Updated : 25/02/2023 18:49 IST

ఫ్లవర్‌వాజుల్లో పూలు.. తాజాగా ఇలా..!

ఇంటి అలంకరణలో భాగంగా అక్కడక్కడా ఫ్లవర్‌వాజ్‌లు పెట్టడం మామూలే. కొంతమంది వీటిలో కృత్రిమ పూలకు బదులు అసలైన పూలనే ఉంచుతుంటారు. కానీ, వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి చాలా తొందరగా వాడిపోయి.. కళావిహీనంగా తయారవుతాయి. అప్పుడు అవి ఎలాంటి అందాన్నివ్వవు సరికదా.. ఉన్న అందాన్ని చెడగొడతాయి. అందుకే ఫ్లవర్‌వాజుల్లో ఉంచే పూలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంటి అలంకరణకు కొంతమంది రోజా పూలు, లిల్లీ పూలు.. వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. అవి కొని ఇంటికి తీసుకొచ్చాక చూస్తే కొన్ని వాడిపోతూ ఉంటాయి. మరికొన్ని అప్పటికే పాడై ఉంటాయి. ప్రత్యేకించి ఎండాకాలంలో ఇలా జరగడం మామూలే. అందుకే ఇంటి అలంకరణ కోసం ఉపయోగించే పూలు తాజాగా ఉంటూ పరిమళాలు వెదజల్లాలంటే వాటిని కొనే సమయం నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాలి. అప్పుడే అవి మనం కోరుకున్నట్లు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.

రోజాపూలు కొనడానికి వెళ్లినప్పుడు పూల రెక్కలన్నీ కలిసి కాడ పైన ఉబ్బెత్తుగా ఏర్పడే నిర్మాణాన్ని ఒక్కసారి పరిశీలించండి. దాన్ని నొక్కినప్పుడు అది మరీ మెత్తగా అనిపిస్తే ఆ పూలు పాతవని అర్థం. అలాకాకుండా కాస్త మెత్తగా, కాస్త గట్టిగా అనిపిస్తే అవి తాజా పూలని అర్థం.

అలాగే ఎక్కువ రకాల పువ్వులు తీసుకున్నప్పుడు వేటికవి విడివిడిగా ప్యాక్ చేయించుకోవాలి. అలా చేస్తే ఇంటికి చేరుకున్న తర్వాత వాటిని సులువుగా విడదీసుకోవచ్చు. పువ్వులు కూడా నలిగిపోకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది.

ఫ్లవర్ వాజుల్లో నీళ్లలో ఉంచే పువ్వులకు కాండం ఎంతవరకు నీటిలో మునుగుతుందో చూసుకుని దాని కింద ఉండే ఆకులు తీసేయాలి. ఇలా చేయడం వల్ల నీళ్లు శుభ్రంగా ఉంటాయి.

మీరు తీసుకువచ్చిన పువ్వుల కాండాలు కూడా సరిచూసుకోవాలి. అవి విరిగి ఉన్నా.. లేక చివర్లు కాల్చినట్టు ఉన్నా.. ఎండిపోయినట్టు ఉన్నా.. వాటిని కట్ చేయాలి. కత్తిరించిన తర్వాత వాటిని ఫ్లవర్‌వాజ్‌లో పెట్టేంత వరకూ నీటిలో ఉంచాలి.

ఫ్లవర్‌వాజ్‌లు కూడా శుభ్రంగా ఉంటేనే పూలు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. అందుకే సబ్బు, వేడినీళ్లను ఉపయోగించి ఫ్లవర్‌వాజ్‌లను కడగాలి.

వాడిపోతున్న రెక్కల్ని తీసేయాలి. ఫ్లవర్‌వాజ్‌లో ఉండే నీళ్లు ఏ మాత్రం జిగురుగా అనిపించినా వెంటనే మార్చేయాలి.

నేరుగా ఎండ పడే చోట, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే చోట పువ్వులు ఉంచకూడదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని