Heavy Rains: వ్యాధుల కాలం.. పిల్లల విషయంలో జాగ్రత్త!
చిరుజల్లులతో పాటు బోలెడు వ్యాధులను కూడా తీసుకొస్తుంది వర్షాకాలం. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు ముప్పేట దాడి చేస్తాయి. ఈ క్రమంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.
చిరుజల్లులతో పాటు బోలెడు వ్యాధులను కూడా తీసుకొస్తుంది వర్షాకాలం. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు ముప్పేట దాడి చేస్తాయి. ఈ క్రమంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలపై వీటి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వీటికి తోడు దోమలు, కలుషిత నీరు-ఆహారం పిల్లల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడతాయి. ఈ క్రమంలో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలంటున్నారు వైద్యులు.
ఈ జ్వరాల విషయంలో..
వర్షపు నీటిలో ఎక్కువగా ఆడుకోవడం, బయట దొరికే ఆహారపదార్థాలను తినడం, కాస్త తేమగా ఉన్న దుస్తులు ధరించడం.. ఇలా వర్షాకాలంలో పిల్లలు చేసే కొన్ని పొరపాట్లు వివిధ అనారోగ్యాల్ని తెచ్చిపెడతాయి. ఇక వాతావరణంలోని అధిక తేమ దోమల వ్యాప్తికి కారణమవుతుంది. ఫలితంగా డెంగ్యూ, మలేరియా, న్యుమోనియా.. వంటి వ్యాధులు పిల్లలను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి మొదలైనవి.. వీటి ప్రాథమిక లక్షణాలు. ముఖ్యంగా డెంగ్యూ, న్యుమోనియా విషయాల్లో ఏమరపాటు తగదని, వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఆహారం, నీళ్లు కూడా!
వర్షాకాలంలో దోమల వ్యాప్తి కారణంగా ఆహారం, నీరు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇలా కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల టైఫాయిడ్, డయేరియా, కామెర్లు వంటి వ్యాధులు తలెత్తుతాయి. వర్షాకాలంలో పూర్తిగా ఆరని దుస్తులు-చెప్పులు వేసుకోవడం వల్ల పిల్లల్లో గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇక వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు.. వంటి సీజనల్ సమస్యలు తలెత్తడం సహజం. అయితే ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలున్న పిల్లలపై ఇవి మరింత ప్రతికూల ప్రభావం చూపుతాయి!
పిల్లలను ఇలా కాపాడుకుందాం!
వర్షాకాలంలో పిల్లల్లో తలెత్తే ఇలాంటి అనారోగ్యాల నుంచి వారిని కాపాడుకోవాలంటే తల్లులు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
⚛ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేలా పండ్లు, పాలు, గుడ్లు, నట్స్..మొదలైనవి ఎక్కువగా తినిపించాలి.
⚛ కూరగాయలు, పండ్లను ఉప్పు నీటితో శుభ్రం చేసిన తర్వాతే పిల్లలకు అందించాలి.
⚛ మసాలాలు, ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి. వీలైనంత వరకు ఇంట్లో తయారుచేసిన ఆహారానికే ప్రాధాన్యమివ్వాలి.
⚛ భోజనానికి ముందు, వాష్‌రూంకు వెళ్లొచ్చిన తర్వాత పిల్లలు తమ చేతులు శుభ్రంగా కడుక్కునేలా జాగ్రత్త వహించాలి.
⚛ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండేందుకు వీలుగా పిల్లలు తడి దుస్తులు, చెప్పులు, సాక్స్‌లు ధరించకుండా చూడాలి.
⚛ దోమ కాటు నుంచి రక్షణ పొందేందుకు వీలుగా ఫుల్ స్లీవ్స్ ఉన్న దుస్తులనే పిల్లలకు తొడగాలి.
⚛ తులసి, లావెండర్.. వంటి మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకుంటే దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చు.
⚛ పూలకుండీలు, ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
⚛ ఇంట్లోని చెత్తను ఏరోజుకారోజు బయట పడేయాలి.
⚛ ఆహార పదార్థాలు, తాగేనీటిపై దోమలు వాలకుండా మూతలు పెట్టాలి.
⚛ వర్షాకాలంలో సీజనల్ అలర్జీలు సాధారణమే అయినప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి క్రమంగా డెంగ్యూ, న్యుమోనియా వంటి వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.