Mom Guilt: పిల్లల విషయంలో ఆ ఫీలింగ్ వేధిస్తోందా?

మన సమాజంలో మహిళలపై ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. వాటిని పాటిస్తేనే మంచి అమ్మాయి, మంచి భార్య, మంచి తల్లిగా గుర్తిస్తుంటారు. లేదంటే వారికి రకరకాల పేర్లు పెట్టి నిందిస్తుంటారు. నేటి తరం మహిళలు ఇలాంటి కట్టుబాట్ల నుంచి బయటకు వస్తున్నా చాలామందికి ఇలాంటి అనుభవాలు....

Published : 28 Jul 2022 18:29 IST

మన సమాజంలో మహిళలపై ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి. వాటిని పాటిస్తేనే మంచి అమ్మాయి, మంచి భార్య, మంచి తల్లిగా గుర్తిస్తుంటారు. లేదంటే వారికి రకరకాల పేర్లు పెట్టి నిందిస్తుంటారు. నేటి తరం మహిళలు ఇలాంటి కట్టుబాట్ల నుంచి బయటకు వస్తున్నా చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనివల్ల చాలామంది మహిళలు తమ పనిని సరిగా చేయలేక ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. వీరిలో ఎక్కువ శాతం తల్లైన మహిళలే ఉంటున్నారట. మనదేశంలో 76 శాతం మంది తల్లులు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేకపోతున్నారని.. దానివల్ల ఒత్తిడికి గురవుతున్నారని (మామ్‌ గిల్ట్) ఓ సర్వేలో వెల్లడైంది. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మదర్‌ గిల్ట్‌ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం రండి...

వాటిని నమ్మద్దు...

ఈ రోజుల్లో చాలామంది జీవితాలపై సామాజిక మాధ్యమాలు ప్రభావం చూపిస్తున్నాయి. మదరి గిల్ట్‌కు ఇది కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది తమ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారో తెలియజేస్తూ వ్లాగ్స్ రూపంలో వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారు. మరికొంతమంది ఉత్తమ తల్లి అంటే ఇలా ఉంటుందని కొన్ని రకాల సూక్తులను పెడుతుంటారు. అయితే వీటిని చూసిన కొంతమంది తల్లులు ఆ పోస్టులను తమకు ఆపాదించుకుని తమ పిల్లలకు సరిగా న్యాయం చేయలేకపోతున్నామని దిగులుపడుతుంటారు. అయితే చాలామంది సోషల్‌ మీడియాలో తమ జీవితంలోని మధుర జ్ఞాపకాలనే ఎక్కువగా పోస్ట్‌ చేస్తుంటారు. దాని వెనక ఉన్న కష్టాన్ని చూపించరు. కాబట్టి, వాటిని వ్యక్తిగతంగా ఆపాదించుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా పోస్ట్ వల్ల మీకు అలాంటి భావన కలిగితే వాటి నుంచి దూరం జరగడమే మంచిదని సూచిస్తున్నారు.

ఆఫీసుకెళ్తున్నారా?

ఆఫీసుకెళ్లే మహిళలకు ‘మదర్‌ గిల్ట్‌’ ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. దీనికి ప్రధాన కారణం ఆఫీసుకెళ్లడం వల్ల తమ పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నామన్న భావనే అని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి, ఇది మీ ఒక్కరి సమస్య మాత్రమే కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలనుకుంటున్నారు నిపుణులు. మారుతున్న జీవనశైలిలో భాగంగా ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతున్నాయి. కాబట్టి, ఈ విషయంపై ఎక్కువ ఒత్తిడి చెందకూడదని సూచిస్తున్నారు. దీనికి బదులుగా ఇంటికెళ్లిన తర్వాత వారితో ఎక్కువ సమయం గడపడం, సెలవు రోజుల్లో విహార యాత్రలకు తీసుకెళ్లడం ద్వారా ఆ లోటును తీర్చుకోవచ్చని చెబుతున్నారు.

వారిని పట్టించుకోవద్దు...

తల్లైన తర్వాత పిల్లలను అలా చూసుకోవాలి.. ఇలా పెంచాలి.. అంటూ వివిధ రకాలుగా చెబుతుంటారు. అవి పాటించకపోతే పిల్లలను సరిగా చూసుకోదని నిందిస్తుంటారు. ఇలాంటి మాటలను పట్టించుకుని దిగులు పడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కొన్ని సందర్భాల్లో పిల్లలు అడిగినప్పుడు వారికి సమయం కేటాయించలేకపోవచ్చు. ఇలాంటప్పుడు కూడా అపరాధ భావనకు గురి కావద్దని సూచిస్తున్నారు. ఉదాహరణకు మీరు ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు మీ పాప తనతో ఆడమని అదేపనిగా అడగచ్చు. మీరు ఒకవేళ తనతో ఆడకుండా మీ పని చేసుకున్నప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు సమయం కుదిరినప్పుడు వారితో ఆడండి. అప్పుడు వారు సంతోషపడతారు. అదే పద్ధతి క్రమంగా వారికీ అలవాటవుతుంది.

మీ ఆరోగ్యమూ ముఖ్యమే..

పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది తల్లులు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఈ క్రమంలో వారికంటూ సమయాన్ని కేటాయించుకోలేరు. దీనివల్ల ఒత్తిడికి లోనవుతుంటారు. మీరు బాగుంటేనే మీ పిల్లలను చక్కగా చూసుకోగలుగుతారు. కాబట్టి, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే అన్ని విషయాల్లోనూ ఎవరూ పర్‌ఫెక్ట్‌గా ఉండలేరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీ సమయాన్ని వీలైనంతవరకు పిల్లలకు కేటాయిస్తే ఇతరుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని