ఇంటి నుంచి సరిగ్గా పని చేయలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే!

ఇంటి నుంచి పని.. వినడానికి, చేయడానికి ఈ పని విధానం బాగానే ఉన్నప్పటికీ దీనివల్ల శారీరకంగా, మానసికంగా అదనపు భారం పడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలో పని గంటలు పెరిగిపోవడం వల్ల ఒత్తిడి-ఆందోళనలు చుట్టుముడుతున్నాయి. ఇక మహిళలకైతే వీటితో పాటు ఇంట్లో పనులు కూడా ఉండనే ఉన్నాయి.

Published : 23 Jan 2022 14:52 IST

ఇంటి నుంచి పని.. వినడానికి, చేయడానికి ఈ పని విధానం బాగానే ఉన్నప్పటికీ దీనివల్ల శారీరకంగా, మానసికంగా అదనపు భారం పడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలో పని గంటలు పెరిగిపోవడం వల్ల ఒత్తిడి-ఆందోళనలు చుట్టుముడుతున్నాయి. ఇక మహిళలకైతే వీటితో పాటు ఇంట్లో పనులు కూడా ఉండనే ఉన్నాయి. ఇవన్నీ కలిసి వారికి ఊపిరి సలపకుండా చేస్తున్నాయని, తద్వారా పురుషులతో పోల్చితే మహిళల ఉత్పాదకత సుమారు నాలుగు రెట్లు తక్కువగా నమోదైనట్లు ఓ నివేదికలో వెల్లడైంది. అంతేకాదు.. ఇలా తమ పనితనం తగ్గిపోతోందని గ్రహించిన మహిళలు తమ మానసిక సమస్యల్ని కూడా బయటికి చెప్పుకోలేకపోతున్నారట! మరి, ఇదిలాగే కొనసాగితే ఇటు మానసికంగా, అటు కెరీర్‌ పరంగా సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే పనిలో నాణ్యతను పెంచుకోవడానికి కొన్ని నియమాలు పాటించాలంటున్నారు. ఇంతకీ అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

మనం ఇంట్లో ఉన్న రోజు కంటే ఆఫీస్‌కి వెళ్లిన రోజే పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. అదే ఇంటి నుంచి పని చేసేటప్పుడైతే.. ఇటు కుటుంబ సభ్యుల్ని చూసుకోవాలి.. అటు పనులన్నీ చేసుకోవాలి.. మరోవైపు ఆఫీస్‌ పని.. ఇలా వీటన్నింటినీ సమన్వయం చేసుకోలేక ఈ రోజుల్లో చాలామంది ఆడవారు సతమతమవుతున్నారు. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తోన్న క్రమంలో ఇంటి పనుల అదనపు భారం వల్లే కెరీర్‌లో మహిళల ఉత్పాదకత పురుషులతో పోల్చితే సుమారు నాలుగు రెట్లు తగ్గినట్లు ఓ నివేదిక చెబుతోంది. అంతేకాదు.. ఇలా తమ అవుట్‌పుట్‌ విషయంలో ఆందోళన చెందుతోన్న మహిళలు తమ మానసిక సమస్యల్ని కూడా బయటికి చెప్పలేకపోతున్నారట!

ఏదేమైనా ఇది అంతిమంగా వారి కెరీర్‌ని దెబ్బతీస్తుందని చెప్పచ్చు. అందుకే ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే భర్త/కుటుంబ సభ్యులు ఇంటి పనుల్ని పంచుకుంటూ ఉద్యోగినులకు చేదోడువాదోడుగా ఉండాలంటున్నారు నిపుణులు. దాంతో పాటు మహిళలు కూడా వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేస్తూ తమ ఉత్పాదకతను పెంచుకోవడానికి కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు.

అనువైన పని గంటలు!

ఉదయం లేచి ఇంటి పని, వంట పని చేయక తప్పదు.. ప్రశాంతంగా ఓ పది నిమిషాలు కూర్చొని బ్రేక్‌ఫాస్ట్‌ చేయకముందే ఆఫీస్‌ వర్క్‌కి లాగినవ్వాల్సిన సమయం దగ్గరపడుతుంది.. ఇంకేముంది ఆకలితోనే పని మొదలుపెడతాం.. ఇక మధ్యలో కాస్త విరామం తీసుకొని తిందామా అంటే ఆ సమయంలో ఇంట్లో ఉన్న పెద్దల్ని, పిల్లల్ని చూసుకోవడంతోనే సరిపోతుంది. ఇలా ఇవన్నీ తలచుకుంటుంటే ఒక్కోసారి మనపై మనకే విపరీతమైన కోపమొస్తుంటుంది. అలాగని మనల్ని మనం నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆఫీస్‌ వాళ్లు మీకు నిర్దేశించిన పనిగంటలతో మీకు ఇబ్బందిగా అనిపిస్తే.. మీకు అనువైన పని గంటలేంటో మీ పైఅధికారులతో మాట్లాడి ఆ సమయంలో పని చేయడం మంచిదంటున్నారు. తద్వారా అటు ఇంటి పనుల్ని, ఇటు ఆఫీస్‌ పనిని సౌకర్యవంతంగా పూర్తిచేయచ్చంటున్నారు. ఇలాంటి కంఫర్ట్‌ పనిపై ఏకాగ్రతతో పాటు ఉత్పాదకతనూ పెంచుతుందని సలహా ఇస్తున్నారు.

ఒక్కసారి ఒక్క పనే!

ఓవైపు సమయం గడిచిపోతుంటుంది.. మరోవైపు ఆ రోజు పూర్తి చేయాల్సిన అసైన్‌మెంట్స్‌ బోలెడన్ని ఉంటాయి. ఈ క్రమంలో కొంతమంది అన్ని పనుల్నీ ఒకేసారి పూర్తి చేయాలన్న ఉద్దేశంతో వాటిని మొదలుపెట్టేస్తుంటారు. దీంతో ఒక పని చేస్తుంటే మరో పని మీదికి మనసు మళ్లుతుంది. ఒత్తిడి పెరుగుతుంది.. తద్వారా ఏ పనీ పూర్తిచేయకుండా ఆ రోజంతా వృథా అవుతుంది. ఒక రకంగా ఇది మీ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడ్డట్లే! కాబట్టి ఇలా పనుల్ని మధ్యలోనే ఆపేయడం కంటే మీకు అప్పగించిన పనుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పనిని ముందు మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయండి.. ఇలా పనుల్ని ఒక దాని తర్వాత మరొకటి పూర్తి చేయడం వల్ల మీ నుంచి చక్కటి అవుట్‌పుట్‌ని సైతం కంపెనీకి అందించచ్చు.

ఇంట్లోనే ‘వర్కేషన్’!

మన ఉత్పాదకత పెంచుకోవడంలో చుట్టూ ఉన్న వాతావరణం కూడా దోహదం చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే! ఇందుకే ఇంటి నుంచి పనిచేసే క్రమంలో ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించుకొని, దాన్ని మనకు అనువుగా-అందంగా మలచుకోవాలని చెబుతుంటారు నిపుణులు. అయితే ఈ క్రమంలో కొంతమందికి ప్రకృతితో మమేకమవుతూ పనిచేయడమంటే ఆసక్తి ఉంటుంది. పైగా ఇలా పచ్చటి చెట్ల మధ్య గడుపుతూ స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల మనలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, పనితనం పెరుగుతుందని ఓ అధ్యయనంలో కూడా వెల్లడైంది. కాబట్టి నచ్చిన ప్రదేశంలో గడుపుతూ పని చేద్దామని ఎక్కడెక్కడికో వెళ్లే బదులు ఇంటి ఆవరణ, గార్డెన్‌నే వర్కేషన్‌గా మార్చుకోమని సలహా ఇస్తున్నారు నిపుణులు. తద్వారా ఎంచక్కా హ్యాపీగా పనిచేసుకుంటూ మన ఉత్పాదకతను సైతం పెంచుకోవచ్చు.

ఆ ‘చెత్త’ను తొలగించాల్సిందే!

ఇల్లంతా చెత్తచెత్తగా, వస్తువులన్నీ చిందరవందరగా పడుండడం చూస్తే ఎవరికైనా చిరాకొస్తుంటుంది. అలాగే ఇంట్లో మనం పని చేసే క్యాబిన్‌ కూడా ఇలా చిందరవందరగా ఉందనుకోండి.. పని చేయాలనిపించదు.. ఒక రకమైన అసహనం, చిరాకు ఆవహిస్తుంటాయి. ఇలా కార్టిసాల్‌ (ఒత్తిడి హార్మోన్‌)కు, క్లట్టర్‌ (చెత్త)కు చాలా దగ్గరి సంబంధం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అందుకే ఈ చిరాకును మనం చేసే పనిపై చూపించకుండా ఉండాలంటే ముందుగా పని చేసే క్యాబిన్‌లో నుంచి అనవసరమైన చెత్తను తొలగించాలంటున్నారు నిపుణులు. అలాగే ఆ చుట్టు పక్కల మీకు నచ్చిన అందమైన, ఆహ్లాదకరమైన వస్తువులు, బొమ్మలు, ఇండోర్‌ ప్లాంట్స్‌.. వంటివి అమర్చుకోవచ్చు. ఇలా అన్నీ అందంగా సర్దుకొని ల్యాప్‌టాప్ ఓపెన్‌ చేసేసరికి.. అందులో ఎక్కువ సమాచారం ఉండడంతో దాని వేగం మందగిస్తుంది. ఇది కూడా మనల్ని తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. కాబట్టి ఆఫీస్‌ క్యాబిన్‌తో పాటు ల్యాప్‌టాప్‌ని కూడా డి-క్లట్టర్‌ చేయమంటున్నారు నిపుణులు. ఇలా మనం పనిచేసే ప్రదేశాన్ని, సిస్టమ్‌ని మనకు నచ్చినట్లుగా మార్చుకుంటే.. ఏకాగ్రతతో పనిచేయడమే కాదు.. పనిలో ఉత్పాదకతను సైతం పెంచుకోవచ్చు..!

మన కోసం మనం!

ఇంటి పనులు, ఆఫీస్‌ పనులు, పిల్లలు-కుటుంబ సభ్యుల బాధ్యతలు.. ఇవన్నీ పూర్తి చేసే క్రమంలో మనకు ఒక రోజు సమయం కూడా సరిపోదు.. ‘అబ్బ.. రోజుకు 48 గంటల సమయముంటే బాగుండు!’ అనుకునే వారూ లేకపోలేదు. ఇలా ప్రతి క్షణం పనితో పరిగెడుతూ, ఇతరులకు సమయం కేటాయిస్తుంటే ఒక దశలో మనపై మనకే కోపమొస్తుంటుంది.. దీంతో ‘నా కోసం కనీసం ఓ గంట సమయం కేటాయించుకోలేకపోతున్నా.. ఏంటో ఈ జీవితం’ అన్న అసహనం కూడా కొంతమందిలో ఉంటుంది. దీని ప్రభావం అంతిమంగా కెరీర్ పైనే పడుతుంది. ఇలా జరగకూడదంటే రోజులో మన కోసం మనం కాస్త సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందుకోసం మహిళలు ఆ రోజు ప్రాధాన్యం లేని పనుల్ని పక్కన పెట్టడం నేర్చుకోవాలంటున్నారు. అలాగే కాసేపు వ్యాయామం చేయడం, మీకు నచ్చిన వారితో సమయం గడపడం, స్నేహితులతో బయటికి వెళ్లడం, నచ్చిన పనులు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం.. ఇలా మన కోసం మనం గడపడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. దాంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఫలితంగా కెరీర్‌లోనూ దూసుకుపోవచ్చు..! 

చూశారుగా.. పనిలో ఉత్పాదకతను పెంచుకోవాలంటే ఎన్ని మార్గాలున్నాయో! పైగా ఇవి అంత కష్టమైనవి కూడా కావు! కాబట్టి వీటిపై దృష్టి పెట్టి కెరీర్‌లో అడుగు ముందుకేయండి.. అంతేనా.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో భాగంగా మీ పనిలో ఉత్పాదకతను పెంచుకోవడానికి మీరెలాంటి చిట్కాలు పాటిస్తున్నారో కింది కామెంట్‌ బాక్స్‌ ద్వారా మాతో పంచుకోవడం మాత్రం మర్చిపోవద్దు.. మీరిచ్చే విలువైన సలహాలు ఇతర మహిళలకూ ఉపయోగపడచ్చు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్