదార్థాల్ని ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిది. ఇవి రోగనిరోధకశక్తిని పటిష్టం చేయడంలో సహాయపడతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని