Published : 07/01/2023 17:52 IST

తొడ భాగంలో కొవ్వు కరగాలంటే..

అందరి శరీరాకృతులు ఒకేలా ఉండవు. కొందరు సన్నగా, నాజూగ్గా ఉంటే.. మరికొందరు లావుగా ఉంటారు. ఇంకొందరికైతే శరీరమంతా సన్నగా ఉంటుంది.. కానీ తొడలు మాత్రం కాస్త లావుగా ఉంటాయి. దీనికి కారణం ఈ ప్రదేశంలో పేరుకుపోయిన కొలెస్ట్రాలే. ఎప్పుడైనా జీన్స్ లాంటి కొంచెం బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల ఇవి మరింత లావుగా కనిపిస్తాయి. ఫలితంగా చాలామంది అసౌకర్యంగా ఫీలవుతుంటారు. ఈ క్రమంలో తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి శరీరాకృతికి తగ్గట్లుగా దృఢంగా తయారుకావాలంటే ఈ చిట్కాలు పాటించండి.

⚜ సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లు, తొడలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల తొడ భాగంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. కాబట్టి మీరు చేసే వ్యాయామాల్లో భాగంగా దీన్ని కూడా ప్రయత్నించండి. అలాగే దగ్గరి దూరాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడైనా సాధ్యమైనంతవరకు సైకిల్‌పై వెళ్లడం మంచిది.

⚜ మన శరీరంలో కొన్ని జీవక్రియలు నీటితో ముడిపడి ఉంటాయి. నీళ్లు సరిగా తాగనట్లయితే డీహైడ్రేషన్ సమస్య తలెత్తి, తద్వారా మెటబాలిజం ప్రక్రియ మందగించే అవకాశం ఉంటుంది. కాబట్టి తగినంత నీరు తాగుతూ శరీరాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి.

⚜ పై అంతస్తులకు వెళ్లడానికి లిఫ్ట్, ఎస్కలేటర్లు వాడుతున్నారా? అయితే ఇప్పటి నుంచైనా వాటి వాడకం తగ్గించి చక్కగా మెట్లెక్కి వెళ్లండి. దీనివల్ల తొడ కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. ఫలితంగా ఈ భాగంలో క్రమంగా కొవ్వు తగ్గే అవకాశం ఉంటుంది.

⚜ పోషకాలు ఎక్కువగా.. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని క్యాలరీలు తగ్గి ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

⚜ గోడకుర్చీ వేసినట్లుగా కూర్చొని బరువులెత్తడం (స్క్వాట్స్) వల్ల కూడా తొడ భాగంలోని కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల సమస్య నుంచి క్రమక్రమంగా ఉపశమనం కలుగుతుంది.

⚜ గడ్డి మీద నడవడం, జాగింగ్ చేయడం లాంటి వాటి వల్ల కేవలం తొడల భాగంలోనే కాకుండా.. శరీరంలో పేరుకుపోయిన అదనపు క్యాలరీలు, కొవ్వు కరిగి ఫలితంగా బరువు తగ్గచ్చు. ఈ వ్యాయామాలు ఉదయం చేయడమే మంచిది. ఎందుకంటే ఉదయం పూట గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. తాజా గాలిని పీల్చుకోవడం వల్ల శరీరంలోని క్యాలరీలు త్వరగా కరిగే అవకాశముంది.

⚜ తొడ భాగంలోని కొవ్వును కరిగించుకోవడానికి ఉపకరించే పరికరం.. లెగ్ ఎక్స్‌టెన్షన్ మెషీన్. దీనిపై కూర్చుని కాళ్లను నెమ్మదిగా ముందుకు చాపుతూ తిరిగి వెనక్కి తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. త్వరగా తగ్గాలని వేగంగా చేస్తే తొడల భాగంలో ఉండే కండరాలకు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.

⚜ ఆటలాడుకోవడం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. పైగా స్నేహితులతో ఆడుకుంటే మరింత సరదాగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ ఫ్రెండ్స్‌తో కలిసి కాసేపు బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ ఆడండి. దీంతో ఎంజాయ్‌మెంట్‌తో పాటు తొడ భాగంలో కొవ్వు కూడా కరుగుతుంది.

⚜ శరీరంలోని ప్రతి కండరం దృఢంగా మారడానికి సరైన వ్యాయామం ఈతకొట్టడం. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి నాజూగ్గా తయారుకావచ్చు. ఇది కూడా తొడ భాగంలో కొవ్వు కరగడానికి సహాయపడే వ్యాయామాల్లో ఒకటి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని