Updated : 25/02/2022 18:09 IST

ప్రతి రాత్రీ ఇలా చేస్తే రెట్టింపయ్యే అందం!

సాధారణంగా మనకొచ్చే మొటిమలు, బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌, కంటి కింద నల్లని వలయాలు.. ఇలాంటి సమస్యలన్నింటికీ కారణాలేంటో మీకు తెలుసా? మన చర్మం మీదున్న దుమ్ము, ధూళి అలాగే ఉండిపోవడం, మేకప్‌ తొలగించకపోవడం. ఈ రెండింటి కారణంగా మన చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అందుకే రాత్రి పూట చర్మం మీద కాస్త శ్రద్ధ చూపిస్తే వయసు ఏదైనా సరే.. చర్మం నవయవ్వనంతో మెరిసిపోతుంది.

మేకప్‌ని ఇలా తొలగించుకోవాలి..

మన శరీరం చర్మ కణాలను రిపేర్‌ చేస్తుంది. మేకప్‌ తొలగించకపోవడం వల్ల లోపలికి వెళ్లిన దుమ్ము కణాలను అది బయటకు పంపించడానికి వీలు లేకుండా పోతుంది. అయితే చాలామంది మేకప్‌ తొలగించుకోవడానికి క్లెన్సర్‌ని మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ మేకప్‌ రిమూవర్‌ని వాడడం మంచిది. దీనివల్ల చర్మపు పీహెచ్‌ మారకుండా ఉంటుంది. మేకప్‌ తొలగించుకోవడానికి ఒక కాటన్‌ బాల్‌ని తీసుకొని దాన్ని రిమూవర్‌లో ముంచి మసాజ్‌ చేస్తున్నట్టుగా తొలగించుకుంటే చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది.

వేడినీళ్లతో..

మేకప్‌ తొలగించడానికి క్లెన్సర్‌ వాడొద్దన్నాం కదా? అని పూర్తిగా వాడటం మానేయద్దు.. మేకప్‌ తొలగించకపోవడం వల్ల చర్మ రంధ్రాల్లో చేరిన దుమ్ము కణాలు అలాగే ఉండిపోతాయి. క్లెన్సర్‌తో నెమ్మదిగా మసాజ్‌ చేసుకొని గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. వేడినీటి వల్ల చర్మపు రంధ్రాలు తెరచుకుంటాయి. ఫలితంగా లోపలున్న దుమ్ము బయటకు వెళ్లిపోవడమే కాదు.. లోపలి నుంచి విడుదలయ్యే కొన్ని రకాల నూనెల వల్ల చర్మం కాంతివంతమవుతుంది.

ఐ క్రీమ్..

మన ముఖం మీద మిగిలిన అన్ని చోట్లా నూనె గ్రంథులుంటాయి. ఒక్క కంటి కింద తప్ప..! అందుకే ఈ ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది. కళ్ల కింద చర్మాన్ని కాపాడుకోవడానికి రోజూ రాత్రి ఐ క్రీమ్‌ని ఉపయోగించడం మంచి పద్ధతి.. దీనివల్ల కంటి కింది భాగంలో తేమ పెరిగి నల్లటి వలయాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందు కంటి కింద క్రీం అప్లై చేసి తర్వాత నెమ్మదిగా మసాజ్‌ చేయడం వల్ల రక్తప్రసరణ కూడా బాగుంటుంది. నల్లటి వలయాలు తొందరగా తగ్గుతాయి.

స్క్రబింగ్ చేయాలి..

రోజూ కాకపోయినా.. అప్పుడప్పుడైనా మన చర్మాన్ని స్క్రబింగ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల చర్మం మీద పేరుకున్న మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి. చర్మరంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. ఫలితంగా బ్లాక్‌ హెడ్స్‌, వైట్‌ హెడ్స్‌ వంటివి రాకుండా ఉంటాయి. అలాగని మరీ రోజూ స్క్రబింగ్ చేసేయకండి.. దీనివల్ల చర్మం గరుకుగా తయారవుతుంది. దీంతో పాటు మీ చర్మతత్వానికి సరిపడే స్క్రబ్‌ని ఎంచుకోవడం కూడా ప్రధానమే..

ఇవి కూడా..

* కంటి కింది భాగం లాగే పెదాలు కూడా సున్నితంగా ఉంటాయి. అందుకే పెదాలపై స్క్రబింగ్‌ చేయకూడదు. పెదాలను గోరువెచ్చని నీటితో కడిగి ఓ శుభ్రమైన బట్టతో తుడవాలి. మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. తర్వాత లిప్‌బామ్‌ పూయడం వల్ల వాటికి తేమ అందుతుంది. దీనివల్ల పెదాలు పగలకుండా ఉంటాయి.

*ఇవన్నీ చేసినా మాయిశ్చరైజర్‌ రాసుకోవడం చాలా అవసరం. ఫలితంగా మృత కణాలు, దుమ్ము, ధూళి తొలగిపోతాయి. తద్వారా చర్మం సున్నితంగా మారుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. చర్మానికి కావాల్సిన విటమిన్లు, ఇతర పోషకాలను మాయిశ్చరైజర్‌ అందిస్తుంది. దీంతో పాటు పీహెచ్‌ని కూడా కాపాడుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని