Published : 13/12/2022 21:13 IST

మతిమరపును ఇలా మరచిపోదాం..!

రోజూ మనం కలిసి మాట్లాడే స్నేహితురాలే.. అయినా ఉన్నట్టుండి ఒక్కొక్కసారి తన పేరు ఎంతకీ గుర్తు రాదు.. ఒక సినిమాని కనీసం పదిసార్త్లెనా చూసి ఉంటాం.. ఆ హీరోయిన్ పేరు చెప్పాలంటే మాత్రం తడబడతాం.. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తు రాదు. చాలామందికి ఈ పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది. వృత్తిపరమైన ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మతిమరపును పోగొట్టుకోవడమెలా? అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అయితే రోజూ కొన్ని పనులను చేయడం అలవాటుగా మార్చుకుంటే మతిమరపు నుంచి బయటపడచ్చంటున్నారు నిపుణులు.

పజిల్స్..

రోజూ పత్రికలు చదవడం చాలామందికి ఉండే అలవాటు. అయితే చాలా పత్రికల్లో సుడోకు, పజిల్స్, పొడుపు కథలు, లాజిక్‌తో ముడిపడి ఉండే ప్రశ్నలు వంటి వాటిని కూడా ప్రచురిస్తారు. అయితే అవన్నీ పిల్లల కోసం అని కొందరు వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ పజిల్స్ పూర్తి చేస్తున్నప్పుడు మన మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. ఎక్కడ ఏ పదం నింపామో కూడా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే రోజూ ఏదో ఒక సమయంలో వీటిని సాధన చేయడం ద్వారా మన మెదడుని కూడా చాలా విషయాలు గుర్తుంచుకునేలా చేయచ్చు.

యోగా..

మతిమరుపుకి మరో ప్రధాన కారణం తీవ్రమైన ఒత్తిడి. ఆఫీసులో ఎక్కువ సమయం విధులు నిర్వహించినా.. లేదంటే ఏ పనైనా సరిగా పూర్తికాకపోయినా.. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నించినా.. మన మెదడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆ సమయంలో చేతికి అందుబాటులో ఉన్న పెన్ను కోసం కూడా చాలా వెతుక్కుంటాం. అంటే తెలియకుండానే మనకు మతిమరపు వచ్చేస్తుంది. దీనికి యోగా ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది. యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి తగ్గిపోతుంది. దీనితో పాటు ఒత్తిడికి గురవుతున్నామనిపించిన సమయంలో దీర్ఘశ్వాస తీసుకోవడం ద్వారా కూడా ఒత్తిడిని అదుపు చేయచ్చు.

తగినంత నిద్ర..

నిద్ర మెదడుకు పూర్తి విశ్రాంతినిస్తుంది. అందుకే సరిపడినంత సేపు నిద్రపోకపోతే మెదడు చురుగ్గా పనిచేయదు. ఫలితంగా సమయానికి ఏమీ గుర్తు రావు. అలాగే మెదడు కూడా ఒత్తిడికి గురవుతుంటుంది. కాబట్టి రోజూ ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. దీనివల్ల ఉదయం లేవగానే మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది. పైగా బద్ధకం లాంటి లక్షణాలు దరి చేరవు కాబట్టి మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా మతిమరపు అనే సమస్యే ఉండదు. అలాగే 'ఎర్లీ టు బెడ్.. ఎర్లీ టు రైజ్' సిద్ధాంతాన్ని కూడా అనుసరించడం చాలా మంచిది. ఎందుకంటే ఉదయాన్నే నిద్ర లేచేవారిలో మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

రివర్స్ చేద్దాం..

మీరు చేతికి వాచీ ఎలా పెట్టుకుంటారు? 'ఇదీ ఒక ప్రశ్నేనా? టైం చూడటానికి వీలుగా పెట్టుకుంటాం' అంటారా? అయితే ఈసారి అలా కాకుండా వాచీని తిరగేసి పెట్టుకోండి. ఎందుకంటే వినడానికి ఇది సిల్లీగా ఉన్నా మన జ్ఞాపకశక్తిని పెంచుతుందట. ఎందుకంటే తిరగేసి వాచీ పెట్టుకున్నప్పుడు మొదట్లో సమయం తెలుసుకోవడానికి కాస్త ఇబ్బంది పడతాం. కానీ అలవాటయ్యే కొద్దీ మనకు ఎలాంటి కష్టమూ అనిపించదు. ఎందుకంటే మన మెదడుకి వాచీ ఎలా ఉన్నా అంటే ఏ దిశలో ఉన్నా సమయాన్ని గుర్తించగలిగే సామర్థ్యం వస్తుంది.

వీటితో పాటు రోజూ వ్యాయామం చేయడం, కాఫీ, టీలకు దూరంగా ఉండడం, చేసే పనిని కొత్తగా చేయడానికి ప్రయత్నించడం మొదలైన వాటి ద్వారా మెదడు మరింత హుషారుగా పనిచేస్తుంది. ఫలితంగా మతిమరపు సమస్య వేధించకుండా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని