ఈ జాగ్రత్తలతో అందంగా.. నవయవ్వనంగా..!

'వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా.. నీ ఒంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా..' అంటూ తన ప్రేయసి అందాలను అంతకంటే అందంగా అక్షరీకరించాడో సినీకవి. ఇలా తమ అందాల గురించి పొగుడుతుంటే మురిసిపోయే అమ్మాయిలెందరో! అందుకే తమ అందాన్ని సంరక్షించుకునేందుకు రకరకాల చిట్కాలు అనుసరిస్తూ ఉంటారు.

Updated : 30 Jul 2021 19:20 IST

'వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయా.. నీ ఒంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా..' అంటూ తన ప్రేయసి అందాలను అంతకంటే అందంగా అక్షరీకరించాడో సినీకవి. ఇలా తమ అందాల గురించి పొగుడుతుంటే మురిసిపోయే అమ్మాయిలెందరో! అందుకే తమ అందాన్ని సంరక్షించుకునేందుకు రకరకాల చిట్కాలు అనుసరిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న కాలుష్యం, జీవనశైలితో ఇలా అందంగా కనిపించాలంటే అందుకు సౌందర్యపరంగా తగిన సంరక్షణ చర్యలు తీసుకుంటూనే నవయవ్వనంగా మెరిసిపోయేందుకు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. మరి, ఆ జాగ్రత్తలేంటో మనమూ తెలుసుకుందామా..

అందంగా కనిపించాలంటే అందుకు చర్మం ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం అమ్మాయిలంతా సౌందర్యపరంగా రకరకాల చిట్కాలు అనుసరిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత జీవనశైలి, రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా వృద్ధాప్య ఛాయలు చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా చర్మాన్ని ఎక్కువ కాలం పాటు నవయవ్వనంగా మెరిపించుకోవచ్చు.

తగినంత తేమ..

చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మెరుస్తూ కనిపించాలంటే తగినంత తేమ కలిగి ఉండడం చాలా అవసరం. కాబట్టి నాణ్యమైన మాయిశ్చరైజర్ లేదా డే క్రీమ్ ద్వారా రోజూ చర్మానికి తగినంత తేమ అందేలా జాగ్రత్తపడాలి. అలాగే సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షించే సన్‌స్క్రీన్‌లా కూడా ఈ క్రీమ్ ఉపయోగపడేదైతే మరీ మంచిది. వీటితో పాటు ఆ క్రీమ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటే చర్మానికి తగిన పోషణ అంది మరింత ఆరోగ్యంగా కనిపించే అవకాశాలుంటాయి. ఇవి అలసిపోయిన చర్మానికి తిరిగి జీవం పోసి తాజాగా కనిపించేలా చేస్తాయి.

కళ్ల సంరక్షణ..

వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించేది కళ్ల చుట్టూనే..! చర్మంపై చిన్న చిన్న గీతలు పడడం, ముడతలు రావడం, చర్మం వదులుగా మారిపోవడం.. మొదలైన లక్షణాలన్నీ వాటికి సంబంధించినవే! అయితే చర్మ ఆరోగ్యంలో భాగంగా కళ్లను కూడా జాగ్రత్తగా సంరక్షించుకుంటేనే నవయవ్వనంగా కనిపించే వీలుంటుంది. ఇందులో భాగంగా హెర్బల్ ఆధారిత ఐ క్రీమ్స్ ఉపయోగించడం, కళ్ల కింద నల్లటి వలయాలు రాకుండా సహజసిద్ధమైన చిట్కాలను అనుసరించడం, అలసిన కళ్లను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం.. వంటివి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మనం ఉపయోగించే ఐ క్రీమ్ ఏదైనా సరే.. ఇవన్నీ సమర్థంగా చేయగలిగేదైతే కళ్లను చాలా వరకు సంరక్షించుకున్నట్లే!

చక్కెర ఉన్న పదార్థాలు తక్కువగా..

స్వీట్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? నిజమే.. కానీ ఆరోగ్యవంతమైన, యవ్వనంగా కనిపించే చర్మం కావాలనుకుంటే మాత్రం చక్కెర మితంగా ఉండే పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవాలంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు. సాధారణంగా చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తిన్నప్పుడు అవి రక్తంలో కలిసిన తర్వాత చక్కెర విడిపోయి కొలాజెన్, ఎలాస్టిన్‌లలోని ప్రొటీన్‌లతో బంధం ఏర్పరుచుకుంటాయి. ఫలితంగా వాటి స్థాయులు తగ్గిపోతాయి. దాంతో చర్మం సాగిపోయినట్లు, వదులుగా మారినట్లు తయారవుతుంది. కాబట్టి చక్కెర ఎంత తక్కువగా తీసుకుంటే చర్మం అంత ఆరోగ్యంగా ఉంటుందని వారు సూచిస్తున్నారు.

ఒత్తిడికి దూరంగా..

చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు తనకి తానుగా రిపేర్ చేసుకునే స్వభావం మన చర్మానికి ఉంటుంది. కానీ మనం అధికంగా ఒత్తిడికి గురికావడం వల్ల ఈ ప్రక్రియకు అడ్డంకి ఏర్పడి చర్మం అలసిపోయినట్లు మారిపోతుంది. దీనికి కారణం ఒత్తిడి కలిగినప్పుడు శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ అనే హార్మోన్. ఇది కొలాజెన్, ఎలాస్టిన్‌లను ప్రభావితం చేయడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి రోజువారీ పనుల కారణంగా ఎదురయ్యే అలసట, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందడానికి యోగా, ధ్యానం.. వంటి మార్గాలను ఆశ్రయించడం చాలా మంచిది. ఫలితంగా అటు మానసిక ఆందోళనల నుంచి విముక్తి పొందుతూనే ఇటు చర్మాన్ని నవయవ్వనంతో మెరిపించేయవచ్చు.

ఈ జాగ్రత్తలు కూడా..

* మెనోపాజ్ దశకి చేరుకున్న వారిలో ఈస్ట్రోజెన్ స్థాయుల్లో జరిగే మార్పుల కారణంగా చర్మం పొడిబారి, ముడతలు పడి, సాగినట్లుగా కనిపిస్తుంది. ఇటువంటప్పుడు తరచూ మాయిశ్చరైజర్ రాసుకోవడం ద్వారా చర్మానికి తగినంత తేమ అందించడం చాలా అవసరం. అలాగే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి తగిన చికిత్స కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

* రాత్రి సమయంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా సుమారు 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం కూడా ఆరోగ్యవంతమైన చర్మానికి ఎంతో ఆవశ్యకం.

* విటమిన్స్ అధికంగా ఉండే తాజా పండ్లు, సలాడ్స్, పండ్ల రసాలు.. ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి చక్కగా ఉపకరిస్తాయి. ఓవైపు చర్మానికి తగిన తేమని అందిస్తూనే మరోవైపు ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాయి.

* రాత్రి సమయంలో చర్మ సంరక్షణలో భాగంగా నైట్ క్రీం ఉపయోగించడం ద్వారా కూడా చర్మానికి తగిన పోషణ అందించవచ్చు. అలసిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చి మెరుపులీనేలా చేయచ్చు.

చర్మం నవయవ్వనంతో అందంగా మెరిసిపోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకున్నారు కదా! ఈసారి మీరు కూడా వీటిని అనుసరించండి. వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందంతో అందరి ప్రశంసలు అందుకోండి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్