పిల్లలు పుట్టాక దూరం పెరగకుండా..!

భార్యాభర్తల బంధం అంటే మూణ్నాళ్ల ముచ్చట కాదు.. అది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయేది. అయితే సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గుతుందని చాలామంది అంటుంటారు. ఈ సమయంలో వారి ధ్యాసంతా పిల్లల మీదకే....

Published : 26 May 2022 21:07 IST

భార్యాభర్తల బంధం అంటే మూణ్నాళ్ల ముచ్చట కాదు.. అది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయేది. అయితే సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గుతుందని చాలామంది అంటుంటారు. ఈ సమయంలో వారి ధ్యాసంతా పిల్లల మీదకే మళ్లిస్తారని, ఇద్దరూ తమ ప్రేమనంతా పాపాయి పైనే చూపి.. 'పాపే మా ప్రాణం..' అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారని అభిప్రాయపడుతుంటారు. ఇది మంచిదే.. కానీ పుట్టిన పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో.. భార్యాభర్తలు కూడా ముందులాగే ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం, భాగస్వామిని బాగా చూసుకోవడం చేయాలి. అయితే ఇందుకు ఇంతకుముందు లాగా ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడానికి వీలు దొరక్కపోవచ్చు. కాబట్టి వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక రూపంలో ఒకరి ప్రేమను మరొకరికి అందించాలి. దీంతో పిల్లలు పుట్టిన తర్వాత కూడా అనుబంధాన్ని మరింత దృఢం చేసుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

పంచుకోవాలి..

ఇద్దరు ఉన్నప్పుడు ఉండే బాధ్యతల కంటే ముగ్గురైనప్పుడు అదనంగా మరికొన్ని కొత్త బాధ్యతలు వచ్చిపడతాయి. వీటిని ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. ఉదాహరణకు.. భార్యే ఇంటి పనులు, పాపాయి అవసరాలు చూసుకోవాలంటే అన్నిసార్లూ కుదరకపోవచ్చు. కాబట్టి ఇంటి పనుల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడం లేదంటే ఒకరు ఇంటి పనులు చేసుకుంటుంటే.. మరొకరు పాపాయిని ఎత్తుకోవడం, ఆడించడం.. వంటివి చేయాలి. అయితే ఈ సమయంలో ఒకవేళ పాపాయి ఏడ్చి.. ఎంతకూ వూరుకోకపోతే.. భాగస్వామిపై చిరాకు పడడం, వారిని ఏదో ఒకటి అనడం చేయకూడదు. నెమ్మదిగా పాపాయిని బుజ్జగించాలి. ఏడుపు మాన్పించాలి. ఇలా ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పోతే అటు పనులూ పూర్తవుతాయి.. ఇటు ఇద్దరి మధ్య బంధమూ పటిష్టమవుతుంది. అలాగే పాపాయికి ఏ లోటూ లేకుండా కూడా జాగ్రత్తపడచ్చు.

వీలున్నప్పుడల్లా..

దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే.. ఇద్దరూ కలిసి ప్రేమగా మాట్లాడుకోవడం కూడా ముఖ్యమే. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే.. పాపాయి ఆలనాపాలనా చూసుకోవడానికే సమయం సరిపోతుంది. అలాగని భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేసుకోవడం కూడా సరికాదు. కాబట్టి పాపాయి అవసరాలు తీరిన తర్వాత, తను పడుకున్నప్పుడో, ఆడుకుంటున్నప్పుడో.. ఇద్దరూ కలిసి కాసేపు ప్రేమగా మాట్లాడుకోవడం, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవడం.. వంటివి చేయాలి. అలాగే పాపాయిని చూసుకోవడానికి ఇంట్లో కుటుంబ సభ్యులెవరైనా ఉన్నట్లయితే.. వారికి పాపాయిని చూసుకోమని చెప్పి.. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకురావడం, పాపకు కావాల్సినవి కొనుక్కురావడం, అలా కాసేపు బయట గడపడం.. వంటివి చేస్తే ఇద్దరి మధ్య ప్రేమ, అర్థం చేసుకునే గుణం మరింతగా పెరుగుతాయి.

ఇంట్లోనే సరదాగా..

పిల్లలు పట్టిన తర్వాత ఇంట్లోనే పాపాయితో సరదాగా గడుపుతూ కూడా భార్యాభర్తలు వారి బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు. బుజ్జాయితో కలిసి సెల్ఫీలు దిగడం, ఆడించడం, దంపతులిద్దరూ ఒకరికి ఇష్టమైన వంటకాలు మరొకరు తయారుచేసి సర్‌ప్రైజ్ చేయడం, నచ్చిన సినిమాలు చూడడం, కాసేపు పాటలు వినడం.. వంటివి చేయాలి. దీంతో ఇద్దరి మధ్య బంధం బలపడడంతో పాటు, ఇద్దరికీ రోజువారీ ఒత్తిళ్ల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అలాగే పెళ్లిరోజు, పుట్టినరోజు.. వంటి ప్రత్యేక సందర్భాలలో కూడా ఎప్పటిలానే ఒకరికొకరు నచ్చిన బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, నచ్చిన రీతిలో ఇద్దరూ కలిసి సమయం గడపడం.. వంటివి మర్చిపోకూడదు.

చెకప్ కోసం కూడా..

పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం పాటు నిర్ణీత వ్యవధిలో డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చెకప్‌లు చేయించడం, టీకాలు వేయించడం వంటివి తప్పనిసరి. ఇలాంటి సమయాల్లో కూడా దంపతులిద్దరూ కలిసి ఆస్పత్రికి వెళ్లడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. అలాగే పాపాయికి తల్లిదండ్రులకు మధ్య బంధం కూడా బలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్