చేతులు, కాళ్లు వెచ్చగా.. ఇలా
close
Published : 28/11/2021 12:47 IST

చేతులు, కాళ్లు వెచ్చగా.. ఇలా!

చలికి చాలామంది చేతులు, కాళ్లు గడ్డకట్టుకుపోవడం.. వెచ్చదనం కోసం రెండు అరచేతుల్ని రాపిడి చేయడం మనకు అలవాటే! అయితే దీనికి కారణం.. ఈ కాలంలో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణ వేగం మందగించడమే అంటున్నారు నిపుణులు. ఇది సర్వసాధారణమే అయినప్పటికీ ఈ కాలంలో చేతులు, కాళ్లను వెచ్చగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

వ్యాయామం తప్పనిసరి..

శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేసి.. వేడి పుట్టించే శక్తి వ్యాయామానికి ఉంది. అందుకే కష్టమైనా రోజూ ఓ అరగంట పాటు వర్కవుట్‌కు సమయం కేటాయించమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఏరోబిక్స్‌, జాగింగ్‌, నడక, ఇతర జిమ్‌ వ్యాయామాలు సాధన చేయచ్చు. అలాగే ఆరుబయట వ్యాయామాలు చేసే వాళ్లు చలికి తట్టుకునేలా దుస్తులు ధరించడం తప్పనిసరి.. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు వేసుకోవడం మర్చిపోవద్దు.

మర్దనతో లాభాలెన్నో!

మర్దనతో శరీరంలో వేడి పుడుతుంది.. రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. రక్తంతో పాటు ఆక్సిజన్‌ కూడా ఆయా శరీర భాగాలకు అందుతుంది. కాబట్టి గోరువెచ్చటి నూనెతో శరీరాన్ని, చేతులు-కాళ్లు, చేతి వేళ్లు-కాలి వేళ్లను మర్దన చేయడం వల్ల ఈ ఫలితాలన్నీ పొందచ్చు. అంతేకాదు.. ఈ ప్రక్రియ వల్ల చర్మం కూడా తేమగా మారుతుంది.

హీటింగ్‌ ప్యాడ్‌ ఉందా?

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బయటి చల్లదనం ఇంట్లోకీ ప్రవేశిస్తుంది. తద్వారా మరింత చలిగా ఉంటుంది. ఇలాంటప్పుడు హీటింగ్‌ ప్యాడ్లు, రూమ్‌ హీటర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల అటు గదిని, ఇటు శరీరాన్ని వెచ్చబర్చుకోవచ్చు.

ఉప్పుతో ఇలా!

గళ్లుప్పుకు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే గుణం ఉంది. అందుకే చేతులు, కాళ్లను వెచ్చగా మార్చుకోవడానికి ఈ చిట్కా పాటించమంటున్నారు నిపుణులు. గోరువెచ్చటి నీళ్లలో ఉప్పు వేసి.. అందులో చేతులు, కాళ్లను ఓ పది నిమిషాల పాటు ఉంచితే చక్కటి ఫలితం ఉంటుంది.

నీళ్లు తాగాలి..

సాధారణంగా చాలామంది చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీని ప్రభావం రక్తప్రసరణపైనా పడుతుంది. కాబట్టి దాహం వేయకపోయినా బరువును బట్టి రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి! తద్వారా చలికి చర్మం పొడిబారకుండా కూడా కాపాడుకోవచ్చు.

ఇవి కూడా!

* చల్లటి వస్తువుల్ని నేరుగా తాకకూడదు.

* ఇంట్లోని ఫోరింగ్‌పై నడిచేటప్పుడు స్లిప్పర్స్‌ ధరించడం, గ్లౌజులు-సాక్సులు వేసుకోవడం తప్పనిసరి.

* శరీరంలో వేడి పుట్టించే హెర్బల్‌ టీలకు ప్రాధాన్యమివ్వాలి. అరటిపండ్లు, చిలగడదుంప, ఓట్స్‌, సూప్స్‌.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.

చలికాలంలో కాళ్లు, చేతులు గడ్డకట్టుకుపోవడం/చల్లగా మారడం సర్వసాధారణమే అయినా.. కొంతమందిలో ఇతర సమస్యలు కూడా ఇందుకు కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. రక్తహీనత, హైపోథైరాయిడిజం, మధుమేహం.. వంటి అనారోగ్యాలున్నా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. కాబట్టి ఓసారి నిపుణుల్ని సంప్రదించి.. సమస్యకు గల కారణాలు, దాని పరిష్కార మార్గాల్ని అడిగి తెలుసుకోవడం ఉత్తమం.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని