ఆశనిరాశలు సహజమేనోయి.. టేకిట్ ఈజీ
close
Updated : 09/11/2021 20:43 IST

ఆశనిరాశలు సహజమేనోయి.. టేకిట్ ఈజీ!

మన జీవితంలో అనుకోకుండా ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అలాగే కెరీర్‌లో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి. అనుకున్న ప్రమోషన్‌ దక్కకపోవడం, చేసిన పనికి సరైన గౌరవం లభించకపోవడం, ఇతరులు తమ స్వార్థం కోసం మనపై నిందలు వేయడం, అసలు నచ్చని కెరీర్‌ని ఎంచుకోవాల్సి రావడం... వంటివి జరుగుతుంటాయి. దాంతో కొంతమంది కెరీర్‌ మధ్యలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కొన్ని టిప్స్‌ పాటిస్తే ఆ ఇబ్బందుల నుంచి దూరం కావచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి...

బ్రేక్.. కొన్ని రోజులే!

కెరీర్‌లో అనుకోని సంఘటన జరిగినప్పుడు బాధపడడం సహజం. ఇలాంటి క్రమంలో చాలామంది బ్రేక్‌ తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. అయితే అది మంచిదే అయినప్పటికీ దానికి కూడా కొంత వ్యవధిని మీకు మీరే నిర్ణయించుకోవాలి. బ్రేక్‌ సమయంలో మీ అభిరుచులకు తగ్గట్టుగా భవిష్యత్తులో ఏం చేయాలో ప్రణాళికలు రచించుకోవాలి. అందుకు మీ శక్తిసామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించాలి.

పాఠాలు నేర్చుకోవాలి..

వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో లాభం జరిగినా, నష్టం జరిగినా దానిలో మనకు కావాల్సిన పాఠాలు ఎన్నో దాగి ఉంటాయి. ప్రత్యేకించి మనం చేపట్టిన పనుల్లో ప్రతికూల ఫలితాలు ఎదురైనట్లయితే వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవాలి. ఒకవేళ ఆ పనిని మరోలా చేసుంటే ఏం జరిగుండేది? అనే విషయాన్ని కూడా పరిశీలించుకోవాలి. అలాగే ఆ నష్టం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవాలి? అని ఆలోచించాలి. అంతేకానీ, జరిగిన నష్టం గురించి చింతిస్తూ టైం వేస్ట్ చేయకూడదు.

ఆవేశం వద్దు!

కెరీర్‌లో అనుకోని సంఘటన జరిగితే కొంతమంది తీవ్ర నిరుత్సాహానికి గురై ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. నిశితంగా ఆలోచిస్తే కానీ, దానివల్ల కలిగే నష్టాలు అంచనా వేయలేరు. ఆవేశ పూరిత ధోరణి వల్ల ఇతరులపై కోపం పెరగడమే కాకుండా మీ తప్పులను తెలుసుకునే సామర్థ్యం కూడా ఉండదు. కాబట్టి, మీకు నచ్చని సంఘటన జరిగనప్పుడు శాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఏం చేయాలో మీకే అర్థమవుతుంది.

ఆ నమ్మకం ఉండాలి..!

ఓ సినిమాలో -‘ఆశ క్యాన్సర్ ఉన్న వాడిని కూడా బతికిస్తుంది. భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది’ అంటాడో హీరో. అలాగే కెరీర్‌లో కూడా ఏదో అనుకోని పరిస్థితి ఎదురైందని మీపై మీరు నమ్మకాన్ని కోల్పోకూడదు. ఓటమిని మర్చిపోయి గెలుపు కోసం ప్రయత్నించండి. కెరీర్‌లో ఉన్నతి సాధించిన ఎంతోమంది తమ వృత్తిగత జీవితంలో మొదట్లో ఎన్నో సవాళ్లను, అవమానాలను, ఛీత్కారాలను ఎదుర్కొన్న వారే. గుర్తుంచుకోండి!


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని