మంచం కింద పొందిగ్గా..!

ఇల్లు చిన్నగా ఉండి వస్తువులు ఎక్కువగా ఉన్నప్పుడు వాటన్నింటినీ పొందిగ్గా సర్దడం వీలు కాదనుకుంటారు చాలామంది. ఈ క్రమంలో అరుదుగా ఉపయోగించే వాటిని మూట కట్టి ఓ మూల పడేస్తుంటారు.. లేదంటే విసుగొచ్చి ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసే వారూ...

Published : 08 Apr 2023 19:41 IST

ఇల్లు చిన్నగా ఉండి వస్తువులు ఎక్కువగా ఉన్నప్పుడు వాటన్నింటినీ పొందిగ్గా సర్దడం వీలు కాదనుకుంటారు చాలామంది. ఈ క్రమంలో అరుదుగా ఉపయోగించే వాటిని మూట కట్టి ఓ మూల పడేస్తుంటారు.. లేదంటే విసుగొచ్చి ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసే వారూ లేకపోలేదు. ఫలితంగా ఇల్లంతా చిందర వందరగా తయారవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఇంట్లో మనం చూసీ చూడనట్లు వదిలేసే కొన్ని స్టోరేజ్ స్పేసెస్‌ని ఉపయోగించుకోవాలంటున్నారు నిపుణులు. మంచం కింద ఉన్న ఖాళీ స్థలం కూడా అలాంటిదే! మరి, ఇంట్లోని వస్తువుల్ని మంచం కింద పొందిగ్గా ఎలా అమర్చచ్చో తెలుసుకుందాం రండి..

ఎలాగూ ఎవరికీ కనిపించదన్న ఉద్దేశంతో మంచం కింద వస్తువుల్ని ఎలా పడితే అలా పడేస్తే అక్కడంతా చిందరవందరగా తయారవుతుంది. పైగా మనకు కావాల్సినప్పుడు ఆయా వస్తువులు త్వరగా దొరక్క సమయం వృథా అవుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటంటే..!

చక్రాల బాక్సుల్లో అనువుగా..!

పడక గదిలో అల్మరాలు/కప్‌బోర్డుల్లో ఖాళీ లేనప్పుడు కొన్ని బెడ్‌షీట్లు, రగ్గులు.. షూర్యాక్‌ నిండిపోతే అరుదుగా వాడే చెప్పుల జతలు.. వంటివన్నీ మంచం కింద అమర్చడం చాలామందికి అలవాటుంటుంది. అయితే ఇలాంటి వాటిని అమర్చడానికి ప్రత్యేకమైన బాక్సులు/బ్యాగులు బయట దొరుకుతున్నాయి. వీటిలోనూ అడుగున చక్రాలుండి, లేయర్ల తరహాలో ఉన్న బాక్సులు ఎంచుకుంటే మరీ మంచిది. కాబట్టి ఇలాంటి వాటిని ఎంచుకుంటే ఇల్లు నీట్‌గా కనిపిస్తుంది.. ఆయా వస్తువులు మీకు హ్యాండీగానూ ఉంటాయి.

మంచానికి అనుసంధానిస్తూ..!

కొంతమంది ఇళ్లలో స్టోరేజ్‌ బెడ్స్‌ ఉంటాయి. అలాంటి వాళ్లు అందులోని ర్యాక్స్‌లో వస్తువుల్ని పొందిగ్గా అమర్చుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా.. ఉన్న మంచానికే ఓ స్టోరేజ్‌ యూనిట్‌ని తయారుచేయించుకొని అనుసంధానించుకోవచ్చంటున్నారు డిజైనర్లు. ఈ క్రమంలో మీ మంచం పొడవు, వెడల్పులను బట్టి.. విభిన్న పరిమాణాల్లో అరలతో కూడిన స్టోరేజ్‌ బాక్స్‌ని తయారుచేయించాలి. ఆపై దాన్ని మంచానికి డ్రా మాదిరిగా అటాచ్‌ చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మంచం కింద శుభ్రం చేయాలన్నా.. ఈ తరహా బాక్సులు తొలగించుకోవడం, తిరిగి అమర్చుకోవడం సులువవుతుంది.

బెడ్‌ అల్మరా అయితే..?!

పెద్ద పెద్ద మంచాలున్న వారు దానికి అనుసంధానిస్తూ ఒకే వైపు లాక్కునేలా స్టోరేజ్‌ బాక్సును తయారుచేయించుకుంటే.. అందులోని వస్తువుల్ని తీసుకోవడం, అమర్చుకోవడం కాస్త ఇబ్బంది కావచ్చు. అలాంటప్పుడు నలువైపులా లేదంటే మూడు వైపులా ర్యాక్స్‌ తయారుచేయించుకోవచ్చు. ఒకవేళ అలా వీలు కాని పక్షంలో.. మంచం కింది భాగంలో దాన్ని అనుసంధానిస్తూ చెక్కతో చిన్న చిన్న అల్మరాల్లా తయారుచేయించుకోవచ్చు. దానికి కప్‌బోర్డ్స్‌ లేకపోయినా.. చిన్న చిన్న మెష్‌ బాక్సులు, వీల్‌ బాక్సుల్లో మీరు ఉంచాలనుకుంటున్న వస్తువుల్ని అమర్చి.. ఆయా అల్మరాల్లో పొందిగ్గా సర్దుకోవచ్చు. అయితే అడుగు నుంచి కాస్త ఖాళీ వదిలిపెట్టి ఈ అల్మరాలు తయారుచేయించుకుంటే ఎప్పటికప్పుడు బెడ్‌ కింద శుభ్రం చేయడం సులువవుతుంది.

బెడ్‌ రైజర్స్‌ అందుకే..!

ర్యాక్‌లైనా, బ్యాగ్‌లైనా మంచం కింద పట్టినంతవరకే అమర్చగలుగుతాం. అయినా ఇంకొన్ని వస్తువులు మిగిలినా బెడ్‌ కిందే అమర్చాలనుకున్న వారు బెడ్‌ రైజర్స్‌ని ఎంచుకోవచ్చు. మంచానికి నలువైపులా ఉన్న కోళ్లను ఈ రైజర్స్‌పై ఉంచడం వల్ల మంచం కాస్త పైకెత్తినట్లవుతుంది. తద్వారా మంచం కింద ఇంకాస్త ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అయితే వీటిలోనూ ప్లాస్టిక్‌ కంటే చెక్కతో చేసిన రైజర్స్‌ అయితే దృఢంగా ఉంటాయి. అది కూడా మరీ ఎక్కువ ఎత్తులో ఉన్నవి కాకుండా మీడియం ఎత్తులో ఉన్నవి ఎంచుకుంటే మంచంపై కూర్చున్నప్పుడు, మంచం దిగుతున్నప్పుడు సౌకర్యంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని