ఆ బంధం.. ఈ భయాలు వీడితేనే ఆనందకరం!

అనవసర భయాల్ని దూరం చేసుకొని ఆలుమగలిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాలని, అప్పుడే శృంగార జీవితాన్ని సంతృప్తికరంగా మలచుకోవచ్చంటున్నారు. మరి, ఆ భయాలేంటి? వాటిని ఎలా జయించాలో తెలుసుకుందాం రండి..

Published : 29 Jul 2023 20:14 IST

శృంగారాన్ని కూడా ఓ తప్పనిసరి దినచర్యలా భావిస్తుంటారు కొంతమంది. కనీసం భాగస్వామి ఇష్టాయిష్టాలేంటి, వాళ్ల మనసులోని కోరికలేమిటో తెలుసుకోవడానికి, పంచుకోవడానికీ సిగ్గుపడుతుంటారు. వీటికి తోడు కొంతమందిలో ఉండే కొన్ని భయాలు కూడా శృంగార జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించకుండా అడ్డుపడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ తరహా భయాలు మగవారిలో కంటే మహిళల్లోనే ఎక్కువని కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి. నిజానికి ఇవి దంపతుల మధ్య అగాథం సృష్టించడమే కాదు.. శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తున్నాయంటున్నారు. అందుకే అనవసర భయాల్ని దూరం చేసుకొని.. ఈ విషయంలో ఆలుమగలిద్దరూ తమ మనసు విప్పి మాట్లాడుకోవాలని, అప్పుడే శృంగార జీవితాన్ని సంతృప్తికరంగా మలచుకోవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఆ భయాలేంటి? వాటిని ఎలా జయించాలో తెలుసుకుందాం రండి..

గర్భవతిని అవుతానేమో?!

పెళ్లైనా మాకు అప్పుడే పిల్లలొద్దు.. అనుకునే దంపతులు కొందరుంటారు. ఇలాంటి వారు శృంగారంలో పాల్గొనడానికి వెనకాముందూ అవుతుంటారు. ఎందుకంటే దీనివల్ల గర్భం ధరిస్తానేమోనన్న భయం ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కలయికను ఆస్వాదించలేకపోతారు. అయితే ప్రస్తుతం అవాంఛిత గర్భం ధరించకుండా ఉండేందుకు బోలెడన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. గర్భ నిరోధక మాత్రలు, సాధనాలు.. వంటివి అందులో కొన్ని! నిపుణుల సలహా మేరకు వీటిని ఉపయోగిస్తే సరిపోతుంది. ఇదేమీ కొత్త విషయం కాకపోయినా.. వీటిని ఉపయోగిస్తూ కూడా.. ఇవి సరిగ్గా పనిచేస్తాయో, లేదోనన్న సందేహంతో శృంగారంలో పాల్గొనడానికి భయపడే వారూ లేకపోలేదు. ఇలాంటి వారు రుతుచక్రాన్ని బట్టి అండం విడుదలయ్యే రోజుల్ని లెక్కించి.. ఆ సమయంలో దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

ఆ భయంతో..!

పెళ్లైన కొత్తలో చాలామంది ఆడవాళ్లు శృంగారం చేసే క్రమంలో వచ్చే నొప్పికి భయపడి కలయికలో పాల్గొనడానికి భయపడుతున్నారని తమ వద్దకొచ్చే ఫిర్యాదుల్ని బట్టి చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల కూడా భార్యాభర్తలు లైంగిక జీవితం గురించి ఒకరి మనసులో దాగున్న ఆలోచనలు, కోరికలు నిస్సంకోచంగా పంచుకోలేకపోతున్నారట! అందుకే భయమనే ఈ అడ్డు తెర తొలగిపోవాలంటే.. నొప్పి రాకుండా ఉండేందుకు తగిన ప్రత్యామ్నాయాల గురించి అన్వేషించాలి. ఈ క్రమంలో లూబ్రికెంట్లు, జెల్స్‌, మాయిశ్చరైజర్లు.. వంటివి నిపుణుల సలహా మేరకు ఉపయోగించచ్చు. అయితే కొంతమందిలో ఈ తరహా నొప్పి నిరంతరంగా వేధిస్తుంటుంది. కలయికే కాదు.. వెజైనల్‌ ఇన్ఫెక్షన్లు కూడా ఇందుకు కారణం కావచ్చు. కాబట్టి దీన్నుంచి ఉపశమనం పొందడానికి నిపుణుల్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

అందంగా లేనా..?

శరీరాకృతి, అందం.. వంటి అంశాల్లో కొంతమంది మహిళలు సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొంటుంటారు. అయితే ఇలాంటి విమర్శలు తమ భాగస్వామి నుంచి ఎక్కడ ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడే వారూ లేకపోలేదు. తాను అందంగా ఉండననో, తన భాగస్వామికి ఆకర్షణీయంగా కనిపించలేనేమోనన్న బిడియంతో కలయికలో పాల్గొనడానికి 90 శాతం మంది మొహమాటపడుతున్నట్లు కొన్ని అధ్యయనాలు తేల్చాయి. ఒకవేళ శృంగారంలో పాల్గొన్నా ఈ భయంతో దాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. ఆడవాళ్లలోనే కాదు.. కొంతమంది మగవాళ్లలోనూ ఈ తరహా ధోరణి కనిపిస్తుంటుంది. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.. ఆత్మన్యూనతకు, అభద్రతా భావానికి లోనయ్యేలా ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ భయాన్ని జయించాలంటే స్వీయ ప్రేమ ముఖ్యమంటున్నారు నిపుణులు. తాను ఎలా కనిపిస్తే తన భాగస్వామికి నచ్చుతుందో వారిని అడిగి తెలుసుకోవడం, వారి మనసులో ఉన్న కోరికలు తెలుసుకొని నడుచుకోవడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం దృఢమవుతుంది. ఇదే ఆ జంటను మరింత దగ్గర చేస్తుంది.

పరిశుభ్రత ముఖ్యం!

శృంగార జీవితానికి, వ్యక్తిగత పరిశుభ్రతకు దగ్గరి సంబంధం ఉంది. లైంగిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇది తోడ్పడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొంతమంది దంపతులు వ్యక్తిగత పరిశుభ్రతకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. దీనివల్ల ఆలుమగల మధ్య దూరం పెరుగుతుంది. ఇలా జరగకూడదంటే వ్యక్తిగత పరిశుభ్రతను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ క్రమంలో పరిమళాలు వెదజల్లే నూనెల్ని నీటిలో కలుపుకొని స్నానం చేయడం, జననేంద్రియాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, శృంగార సామర్థ్యాన్ని, లైంగిక కోరికల్ని పెంచే ఆహారానికి ప్రాధాన్యమివ్వడం, పడకగదిలో అరోమా క్యాండిల్స్‌ ఏర్పాటు చేసుకోవడం.. వంటివన్నీ ముఖ్యమే. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల అటు శృంగారాన్నీ ఆస్వాదించగలుగుతారు.. ఇటు అనుబంధాన్నీ పెంచుకోగలుగుతారు.

‘ఇన్ఫెక్షన్ల’ భయం వీడేలా..!

కలయిక ద్వారా కొన్ని రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు, హెచ్‌ఐవీ.. వంటి ప్రాణాంతక వ్యాధులు కొంతమంది దంపతుల్ని లైంగిక జీవితానికి దూరం చేస్తుంటాయి. అయితే దీనికీ కొన్ని ప్రత్యామ్నాయాలు లేకపోలేదంటున్నారు నిపుణులు. శృంగారంలో పాల్గొనేటప్పుడు వివిధ సురక్షిత పద్ధతులు పాటించడం, ఆయా వ్యాధులు/ఇన్ఫెక్షన్లు సోకకుండా నిపుణుల సలహా మేరకు వ్యాక్సిన్లు వేయించుకోవడం.. వంటి వాటి వల్ల ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.

మొత్తమ్మీద శృంగార జీవితాన్ని ఆస్వాదించడం వల్ల అటు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి.. ఇటు అనుబంధాన్నీ పెంపొందించుకోవచ్చు. కాబట్టి ఆలుమగలిద్దరూ శృంగారం విషయంలో ఉండే వివిధ భయాలను జయించాలి. అవసరమైతే సంబంధిత నిపుణుల్ని సంప్రదించి వీలైనంత త్వరగా తగిన చికిత్స తీసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని