విటమిన్ ‘డి’ అందుతోందా?
మన సంపూర్ణ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీని మెరుగుపరచుకోవడానికి మనం తీసుకునే ఆహారం కీలకం అన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి - రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ ‘డి’ పాత్ర ఎంత కీలకమైనదో....
మన సంపూర్ణ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీని మెరుగుపరచుకోవడానికి మనం తీసుకునే ఆహారం కీలకం అన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి - రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ ‘డి’ పాత్ర ఎంత కీలకమైనదో తెలిసిందే. ఈ క్రమంలో-విటమిన్ ‘డి’ లోపం లేకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవాలి? రండి.. తెలుసుకుందాం..!
అందుకే అవి తీసుకోవాలి!
విటమిన్ ‘డి’ ఎముకల్ని దృఢంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ విటమిన్ తగినంత తీసుకుంటే కొన్ని క్యాన్సర్లకు కూడా దూరంగా ఉండచ్చట! అదే ఈ విటమిన్ గనుక లోపిస్తే కండరాల బలహీనత, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, అలసట, ఆందోళన, ఒత్తిడి, జుట్టు రాలడం, దీర్ఘకాలిక జీర్ణ సంబంధిత సమస్యలు.. వంటివి తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ‘డి’ విటమిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు లేదంటే డాక్టర్ సలహా మేరకు సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
వేటిలో ఎక్కువంటే..?
పాలు, పెరుగు
ఆవు పాలలో విటమిన్ ‘డి’ అధికంగా ఉంటుంది. రోజుకు ఒక గ్లాసు వెన్నతో కూడిన ఆవు పాలు తాగడం వల్ల రోజులో కావాల్సిన మొత్తంలో 20 శాతం దాకా ఈ విటమిన్‌ను శరీరానికి అందించచ్చు. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం కూడా ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. పెరుగులో కూడా ప్రొటీన్లతో పాటు ‘డి’ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అయితే బయట దొరికే పెరుగులో చాలావరకు ఫ్లేవర్స్ కలుపుతుంటారు కాబట్టి అందులో చక్కెర స్థాయులు అధికంగా ఉంటాయి.. అందుకే ఇంట్లోనే పెరుగు తోడేసుకొని తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
పుట్టగొడుగులు
పుట్టగొడుగులు ఎండలోనే పెరుగుతాయి కాబట్టి వీటిలో విటమిన్ ‘డి’ స్థాయులు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. దీంతో పాటు బి1, బి2, బి5, కాపర్.. వంటి పోషకాలు కూడా పుట్టగొడుగుల్లో అధికంగా ఉంటాయి. అయితే పుట్టగొడుగుల్లోనూ బటన్ మష్రూమ్స్, స్ట్రా మష్రూమ్స్.. ఇలా వివిధ రకాలుంటాయి కాబట్టి ఆయా రకాలను బట్టి విటమిన్ ‘డి’ స్థాయులు మారుతూ ఉంటాయి.
పావుగంట ఎండలో!
సూర్యరశ్మి నుంచి మన శరీరానికి అధిక మొత్తంలో విటమిన్ ‘డి’ అందుతుంది. ఇది శరీరం క్యాల్షియంను గ్రహించడంలో సహకరిస్తుంది. తద్వారా ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ‘డి’ విటమిన్ నాడులు, కండరాల ఆరోగ్యానికి అవసరం. అంతేకాదు.. రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలోనూ దీనికిదే సాటి! కాబట్టి రోజూ ఉదయాన్నే లేలేత సూర్యకాంతిలో కనీసం పదిహేను నిమిషాలైనా నిలబడమని నిపుణుల సలహా!
ఇవి కూడా!
⚛ కమలాఫలంలో విటమిన్ సి, డిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి దోహదం చేస్తాయి.
⚛ విటమిన్ ‘డి’ అధికంగా లభించే పదార్థాల్లో ఓట్స్ కూడా ఒకటి. అలాగే ఇందులోని అత్యవసర ఖనిజాలు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఆరోగ్యానికి, చక్కటి శరీరాకృతికి చాలా అవసరం.
⚛ విటమిన్ ‘డి’ తో పాటు ప్రొటీన్లు కూడా గుడ్డులోని పచ్చసొనలో పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో కొవ్వులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే రోజుకు ఒక పచ్చసొన కంటే ఎక్కువ తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. కావాలంటే ఇందులో రుచి కోసం కొన్ని కాయగూర ముక్కల్ని కలుపుకొని ఆమ్లెట్‌లాగా వేసుకొని లాగించేయచ్చు.
⚛ చేపల్లోనూ విటమిన్ ‘డి’ స్థాయులు ఎక్కువే. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం, ప్రొటీన్లు, ఫాస్ఫరస్.. వంటి పోషకాలు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.