భాగస్వామిపైనా అసూయ పడుతున్నారా?

అవతలి వారు కెరీర్‌లో ఎదుగుతుంటే ఓర్వలేకపోవడం, అన్యోన్యంగా మెలిగే దంపతుల్ని చూసి అసూయపడడం.. ఇలాంటి ఫీలింగ్‌ చాలామందిలో ఉంటుంది. అయితే ఇది కేవలం బయటి వారి పైనే కాదు.. ఇంట్లోనూ, అదీ జీవిత భాగస్వామి పైనా ఈర్ష్య పడే వారూ లేకపోలేదంటున్నారు.....

Published : 27 Jan 2023 20:51 IST

అవతలి వారు కెరీర్‌లో ఎదుగుతుంటే ఓర్వలేకపోవడం, అన్యోన్యంగా మెలిగే దంపతుల్ని చూసి అసూయపడడం.. ఇలాంటి ఫీలింగ్‌ చాలామందిలో ఉంటుంది. అయితే ఇది కేవలం బయటి వారి పైనే కాదు.. ఇంట్లోనూ, అదీ జీవిత భాగస్వామి పైనా ఈర్ష్య పడే వారూ లేకపోలేదంటున్నారు నిపుణులు. తద్వారా దాంపత్య బంధంలో కలతలు రేగడం, ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోవడం.. చినికి చినికి చివరికి ఇది విడాకులకూ దారితీయచ్చు. కాబట్టి ముందే దీన్ని గుర్తించి.. జాగ్రత్తపడితే అనుబంధంలో అరమరికల్లేకుండా ముందుకు సాగచ్చంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ఈర్ష్య, అసూయ, ద్వేషం.. ఇలాంటి భావోద్వేగాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఏదో ఒక సమయంలో అవి బహిర్గతమవుతాయి. అయితే ఇవి మితిమీరి హద్దు దాటినప్పుడే అనుబంధంలో అసలు చిక్కులు మొదలవుతాయంటున్నారు నిపుణులు. వివాహ కౌన్సెలర్లు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. కౌన్సెలింగ్‌ తీసుకునే దంపతుల్లో మూడింట ఒక వంతు మంది.. తమ మధ్య గొడవలకు కారణం అసూయే అని చెబుతున్నారట!

ఆంక్షలతో విసుగెత్తితే..!

దంపతుల మధ్య అసూయకు కారణమయ్యే అంశాలు కొన్నున్నాయంటున్నారు నిపుణులు.

ఇతరులతో పోల్చుకోవడం, మనల్ని మనం తక్కువ చేసి చూసుకోవడం వల్ల మనలో అభద్రతా భావం పెరిగిపోతుంది. తద్వారా మనలో లేని ప్రత్యేకత వారిలో ఉందంటూ వారిపై అసూయ పడతాం.

వివాహేతర సంబంధం కావచ్చు.. లేదంటే ప్రస్తుత అనుబంధంలో కలతలు కావచ్చు.. ఇలా కారణమేదైనా భాగస్వామి తమను శాశ్వతంగా వదిలేస్తారేమోనన్న భయం కూడా వారిపై అసూయ పడేలా చేస్తుందంటున్నారు నిపుణులు.

తమ జీవిత భాగస్వామి తాను గీసిన గీత దాటకూడదనుకుంటారు కొంతమంది. ఈ క్రమంలో అతి ప్రేమ చూపిస్తుంటారు. లేనిపోని ఆంక్షలు వారిపై రుద్దుతుంటారు. నిజానికి ఇవన్నీ ఎదుటివారికి విసుగు తెప్పించేవే! ఇక ఆపై వారు మిమ్మల్ని పట్టించుకోకపోవడం, ఇతర విషయాలపై శ్రద్ధ పెట్టడం.. ఇవన్నీ చూశాక వారిపై ఈర్ష్య కలగడం సహజం.

అనుబంధానికి నమ్మకమే పునాది. అది కోల్పోయినా అభద్రతా భావం కలుగుతుంది. క్రమంగా ఇది భాగస్వామిపై అసూయ పడేలా చేస్తుంది.

పెళ్లి తర్వాత జీవితం ఇలాగే ఉండాలన్న నియమం పెట్టుకుంటారు కొంతమంది. కానీ తీరా అలా జరగకపోయేసరికి నిరాశ పడుతుంటారు. ఇందులో నుంచే ఎదుటివారిపై ఈర్ష్యా ద్వేషాలు, అసూయ పుడుతుంటాయి.

మూలాలు తెలుసుకోండి!

అతి ఏదైనా అనర్థదాయకమే అన్నట్లు.. ఈ సామెత అసూయకు కూడా వర్తిస్తుందంటున్నారు నిపుణులు. సాధారణంగా భాగస్వామిని నిజాయతీగా ప్రేమించడం, అనుబంధానికి కట్టుబడి ఉండడం, తామిద్దరం ఎప్పటికీ ఇలాగే సానుకూల దృక్పథంతో ఉండాలనుకోవడం.. ఇవన్నీ మంచి విషయాలే! అయితే ఇవి హద్దు మీరితే భాగస్వామిపై ప్రేమకు బదులు అజమాయిషీ ధోరణి పెరిగిపోతుంది. ఇది క్రమంగా అసూయకు దారి తీయకుండా జాగ్రత్తపడాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

అనుబంధంలో అసూయను దూరం చేసుకోవాలంటే.. ముందు అది ఎక్కడ్నుంచి మొదలైందనే విషయాన్ని పసిగట్టడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం వల్ల సమస్య మూలాలు పట్టుకొని.. ఇకపై అది పునరావృతం కాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

దాంపత్య బంధంలోకి చొరబడిన అసూయను దూరం చేసుకోవాలంటే.. ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించుకున్నప్పుడే అది సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ప్రతి విషయంలో పారదర్శకంగా ఉండడం, ఒకరి పట్ల మరొకరు నమ్మకం-నిజాయతీతో ఉండడం చాలా ముఖ్యమంటున్నారు.

ఆలుమగల మధ్య అసూయను దూరం చేసే శక్తి శృంగారానికీ ఉంది. కాబట్టి అరమరికలన్నీ పక్కన పెట్టి దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలి. తద్వారా అసూయే కాదు.. ఏ శక్తీ మీ మధ్య చిచ్చు పెట్టలేదు.

భాగస్వామి ప్రవర్తనతో సంబంధం లేకుండా కొంతమంది వాళ్లు చేసే ప్రతి పనిలోనూ అసూయ పడుతుంటారు.. దీనివల్ల మానసికంగా నష్టపోయేది మీరే అని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ప్రతికూలతల నుంచి బయట పడాలంటే.. మనసుకు నచ్చిన పనులు చేయడం, స్వీయ ప్రేమ పెంచుకోవడం.. వంటివి చక్కటి మార్గాలు.

ఇక ఇన్ని చేసి ప్రయోజనం లేకపోయినా, మీ భాగస్వామి మారకపోయినా.. ఇద్దరూ కలిసి మానసిక నిపుణులు/వివాహ కౌన్సెలర్లను కలిసి కౌన్సెలింగ్‌ తీసుకోవడం మంచిది. తద్వారా అనుబంధం నిలిచే మార్గం దొరుకుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్